మళ్ళీ పెళ్లా ..


ధాతా నామ సంవత్సరం, శ్రావణ మాసం.

శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ల కాలం. నేను ఐదో తరగతి చదువుతున్న రోజులు. కాకినాడలో ఉన్న మా బామ్మా వాళ్ళ చెల్లెలి మనవరాలు పెళ్లి. అమ్మా నాన్న, బామ్మ తాతయ్య, నేను తమ్ముడు, అందరం పెళ్ళికి బయలుదేరాం. రెండు బల్ల రిక్షాలు మాట్లాడుకుని, కుటుంబమంతా కొత్త బట్టలు, దారిలోకి మరెయ్యడానికి చిరుతిళ్ళు, ఆనక నిద్ర పట్టడానికి సరిపడా భోజన సరంజామా అంతా సర్దుకుని రైల్వే స్టేషనుకు బయలుదేరాం. బాపట్ల ఆతిధ్యం ఎప్పుడైనా పొందిన వారికి బల్ల రిక్షాలు బాగా ఎరుక ఉంటుంది. వెనక రెండు చక్రాల మీద ఒక నాలుగు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు ఉన్న చెక్క బల్ల మీద నలుగురు నాలుగు మూలలకి కూర్చుంటారన్నమాట. పొద్దున్నే బామ్మ పెట్టిన మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు మీద మంచులా కరిగిపోయే వెన్న వేసుకుని , అంత కొబ్బరి చట్నీ, ఇంత కారప్పొడి కలిపి కొట్టి, గొంతుని బఱ్ఱె పాలతో కాచిన కమ్మటి కాఫీ గుటకేసి ఆ బల్ల రిక్షా ఎక్కి కూర్చున్నాక, సూర్యలంక సముద్ర తీరం నుంచి వీచే గాలి దేహమంతా తడుముతుంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి. పెళ్లి లేదు, పెటాకులు లేదు ఇంటికెళ్లి మా పాత నవ్వారు మంచం వేసుకుని హాయిగా ఇంకాసేపు కునుకు తీస్తే బాగుణ్ణు అనిపించింది .

మా తాతగారు సమయ పాలనలో ఠంఛనుగా ఉండే వ్యక్తి. రైలు తొమ్మిదింటికంటే ఇంట్లో ఏడున్నరకే బయలుదేరదీసేవారు. అంత ముందు పోయి ఏమి చేస్తాం? అని నాన్న అంటే ఒక అరగంట ముందు పోతే పోయేదేముంది. ఈ ఇంట్లో కూర్చుని చేసే కాలక్షేపం ఏదో ఆ రైల్వే ప్లాట్ఫారం మీదే చేయవచ్చు కదా అనే వారు. అందరం ప్లాట్ఫారం మీదకు చేరి కాకినాడ పాసెంజర్ కోసం వేచి చూస్తున్నాం. రేయ్, ఆ ప్లాట్ఫారం చివరికి నిలబడకు వెనక్కి రా అని అరవడమే సరిపోతోంది తాతయ్యకి. నాన్నేమో, ప్రయాణంలో చదువుకోవడానికి నవలలు ఏమన్నా కొందాం అని హిగ్గిన్ బోథమ్స్కి వెళ్లారు. మా బాపట్ల రైల్వే స్టేషన్ చాలా అందంగా ఉండేది. పొద్దున్నంతా ఉద్యోగులతో, సాయంత్రమంతా విద్యార్థులతో సందడి సందడిగా ఉండేది. స్టేషన్ చుట్టూ కాగితం పూల చెట్లు, ప్లాట్ఫారం మీద పూలమ్మి అమ్మే మల్లె, మరువం, కనకాంబరాలు. చాలా ఆహ్లాదకరంగా ఉండేది వాతావరణం, ముఖ్యంగా శీరుడు శాంతి వహించే శ్రావణంలో. అందరం కూర్చుని రైలు కోసం ఎదురుచూస్తుంటే అయిదేళ్ల క్రితం రిటైర్ అయిన తాతయ్య తన ఉద్యోగానుభవాలు బామ్మకి, అమ్మకి చెప్తున్నారు. నాన్న నవలాపఠనంలో మునిగిపోయారు.

