చీకటి, నిశ్శబ్దం

పెళ్ళైన వారానికి ఇంటాయన నన్ను, ఆ ఇంటిపైన పడకగది మధ్యలో ఉన్న దూలానికి ఓ రెండు ఇనుప పట్టీలతో నట్టు బోల్ట్‌లతో బిగించారు. అది నా జీవితానికి నాంది. మొదట్లో, రాత్రి 8 గంటలకు తిరగడం మొదలుపెడితే ఉదయం 5 కల్లా ఆగిపోయేదాన్ని.

కొత్తగా పెళ్లైన జంట వారి మధుర క్షణాలను, చెవుల్లో గుసగుసలను, చెమటతో తడిసిన శరీరాలను, నా గాలిని ఆస్వాదిస్తూ నిట్టూర్పులను చూస్తూ నేను మురిసిపోయాను. దాదాపు 7-8 నెలలు ఆ గది కళకళలాడింది. ఆ తర్వాత ఒక నిశ్శబ్దం అలుముకుంది.

కొన్ని రోజులకు, ఆ ఇంట్లో భార్య ఓ చిన్న పిల్లాడిని పట్టుకొని ఆ గదిలోకి వచ్చింది. అప్పటి నుండి నేను ఇంచుమించు రోజంతా తిరుగుతూనే ఉన్నాను. మళ్ళీ ఆ గది వారి గుసగుసలు, పిల్లాడి ఏడుపులతో కళకళలాడటం మొదలుపెట్టింది. వాడికి రెండు సంవత్సరాలు వచ్చేసరికి మళ్ళీ గదికి నిశ్శబ్దం అలముకుంది.

అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న ఆ ఇంటి యజమాని కోసం నేను తిరుగుతూ, లేదా ఎవరూ లేని ఆ గదిలో నిశ్శబ్దంగా కాలం గడిపాను. ఆ గదే ఒక ఇల్లా లేక ఇల్లే ఒక గదా నాకు తెలియదు. నాకు తెలిసిందంతా ఆ గదిలోకి వచ్చి వెళ్లిన కొన్ని ప్రాణులు మాత్రమే. వారు తిరగమన్నప్పుడు తిరగడం, ఆగమన్నప్పుడు ఆగడం.

ఇలా మరికొంత కాలానికి, ఆ గదిలోకి ఇంకో చిన్న ప్రాణి వచ్చింది. అందరూ దానిని ఇంటి లక్ష్మి అన్నారు. మళ్ళీ నేను రోజంతా తిరగడం మొదలుపెట్టాను. నేను తిరుగుతూనే ఉన్నాను, వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. మునుపటి గుసగుసలు, ముద్దుముచ్చట్లు ఇప్పుడు కొంచెం కరువయ్యాయి. వాటి బదులు “డబ్బులు, బరువులు, బాధ్యతలు” అన్నవి చాలా వినిపించాయి. కొత్తలో చిన్నచిన్నగా మాట్లాడే వీరు ఇప్పుడు అప్పుడప్పుడు అరుపులు, కేకలు వేసుకోవడం, ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం, అటువైపు తిరిగి పడుకోవడం లాంటివి జరుగుతున్నాయి. నా పని నేను తిరుగుతూ చేస్తూనే ఉన్నాను.

మొదట్లో నన్ను తరుచూ శుభ్రం చేస్తుండే వారు, ఇప్పుడు కొంచం వ్యవధి పెరుగుతూ వస్తుంది.

అప్పుడప్పుడు ఆ గదిలోకి ఇంకో వ్యక్తి వస్తూ ఉండేవాడు. పిల్లలు అతన్ని ‘మావయ్య’ అనేవారు. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. పిల్లలు కూడా చాలా ఆనందంగా అతనితో ఉండేవారు. ఒకసారి ఎప్పుడో ఆ అమ్మాయికి 8-9 సంవత్సరాలప్పుడు, ఆ వ్యక్తి ఒక్కడే ఆ అమ్మాయితో గదిలోకి వచ్చాడు. ఆ అమ్మాయిని ఎక్కడెక్కడో తాకుతూ మాట్లాడుతున్నాడు. అమ్మాయి ఎందుకో అసహనంగా కదులుతోంది. నాలోనుండి ఎందుకో ఒక మూగ అరుపు వచ్చింది. అది ఇప్పటికీ ఉంది. అలాంటివి ఓ నాలుగైదు సార్లు జరిగినట్టు గుర్తు. తరువాత ఇంకెప్పుడూ చూడలేదు. మధ్యలో నాకు కెపాసిటర్ పోయిందని, బేరింగ్ పోయిందని బయటకు తీసుకువెళ్లి మార్చారు. కానీ ఆ మూగ అరుపు మాత్రం పోలేదు. నేను అరుస్తూనే ఉన్నాను కానీ ఎవ్వరికీ వినబడలేదు.

ఈ మధ్యనే ఆ అమ్మాయికి పెళ్ళైతే ఆ గది అమ్మాయికి, అబ్బాయికి ఇచ్చారు. మళ్ళీ మొదట్లో లా గుసగుసలు వినిపించాయి, చెమటతో తడిసిన శరీరాలు, నా గాలిని ఆస్వాదిస్తూ నిట్టూర్పులు వచ్చాయి. అది కూడా ఒక మూడునాళ్ళ ముచ్చటే. మళ్ళీ వాళ్ళను చూడటం అరుదు. అబ్బాయికి కూడా పెళ్లయిందని విన్నాను కానీ వారిని చూసింది లేదు. వీరికి పిల్లలు పుట్టినప్పుడు మళ్ళీ నాకు ఎక్కువ పని పడింది కానీ అది కూడా మూడునాళ్ళ ముచ్చటే.

కాలం గడుస్తోంది, నేను తిరుగుతూనే ఉన్నాను. నేను నెమ్మది అవుతుంటే నాకు ఒక కెపాసిటర్ మారుస్తూనే ఉన్నారు. ఆ ఇంటి యజమాని ఇప్పుడు డబ్బులు, బరువులు, బాధ్యతలు గురించి మాట్లాడటం మాని ఏదో దేవుడు, పూజలు, పునస్కారాలు అంటున్నాడు. ఆవిడ కూడా ఇంచుమించు అలాగే. మనవలు, మనవరాళ్లు, పిల్లలు వచ్చినప్పుడు నా గది కొంచెం కళకళలాడుతుంది, మళ్ళీ కొన్నాళ్ళకు నిశ్శబ్దం.

ఈ మధ్యన ఆ ఇంటి యజమాని, ఆవిడ కనిపించడం మానేశారు. ఓ ఆరు నెలల తరువాత నా గదికి సున్నాలేస్తూ నన్ను తీసి ఓ డబ్బాలో పెట్టి కొట్టు గదిలో పడేశారు. ఇలా ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నానో తెలియదు, ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. చుట్టూ చీకటి, నిశ్శబ్దం.

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

టిఫిన్ ఏమిటీ

“టిఫిన్ ఏం చెయ్యను” అంటూ వంటగది నుండి వస్తూనే అడిగింది సతీమణి.“ఉప్మా” తడుముకోకుండా

“తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” ప్రసంగంపై వ్యాసము – అభిప్రాయము

అంతర్జాల వేదికగా “హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి” వారు నిర్వహించిన సదస్సులో “తెలుగు(అనువాద)