ఎంత కష్టం.. ఎంత కష్టం

జంట ఎద్దుల అరకగట్టీ
ఎద్దువోలే ఒల్లరగదీసీ
నెత్తురోడ్సీ సెమట గార్సీ
రేయిపొగులూ నేలతల్లికి
దీటుగానూ *పొగులుకుంటా (1)
ఎండవానల దుక్కిదున్నీ
కొద్దిగైనా గింజ పండితే
పట్టెడంతా కూటి కొరకై
పుట్ల పంట దళారికమ్మితే
చేతికందిన ఒక్క డబ్బూ
జేబు దంకా చేర్చబోతే
జాలి చూపక అప్పులయ్య
ఒడిసిపుచ్చుకు ఎల్లిపోతే
ఇంటిల బుడ్డోడి ఆకలి
ఆసగా నిన్నెదుకుతుంటే
ఎండుపానం నీదు పెండ్లము
కన్నీరె సన్నుగ గుడుపుతుంటే
కండ్ల ఎదటన చేను తల్లి
సుక్క నీటికి అలమటిస్తే
కుప్ప నూర్సిన కొత్త ధాన్యం
వరద తాకి బురదలైతే
జోరు వానకి *కొట్టమెల్లా (2)
కుప్పకూలీ *తొక్కటైతే (3)
తాలలేకా గొడ్డు గోదా
ఊపిరొదిలే *కాయిలైతే (4)
తాత తండ్రుల ఒక్క సెక్కా
కబ్జదారుడు నూకుతుంటే
సాయమడిగితె నేతలంతా
ఓట్లునొక్కీ మాయమైతే
నాయమిచ్చే కోరట్ల జడ్డిలు
కుంబకర్నుని నిదరలైతే
అడగబోతే లాటీల కొడుకులు
సదునుగా ఒల్లిరగదీస్తే
*బొంకులమ్మే వార్తవదినెలు (5)
వెతల కతలను అమ్ముతుంటే
పడ్డ కస్టము పాడెగట్టుక
పొలములోనే హరీమంటే
ఆస కరవై బతుకు బరువై
*ఒలికిమిట్టే నెలకువైతే (6)
ఏడ జూసిన యాడె జీవుడు
నెర్రెలిచ్చిన నేల అయితే
గడసిపోయిన నిన్న *కల్లై (7)
ఎదురూ చూసే రేపు కలయై
ఉన్న నిజమీ ఒక్క దినమూ
వొల్లకాడుల సిందులైతే
కడుపు నించని గొడ్డుశాకిరి
*కొడిగట్టు దీపపు *యాతనైతే (8, 9)
దినము రేతిరి ఒక్క తీరుగ
*మనికి మంటల కొలిమిలైతే (10)
నిన్ను తలుసుకు నీలో *నివ్వే (11)
*యాసిరై సీ గొట్టుకుంటే (12)
*ఉడ్డుకుడుసుకుపోయి జీవము (13)
*సాయనీకే *ఎదుకాడుతుంటే (14, 15)
ఎంత కష్టం ఎంత కష్టం ||

చెమటలోడ్చుకు రక్తమార్చుకు
నాకు నీకూ కంచాలు నింపీ
పట్టెడన్నం కంట చూడని
సేద్యగాడికి ఏది లాభం
రైతు డొక్కకి ఏది అన్నం
కడుపు నింపే ధరణి పుత్రా
ఎవరు నీకిక దన్ను ధైర్యం
ఎంత కష్టం ఎంత కష్టం ||

**** **** **** **** ****

కొన్ని పదాలు తికమక పెడుతున్నవని మిత్రుల ద్వారా విని ౼
1. పొగులు = తీవ్రమైన బాధ
2. కొట్టము = గుడిసె
3. తొక్కట = తొక్కిసలాట, తొక్కిడి
4. కాయిలా = రోగము, జబ్బు
5. బొంకు = అబద్ధము
6. ఒలికిమిట్ట = శ్మశానము
7. కల్ల = అబద్ధము
8. కొడిగట్టు = ఆరిపోవు
9. యాతన = కష్టము
10. యాతన = కష్టము
11. నివ్వు = నీవు
12. యాసిర, యాసరిక = విసుగు, చీకాకు
13. ఉడ్డుకుడుచు = ఊపిరాడక
14. సాయనీకె = చావుట కొరకు
15. ఎదుకాడు = వెతుకులాడు
**** **** **** **** **** ****
#పలుకు, #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #బతుకుభారం #పేదరికం

@Chandu1302

2 Comments Leave a Reply

  1. చాలా చాలా కష్టమైన విషయమే వ్యవసాయదారుని జీవితం

    అందునా (వివిధ) వ్యయాలు ఇట్టే పెరిగే రోజుల్లో

    ఫలసాయాల అన్నవి దైవాధీనం అన్న పరిస్థితుల్లో

    మనిషి సాయం(సహాయం) అన్నది నాటికీ
    తీసికట్టు నాగంభట్టు అవుతున్న నేటి సమయంలో

    (ప్రభుత్వ సంస్థల) జవాబుదారీతనం ప్రశ్నార్థకమా
    ప్రశంసాపాత్రమా అన్న రోజుల్లో

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

Evening

While flipping through life’s pages My gaze fell on a

COMPLIMENT

1977 ఏప్రిల్ 25. బ్యాంక్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి మద్రాస్ బీచ్