
సృష్టి ఆరంభంలో నాలుకకు ఎముక ఉండేదిట. అబద్ధం ఆడకుండా సృష్టికర్త చేసిన ఏర్పాటది. సృష్టి వర్ధిల్లుతున్న కొద్దీ అందులో అనేకమైన కొత్త కొత్త ప్రాణులు వచ్చి చేరాయి. పాము, కప్ప ఆ కొత్తగా చేరినవాటిలోవి.
అలా ప్రాణులు వేలల్లో పెరిగిన కొద్దీ వాటిని నియమంగా నడపడానికి నాయకత్వం అవసరమయ్యింది. సృష్టికర్త బుర్ర, బుద్ధి ఎక్కువగా ఉన్న మానవుడికి అప్పజెప్పాడు. మానవుడు సర్వరాశులకు పాలకుడయ్యాడు.
ఈ నిర్ణయాన్ని మిగతా జీవరాశులు వ్యతిరేకించాయి. మిగతా జీవరాశుల మీద మానవుడి పెత్తనం ఏమిటని, తమ అభిప్రాయానికి విలువ లేదని వాపోయాయి. అప్పుడు సృష్టికర్త, సర్వ సమర్ధులు గనుక మానవులే భూమికి పాలకులుగా ఉండాలి అయితే వాళ్లలో మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకునే అవకాశం మాత్రం మీకు ఇస్తున్నాను. మీకు నచ్చిన మానవుడిని ఎన్నికల ప్రక్రియ ద్వారా మీరు మీ పాలకుడిని నిర్ణయించుకోవచ్చు అని చెప్పాడు. జీవ రాశులన్నీ అందుకు సమ్మతించాయి.
అప్పటి దాకా అన్ని జీవరాశులు శాకాహారులు. సృష్టిలోని ఆకులు, ఫలములు తింటూ అన్ని రాశులు సామరస్యంగా బతికేవి. ఒక రోజు ఒక పాము నేల రాలిన పండుని గుటుక్కున మింగింది. ఆ పండు అంతకు ముందు ఎప్పుడూ తను తిన్న పండులా అనిపించలేదు. అలానే పడి ఉన్న ఇంకో పండును మింగబోయింది. ఈ సారి పండు నెమ్మదిగా కదిలింది అయినా గుటుక్కున మింగింది. అలా అక్కడ కదులుతున్న పండ్లన్నిటినీ స్వాహా చెయ్యడం మొదలుపెట్టింది. పాము కప్ప రుచికి బాగా అలవాటుపడింది.
కొన్నాళ్ళకి కప్పలకి ఈ విషయం అర్ధమయ్యింది. పాలకుల వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నాయి. పాలకుడు ఇక పై పాములు కప్పలను తినడానికి వీలు లేదని జీ.ఓ పాస్ చేశాడు. ఆ నిర్ణయం పాములకు కోపం తెప్పించింది. అన్ని పాములు కూడబలుక్కుని తరువాతి ఎన్నికల్లో పాలకుడిని ఓడించాయి. మరో పాలకుడు పాములు కప్పలను తినవచ్చని ఆర్డర్ పాస్ చేశాడు. ఈ సారి కప్పలన్నీ కలిసి పాలకుడిని ఓడించాయి. ఏం చేయాలో అంతుపట్టని మానవులు సృష్టికర్త దగ్గరకి వెళ్లారు. “కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకు కోపం” మమ్మల్ని ఏం చెయ్యమంటారు అని వాపోయారు.
అప్పుడు సృషికర్త “ఏ జీవికీ లేని బుద్ధిని మీకు ప్రసాదించాను. మీరే ఒక ఆలోచనతో నా దగ్గరకు రండి. మీకు కావాల్సింది ఇస్తాను” అన్నాడు. అప్పుడు మానవులు బాగా ఆలోచించి అలా అయితే “మా నాలుకకు ఉన్న ఈ ఎముకను తీసేయండి. అప్పుడు మేము ఇరు పక్షాలను ఆనందంగా ఉంచగలము అన్నారు. సృష్టికర్త “తథాస్తు” అన్నాడు.
మళ్లీ కొత్త పాలకుడు ఎన్నికయ్యాడు. పాములు కప్పలను తినవచ్చని పాములకి, పాములు ఇక పై కప్పలను తినవని కప్పలకి హామీలు ఇచ్చాడు. కానీ పాములు కప్పలను తినడం ఆపలేదు. కప్పలకి అంతులేని కోపం వచ్చింది అన్నీ కట్టగట్టుకుని పాలకుడి కార్యాలయం ముందుకు వెళ్లి పాలకుడిని నిలదీశాయి. “ఎన్నికల ముందు పాములు కప్పలను తినవని హామీ ఇచ్చాడు” ఒక కప్ప బెక బెకమని గర్జించింది. అప్పుడు పాలకుడు ఆ చనిపోయిన కప్పల కుటుంబానికి లక్ష ఎక్స్ గ్రేషియా ఇచ్చాడు. “మన విధిరాత అలా ఉంటే ఎవ్వరు మాత్రం ఏం చేస్తారు” అని సర్దిచెప్పుకుని కప్పలు వెనుతిరిగాయి.
పూటకో మాట మాట్లాడుతూ, అలివిగాని హామీలు ఇచ్చే నాయకుల ప్రస్థానం నిరాటంకంగా సాగిపోయింది.