మల్లితో ముచ్చట

రచనా ప్రక్రియ అనేది ప్రయత్న పూర్వకంగా అలవడుతుందాసహజసిద్ధమైన లక్షణమాఅది ఎవరికైనా సాధ్యమేనా? Can you consciously decide and become a story-teller?

రచనను ఒక క్రాఫ్ట్‌గా చూసుకుంటే, ఆ క్రాఫ్ట్ నేర్చుకుంటే వస్తుందా అంటే కచ్చితంగా వస్తుంది. నిజానికి రచయితలనేవాళ్ళంతా ఈ క్రాఫ్ట్‌ని సాధన చెయ్యాల్సిందే. అలాగని క్రాఫ్ట్ నేర్చుకోవడం ద్వారానే కథలు రాయగలమా అంటే రాయలేమనే చెప్తాను. ‘ఇది సహజసిద్ధంగా వచ్చే లక్షణం, రక్తంలో ఉంటుంది.’ ఇలాంటి మాటలు నేను మాట్లాడను. స్వభావరీత్య మనలో సమాజాన్ని దగ్గరగా చూసి మనుషుల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకునే లక్షణం ఏదో ఉండాలని అనుకుంటాను. ఎంపతీ, హానెస్టీ కథలు చెప్పడానికి కచ్చితంగా ఉండాలి. ఇది నేర్చుకుంటే వచ్చేదా అనేకంటే ఇదే ఒక వే ఆఫ్ లైఫ్ కావాలి.  

రచయిత తన చుట్టూ నిర్మించుకునే ప్రపంచంలోపాఠకుడికి ముందునుండీ ఒక స్థానం ఉంటుందాఅంటేచదువరుల స్థితిస్థాయిలనుసరించి రచన సాగుతుందాలేకకథ తనను తాను మలచుకొనితనదైన రూపంలో మాత్రమే పాఠకుడిని చేరుతుందా?

రచయితలందరి తరపున చెప్పలేను గానీ, నాకైతే రాయడమనేది చాలా పర్సనల్. ఏదైనా రాసేటప్పుడు, ఇది చదివేవాళ్ళు ఎలా తీసుకుంటారని ఒక్కసారైనా ఆలోచించను. ఒక పాఠకుడ్ని ఊహించుకొనైతే నేను కథ రాయలేను. 

రచయిత దృష్టి పెట్టాల్సింది తన మనసులో మెదిలే కథాంశంతన భావోద్వేగాల పైననాలేక ఆ రచనతో తను చేరదలచిన పాఠకుల ఒప్పుదల పైనా?  

కచ్చితంగా కథాంశం, తన భావోద్వేగాలపైనే అనుకుంటాను. పాఠకులు ఏమనుకుంటారని ఏదైనా రాస్తే, మనకు మనమే ఆ రచనకు మెల్లమెల్లగా దూరమవుతామేమో. అయితే జాన్రా ఫిక్షన్‌లో రచయితకు పాఠకుడి ఒప్పుదలతో అవసరం ఉంటుందనుకుంటాను. 

సమకాలీన కథావస్తువు అధికతమంగా ఏ విషయపరంగా ఉంటున్నదికథావస్తువుల ఎంపికలో వైవిధ్యం ఏ మేరకు కనపడుతున్నదిఏ విషయం పట్ల అలక్ష్యం చూపుతున్నారు?

తెలుగు సాహిత్యమనే కాదు, ఎక్కడైనా కొన్నాళ్ళపాటు ఒక ట్రెండ్ ఉంటుందేమో. నేను చదవడం మొదలుపెట్టిన రోజుల్లో అస్తిత్వ ఉద్యమాల ప్రభావం వల్లనేమో ఆ రచనలు ఎక్కువగా కనిపించేవి. గత కొన్నాళ్ళుగా ప్రేమకథలు చాలా చెప్తున్నారు. నేటి తరం ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలను కథల్లోకి తీసుకురావడం కూడా ఉంది. అలక్ష్యం చేస్తున్నారని చెప్పను గానీ, స్త్రీ పురుష సంబంధాల్లోని కాంప్లెక్సిటినీ చూపించడం తక్కువ ఉందనిపిస్తోంది. 

