బాల్కనీలోని ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడి, చీకటి కమ్మిన ఆకాశంలోకి దృష్టి సారించింది ప్రియ. నిశ్శబ్దం… గాలి కూడా కదలని నిశ్చలత. ఆకాశం మేఘాలతో కప్పబడి, చంద్రుడు, చుక్కలు కనిపించటం లేదు. వర్షం వస్తుందేమో అనిపించింది. కరెంటు పోయి, చుట్టూ చీకటి. గదిలోనూ అంధకారమే. ఇన్వర్టర్ పనిచేయక చాలా కాలమైంది. కొవ్వొత్తి వెలిగించాలన్న ఆలోచన కూడా రాలేదు. “వస్తానన్నాడు…” అనుకుంటూ లోపలికి వచ్చి, సోఫాలో కూర్చొని ఫోన్ తీసింది. కానీ, అది తనలాగే మౌనంగా, బ్లాంక్ స్క్రీన్‌తో నిశ్చలంగా ఉంది.

మళ్లీ బాల్కనీ వైపు చూసింది. వర్షం మొదలైంది—మొదట చినుకులుగా, కొన్ని నిమిషాల్లోనే కుండపోతగా మారింది. ఫ్రెంచ్ విండో అద్దాలపై వర్షం గులకరాళ్లలా కొట్టుకుంటూ శబ్దం చేస్తోంది. అద్దాల గుండా ఏమీ కనిపించడం లేదు; వర్షపు ధారలు దృష్టిని కప్పేసాయి. ఉరుములూ, మెరుపులూ లేవు—కేవలం వర్షం యొక్క లయబద్ధమైన శబ్దం మాత్రమే.

ఈ చీకటిలోనూ, గదిలోని ప్రతి వస్తువు ఎక్కడుందో ప్రియకు ఖచ్చితంగా తెలుసు. ఈ సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో ఆమె, అశోక్ గత ఐదేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన రోజుల్లో వీరిద్దరి పరిచయం జరిగి, ఇప్పటికి పదేళ్లు గడిచాయి. హాల్లో సోఫాకు ఎదురుగా టీవీ—అది కొనేటప్పుడు చిన్నది తీసుకుందామని ప్రియ అంటే, “పెద్దదే కావాలి, డీటెయిల్స్ బాగా కనిపిస్తాయి, గదిని చీకటి చేసి సినిమా చూస్తే నువ్వు కథలో లీనమైపోతావు తెలుసా” అని అశోక్ పట్టుబట్టాడు.

అశోక్‌కి సినిమాలంటే పిచ్చి. కథలు చెప్పడమైనా, తెరపై చూడడమైనా—అతనికి అదో లోకం. సినిమా విషయంలో అతను హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రతి వివరాన్నీ క్షుణ్ణంగా గమనిస్తాడు. కానీ ప్రియ అలా కాదు—సినిమా నచ్చకపోతే మధ్యలోనే ఆపేయమంటుంది. “వాళ్లు కష్టపడి తీశారు కదా, మనమే చూడకపోతే ఎలా. మన కులమే కదా వాళ్ళాడు కూడా” అనేవాడు అశోక్.

ఇప్పుడు అతను ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. “షూటింగ్ కదా, షెడ్యూల్స్, ప్లానింగ్… తీరికే దొరకడం లేదు” అంటూ ఉంటాడు. సినిమా ప్రపంచంలోకి వెళితే అతను బయటి లోకాన్ని మరిచిపోతాడు. కానీ ప్రియకు షూటింగ్ ప్యాకప్ అయితే పని అయిపోయినట్టే. అయినా, ఈ మధ్య అశోక్ అతిగా పనిచేస్తున్నాడు.

మళ్లీ బాల్కనీ వైపు చూసింది ప్రియ. వర్షపు చినుకులు లయబద్ధంగా కురుస్తూ ఇళయరాజా సంగీతంలా అనిపించాయి. చీకటిలో ఎవరో తనను గమనిస్తున్నట్టు ఒక భావన. ఆ ఆకారం తననే తీక్షణంగా చూస్తోందేమో అని వెన్నులో వణుకు మొదలైంది. కర్టెన్లు వేద్దామనుకుంది, కానీ అలాగే వదిలేసింది. ఆలోచన నెమ్మదిగా అశోక్ వైపు మళ్లింది.