తాతయ్య నలుపు తెలుపు సినిమా కథనానికి బ్రేకులు వేస్తూ, ట్రైన్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు మరి కొద్దిసేపట్లో ప్లాట్ఫారం నెంబర్ ఒకటి మీదకు వస్తుంది అని మూడు సార్లు మూడు భాషల్లో నొక్కి వక్కాణించింది అశరీరవాణి.

రైలులో పెద్దగా రద్దీ లేదు, మా అందరికీ కాళ్లు జాపుకోవడానికి వీలైనన్ని ఆసనాలు దొరికాయ్. రైలు కదిలిన కాసేపటికి, హడావుడిగా పరిగెత్తుతూ వచ్చి లోపలికి ఒక్క ఉదుటున ఎక్కాడు ఒక పొడవాటాయన. మంచి నీళ్ల సీసా, మూడు గిన్నెల స్టీలు కారియరు తీసుకుని రైలు పెట్టెలో నడక దారికి అటు వైపు ఉన్న సీటులో వచ్చి కూర్చున్నాడు. మా నాన్న వయసు ఉంటుంది అనుకుంటా ఆయనకి. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, చేతికి హెచ్.ఎం.టి వాచీ. జేబులో రైల్వే సీజన్ పాస్, కళ్ళజోడు. నుదుటిన ఎర్రటి బొట్టు. పరిగెత్తడం వల్ల పట్టిన చెమట తడికి కరిగిపోతున్న త్రిపుండ్రాలు. వచ్చి తన సీట్లో సర్దుకున్నాక ఏ దేవుడికో బాగా దణ్ణం పెట్టుకున్నాడు, రైలు తప్పిపోనందుకు. కాసిని మంచి నీళ్లు తాగి, వాచీ చూసుకుని అటుగా పోతున్న కాఫీ అబ్బిని కేకేసి పిలిచాడు. చక్కర తక్కువ వేసిన వేడి వేడి కాఫీ చల్లగా జుర్రుతూ, కాఫీ.. మరీ మంచి నీళ్ల కన్నా హీనమై పోయిందండి రైళ్లలో. ఈ నీళ్ల కాఫీ రూపాయిన్నరా!! మరీ దోపిడీ అయిపొయింది సార్ అన్నాడు మా నాన్నకేసి చూస్తూ. తెనాలి స్టేషన్లో కాస్త పర్వాలేదండీ. ఈ రైళ్లల్లో ఇంతే నాసిరకం కాఫీ అన్నాడు నాన్న ఆయనకి వంత పాడుతూ. కాఫీకి ఎక్కువ సేపు ఆగలేను సార్ అన్నాడు పొడవాటాయన, నేను అంతే లెండి అన్నాడు నాన్న నవ్వులు చిందిస్తూ. ఇంతలో నాన్న దగ్గర ఉన్న సితార సినీ వార పత్రిక , పొడవాటాయన దగ్గర ఉన్న ఈనాడు దిన పత్రిక చేతులు మారాయి. తాతయ్య జిల్లా ఎడిషన్, నాన్న మెయిన్ ఎడిషన్. తరువాత తాతయ్య మెయిన్ ఎడిషన్, నాన్న జిల్లా ఎడిషన్ పారాయణ చేశారు. నాన్న మళ్ళీ పేపర్ మొత్తం చక్కగా సర్ది తిరిగి పొడవాటాయనకు అప్పజెప్పారు. ఇటు నాన్న అప్పగింతలు పూర్తవ్వకుండా అటు వాళ్ళ అమ్మాయి పెళ్ళి చూపులు కోసం పెళ్లి పందిరి కావాలంటూ పేపర్ అడిగి తీసుకున్నాడు పొడవాటాయన పక్కన కూర్చున్న పెద్దాయన. ఆ తరువాత పెద్దాయన దగ్గర నుంచి మూడవ పేజీ అడిగి తీసుకున్నాడు ముసలాయన. మిగతా పేజీలు సీటు నెంబరు అయిదు, ఆరు, ఎనిమిదిలో కూర్చున్న వాళ్ళు పట్టుకుపోయారు. నాన్నకి సితార తిరిగిచ్చేసి ఇద్దరూ రాష్ట్రీయ, జాతీయ రాజకీయ చర్చ మొదలెట్టారు. బాపట్ల, తెనాలి, బెజవాడ రాజకీయాలు ఇలా పది నిమిషాలకొక ఊరు మారుతూ వారి చర్చ మా కాకినాడ పాసెంజర్ కన్నా వేగంగా రాజధాని ఎక్సప్రెస్లా హస్తిన చేరింది. వాళ్ళ చర్చ ముగిసే సమయానికి మా రైలు బెజవాడ చేరింది. పొడవాటాయన రైలు పెట్టెలో పది చోట్లకు చేరిన తన దినపత్రిక పోగేసుకుని మా నాన్న దగ్గర శెలవు తీసుకున్నాడు.

