జన్మానికో శివరాత్రి! (శివుని స్వగతం)

జన్మానికో శివరాత్రి!

“ఈ రోజు కనీసం ఒక్కళ్ళకైనా మోక్షం ఇచ్చేయాలి. తా వలచింది రంభ, తా మునిగింది గంగ , అనుకునేవారికైనా ఈరోజు తెగించి మోక్షం ఇచ్చేస్తాను.

తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పడితున్నాయి, వెదికివెదికి కళ్ళు అలసిపోతున్నాయి. నిరాశ నీరసం తెప్పిస్తుంటే, ఆశ ముందుకు లాగుతోంది ఆ ఒక్కడి కోసం.

భక్తిలో కొట్టుకుపోతున్నారు, వెర్రిగా కేకలు పెడుతున్నారు, ఉరుకులుపరుగులుగా పూజకు పోటెత్తుతున్నారు, పారవశ్యం ఏట్లో కలిసి- ప్రారబ్ధంలో పండిపోతున్నారు. నామజపం చాలంటే, ఉపవాసపు హహాకారాలతో వెర్రెత్తిపోతున్నారు.

లైన్లలో తోసుకుపోయేవాడిని ఒకడిని ఆపి, ‘నాతోరా, మోక్షం ఇచ్చేస్తాను ! ‘, అంటే నా అస్థిత్వాన్నే ప్రశ్నిస్తాడు ఆ ఒకడు, ‘ఎంత తీస్కుంటావ్ ?’ అంటాడు మరొకడు, మొక్షం ఇస్తానని ఎంత మందికి చెప్పినా, ఎవడూ నమ్మడే? ముందు దర్శనం అవ్వనీ, పుణ్యం సంపాదించనీ, ఆ పుణ్యాన్ని అరగకరగబెట్టుకుని, అన్నీ అనుభవించి వచ్చేస్తా, అప్పుడు ఇద్దువు గాన్లే “మోక్షం”, అని కౌంటర్ ఆఫర్లు వెల్లువెత్తిస్తున్నారు.

తక్కెడలో పాపం & పుణ్యం బరువు తేలుతుందికానీ, రెండు కలిసిపోయి, సున్నకి సున్న హళ్ళికి హళ్ళి అయిపోయి తక్కెడ తేలికైపోదు. తక్కెడ తూకన్ని మాత్రమే చూపిస్తుంది, తూకం సరిచేసుకోవడం, బరువు వదిలించుకోవడం, ఎవడిది వాడే చేస్కోవాలి.

లాజిక్ మర్చిపోయి, మేజిక్ కోసం వెంపర్లాట.అయినా సరే, ఈరోజు తెగించి ఎవడికో ఒకడికి మోక్షం ఇచ్చేస్తాను. తప్పదు, ఇచ్చేస్తాను.

అసలు, “నన్ను తప్పుకోమంటావా? నాలో ఆత్మను తప్పుకోమంటావా?” అనే ప్రశ్నను ఆదిశంకరడుకి వేశాననేది కథలాగే చదువుతారు, నిజమని ఒక్కడూ నమ్మడే, ఆచరించడే? తేడాలు, పొరపొచ్చాలు, ఎక్కువతక్కువలు, బేధాలు, మోదాలు, ఖేదాలు. ఇవన్నీ సరే, బుద్ధిలోనే ఇన్ని ఉంటే, కర్మలో కూడా అదే జరుగుతుంది. అయినా సరే, ఈ సారి ఎవడికో ఒకడికి మోక్షం ఇచ్చేస్తాను.

జన్మానికో శివరాత్రి అనుకుంటూ, ప్రతి సంవత్సరం ఎన్ని శివరాత్రులు ఈ భూమ్మీదకు వచ్చి తిరిగివెళుతున్నా, ఆ ఒక్కడు దొరకడే.కలడు కలడనువాడు ఇలలో కలడో లేడో? వాడెప్పుడు దొరుకుతాడో, మోక్షం ఎప్పుడు పుచ్చుకుంటాడో?

నా జన్మానికెప్పుడో ఆ శివరాత్రి?

“#శివోహం

#శివరాత్రి

#మహాశివరాత్రి

#అంతర్వాహిని_కథలు

1

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

How to take better mobile photos!

There are so many photography enthusiasts out there—but most still

హిందీ పాటలు – లిరిక్స్-2

 Chaudvi ka chand ho -Rafi-Shakeel-Ravi चौदवीं का चाँद हो या