ఈనాటికి కూడా వివిధ రచనా ప్రక్రియలకు పాఠకలోకంలో ఆదరణ వుందానవలలునాటికలుగేయ రూపక కథా రచనలను చదువరులు స్వాగతిస్తారా?

నవలలు, కథలు ఇప్పటికీ బాగా చదువుతున్నారు. కవిత్వానికి కూడా ఆదరణ ఉంది. నాటికలు, గేయ రచనలకు పాఠకుల ఆదరణ పక్కనబెడితే రచయితలే అటువైపు చూడటం తగ్గిపోయింది కదా! సినిమాలకు పాటలు రాయడాన్ని పూర్తిస్థాయి కెరీర్‌గా తీసుకున్న కవులు కూడా ఉన్నారుగా. 

ఎందువలన ఇటువంటి రచనా ప్రక్రియలు మరుగున పడుతున్నాయివీటి పట్ల రచయితలు ఎందుకు ఉదాశీనంగా ఉంటున్నారు?

పైన చెప్పినట్టు కథలు, నవలలు చదవడంలో ఉన్న సౌకర్యం ఇతర ప్రక్రియల్లో లేకపోవడం వల్ల అనుకుంటాను. అలాగే సినిమాలకు దగ్గరైన తర్వాత పాఠకులే తగ్గిపోయిన చోట రచయితలైనా ఈ ప్రక్రియల పట్ల ఆసక్తి చూపించి ఏం చేస్తామనుకొని ఉండొచ్చు!

మన సినిమాలునవలలు ఇంకా కూడా బాహాటంగానోఅంతర్లీనంగానోమనకున్న పురాణ ఇతిహాస కథలనుజానపద గ్రామీణ ప్రాంతాల గాథలనూ ఆధారంగా చేసుకుంటాయి. వీటికెందుకింత ఆదరణసమకాలీన రచయితగాఒక పాఠకుడిగా వీటిని మీరెలా చూస్తారు?

బహుశా పురాణ ఇతిహాస గాధలు మన జీవితాల్లో భాగమైపోవడం వల్లనేమో, మనం కథలు చెప్పే క్రమంలో ఆ శిల్పం వచ్చి చేరుతుందేమో. ఇంకొకటి ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా సులువుగా చెప్పే నేర్పు మనకు అక్కడ్నించి వచ్చిందనుకుంటాను. నేను రచయితగానైనా పాఠకుడిగానైనా కథ చెప్పడానికి అవసరమైనప్పుడు వీటిని వాడితే తప్పేమీ లేదనుకుంటాను. పురాణాలను మెటఫర్‌గా వాడి చెప్పే ఆల్టర్నేట్ కథల్ని చదవడానికి నేనంత ఇష్టపడను. 

కవి/రచయిత సమాజం తన ఎదుట ఉంచుకున్న నిలువుటద్దమంటారు. ప్రస్తుత పరిస్థితులలోఇది నిజమేనా

సమాజం దీన్ని నమ్ముతోందా? సినిమాలను సినిమాలుగా చూడండి అనే రోజుల్లో ఉన్నాం కదా. సాహిత్యానికైనా అలాంటి పరిస్థితే ఉందేమో. నేనైతే సమాజాన్ని కొంచెం దగ్గరగా చూసి అర్థం చేసుకొని చెప్పేవాడు రచయిత అనుకుంటాను. 