అశోక్ ఎంత సపోర్టివ్! ఇక్కడ పోటీ తట్టుకోలేక ఊరు వెళ్ళిపోతాను లేకపోతె ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను అంటే “నువ్వు చేయగలవు, ఇక్కడే ఉండి ప్రయత్నించు” అనేవాడు.  తాను ఉద్యోగం చెయ్యటం లేదు సినిమాల్లో పనిచేస్తున్నాను అని తెలిసి అమ్మానాన్న ఎన్ని మాటాలన్న నోరుమూసుకుని భరించమన్నాడు. “వాళ్లకి ఇండస్ట్రీలో చెడె కనిపిస్తుంది, మనం ఎదుగుతే మళ్ళి వాళ్ళే మనల్ని గర్వంగా చూస్తారు” అనేవాడు. తాను ఈరోజు ఇలా ఉండడానికి కారణం అశోకే, అతను లేకపోయి ఉంటె ఇలా కూడా ఉండడం కష్టమయ్యేది ఏమో.

ఫ్రెంచ్ విండో తలుపు సరిగ్గా వెయ్యలేదేమో చిన్నగా గాలి వస్తుంది. సోఫాకి ఎదురుగా టీపాయ్ మీద ఉన్న కాగితాలు ఆ గాలికి రెపరెపలాడుతున్నాయి, వాటి పైన బరువేమి పెట్టలేదు గాలి కాస్త పెరిగేసరికి అవి ఎగిరాయి, తీయాలనుకుంది, కానీ “కరెంటు వచ్చాక చూద్దాం” అని వదిలేసింది. ఆ ఆకారం ఇంకా తననే చూస్తున్నట్టు అనిపించినా అటు తల తిప్పి చూడడానికి ధైర్యం సరిపోవడం లేదు.

లోపల బెడ్రూమ్లో తాను పడుకుంటే ఇక్కడ హాళ్ళో సోఫాపై అశోక్ పడుకుంటాడు, అందుకే సోఫా వదిలి వెళ్లాలని ఉండదు. సోఫాలో కూర్చుంటే అశోక్ తో ఉన్నట్టు అనిపిస్తుంది ప్రియకి. వాళ్లిద్దరి సంబంధం స్నేహమని మొదట్లో జనాలకు చెప్పడానికి ప్రయత్నించారు, తర్వాత విరమించుకున్నారు. “జనాలకి ఏముంది ఏదో ఒకటి వాగుతారు” అంటాడు. ఇదే విషయం ప్రియ అమ్మానాన్నలకు కూడా చెప్పడానికి చాలా పర్యాయాలు ప్రయత్నించారు ఇద్దరు. “ఈ సినిమావాళ్లు ఇంతే, అంతా రంకే” అంటూ వారు ప్రియని పట్టించుకోవడం మానేశారు.

సోఫా నుండి ఎడమవైపు బాల్కనీ – అక్కడినుండి  ఆ ఆకారం ఇంకా వెళ్లినట్టు లేదు తననే చూస్తుంది. కుడివైపు మెయిన్ డోర్. అటువైపే చూస్తూ  “ఎప్పుడో  వస్తానన్నాడు ఇంకా రాలేదేమిటి?” అనుకుంటుండగా తలుపు తెరిచిన శబ్దం.  బయటకు చూసింది —తడిసిన బట్టలతో అశోక్ వెనుక ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారు. లోపలికి వస్తూనే ఎమర్జెన్సీ లైట్ వేసాడు, ఆ వచ్చిన వాళ్ళు ప్రియని కదిలించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆమె కదలడం లేదు. “సాయంత్రం కీమో నుండి తెచ్చినప్పుడు బానే ఉండేది… అరగంట క్రితం రూంకి వచ్చి చూస్తే ఇలా…” అంటూ అశోక్ ఏడుస్తున్నాడు.

బాల్కనీలో ఆ ఆకారం నెమ్మదిగా చీకటిలో కలిసిపోయింది. 

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

మ్యాట్ని!

మ్యాట్ని ! ((ఈరోజు శనివారం, శెలవు రోజు! ఇంట్లో మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!))

ఆకొన్న కూడె యమృతము

పూర్వం ధారా నగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు కాపురముండేవాడు. భుక్తి గడచేది కాదు.