ద్రష్ట/స్రష్టగా నిలబడటానికి రచయితకుండాల్సిన లక్షణాలేంటిఅతడిలో మనం చూడవలసిన నిబద్ధత ఏంటి

నిజాయితీ, సహానుభూతి ఇవి ఒక రచయితకు తప్పకుండా ఉండాలనుకుంటాను. ఒక్కసారి బయటికొచ్చి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించి చూడగలిగితే మనకెన్నో కథలూ ఎందరో మనుషులూ తారసపడుతుంటారు. అన్ని కథల్నీ రాయాల్సిన అవసరం కూడా లేదు. అలా బతికేస్తే ఎప్పుడో రాయాల్సిన కథలు రాయాల్సిన రోజు తప్పకుండా వస్తుంది.  

రచయిత/కవి సమాజ స్థితిగతుల లోపాలను ప్రశ్నించి తీరాలాఆ విధమైన బాధ్యత వ్యక్తమైనదే ఉత్తమ రచన అనుకోవాలా?

సమాజంలోని లోపాల్ని రచయిత కచ్చితంగా ఎత్తి చూపాలి. మనం ఏ వైపు నిలబడాలో తెలియకపోతే, అర్థం చేసుకోకపోతే మనం రాసే రచనలకు అర్థం ఏముంటుంది? అయితే అదే ఉత్తమ రచన అవుతుందని కూడా అనుకోవాల్సిన పని లేదు.  

మీ ఆలోచనలో సామాజిక బాధ్యత అంటే ఏమిటిమీ రచనలు ఆ బాధ్యతకు లోబడిఆ నిర్వచనానికి కట్టుబడి ఉంటాయా?

పై సమాధానానికి కొనసాగింపుగానే చెప్తాను. సామాజిక బాధ్యత అందరు పౌరులకు ఎలా ఉండాలో, రచయితలకు ఇంకాస్త ఎక్కువే ఉండాలి. మన కథలు పనిగట్టుకొని ఒక సామాజిక సమస్యను చెప్పకున్నా, మనం కథ చెప్పే తీరులో పాత్రల్ని మలిచే తీరులో మనిషిగా ఈ రచయిత ఎక్కడున్నాడన్నది తెలిసిపోతుంది. అంటే నేనొక స్త్రీవాద కథ చెప్పాలని ఒక కథ రాయాల్సిన పనిలేదు. నేను స్వతహాగా స్త్రీవాదిని అవ్వడం వల్ల ఆ కథ చెప్పేటప్పుడు నేనెంత కట్టుబటి ఉంటానో అర్థమైపోతుంది. అలా చూసినప్పుడు ఈ బాధ్యత ఇన్నేట్‌గా మనలో ఉండే క్వాలిటీ అయ్యుండాలి, కథ రాయడానికే పుట్టుకొచ్చే ట్యాగ్ కాకూడదు. 

ఈ సందర్భంలోనేపలుకు.ఇన్ ద్వారా తమ రచన/పఠనాసక్తులను మెరుగు పరచుకోవాలనుకునే మిత్రులకు ప్రోత్సాహకరంగామీరు ప్రశ్నోత్తరాలుకథా పరిచయం/విశ్లేషణ వంటి శీర్షిక ఏదైనా మీ అనుకూలత ప్రకారం నిర్వహించగలరా?

తప్పకుండా! ఈ రోజుల్లో ఒక వెబ్ మ్యాగజైన్ నడపాలన్న ఆలోచన రావడమే పెద్ద విషయం.మీరు ఇంత ఇష్టంగా ఈ బాధ్యత తీసుకున్నారు. నన్నొక వర్క్‌షాప్ లాంటిది ఏదైనా నిర్వహించమంటే తప్పకుండా నిర్వహిస్తాను. 

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

హిందీ పాటలు -లిరిక్స్

Roman Script Hamne Dekhi Hai Un Aankho Ki Mehekti KhushbooHaath

నా ఇరాన్ యాత్ర -2

నా ఇరాన్ యాత్ర -2 గత సంచిక తరువాయి. లోపలికి ఎంటర్ అయ్యాము.