బెజవాడ గాలికో అక్కడ త్రాగిన నీళ్ళకో బాగా ఆకలి మొదలయ్యింది. బామ్మా ఆకలి అంటే, ఆ భోజనాల సంచి పైన్నుంచి దింపమని తాతయ్యకి ఆర్డరు వేసింది బామ్మ. మా పెరట్లో అరిటాకులు ఒక చిన్న పళ్ళెమంత కోసి భోజనాల సంచిలో వేసింది బామ్మ. పులిహోరతో మొదలెట్టి, పూరీ కూరతో పొట్టను కొంచెం పూరించి, దద్ధోజనంతో ముగించాం అనిపించాం. మంచి భోజనం చేసి రైలు కిటికీలోంచి చూస్తుంటే పచ్చటి పంట పొలాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి చెంపలు తడిమి ఊరుకుంటుందా, నిద్ర పుచ్చింది. కలలైపోయాయి, కాకినాడ వచ్చింది.

మమ్మల్నందరిని ఇంటికి తీసుకువెళ్ళడానికి మా మావయ్య అంబాసిడరు కారు తీసుకుని వచ్చాడు రైల్వే స్టేషన్కి . పెద్దవాళ్లందరిని కుశల ప్రశ్నలడిగాడు , నా బుగ్గ మీద చిటికేసి నువ్వెంట్రోయ్ కు. ని. పోస్టర్లో బొమ్మలా, పుల్లలా తయారయ్యావ్, తింటున్నావా లేదా అసలు ? అన్నాడు. కారు పెళ్లింటి ముందు ఆగింది. విద్యుద్దీపాల అలంకారాలు , కొబ్బరాకులతో అల్లిన పందిళ్లు, పందిరి చూరు నుంచి వేలాడుతున్న బంతి, చామంతి దండలు. పన్నీరు, సంపంగి , అగరొత్తుల పరిమళాలు. మల్లె పువ్వులాంటి నవ్వులతో స్వాగతం చెప్తున్న మా ఇంటి ఆడపడుచులు. ప్రయాణ బడలిక తెలియనే లేదు మాకెవ్వరికీ. కబుర్లు, కౌగిలింతలలో కరిగిపోయారు అంతా. అందరం స్నానాలు, భోజనాలు చేసి మేడ మీదకి చేరాం. చాలా రోజుల తరువాత కలిసిన మా బామ్మ వాళ్ళ చెల్లెలు, మా అమ్మా నాన్న, మా అత్తయ్య మావయ్య, మా తాతలు, బాలల వానర సైన్యం అందరమూ చాపలు, దుప్పట్లు, దిండ్లు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.

కాకులు, కోకిలలు, కిశోతరుడు కూడబలుక్కుని పాడె మేల్కొలుపు. మేము లేచే సరికే పెద్దవాళ్ళు అంతా చక్కగా అలంకరించుకుని సందడి సందడిగా ఉన్నారు. అందరూ స్నానాలు చేసి రండి టిఫిన్లు చేద్దురుగాని అని క్రింద నుంచి కేక వేసింది అమ్మ. అందరం స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని రామా సప్లయర్స్ వాళ్ళ బులుగు బల్లల ముందు చెక్క కుర్చీలు, పైన విస్తరాకులు వేసుకుని టిఫిన్ కోసం ఆవురావురమని వేచి చూస్తున్నాం. ఉప్మానా, ఇడ్లీన అడిగింది మా అత్త. పూరి లేదా అత్తా ? పూరి చెయ్యలేదు నాన్నా. ఇడ్లీ తింటావా కారప్పొడి నెయ్యి వేసుకుని అని ప్రేమగా అడిగింది మా అత్త. కారప్పొడా !! అదేంటి చట్నీ లేదా ? లేదురా.. మీరు లేచేసరికె అయిపొయింది. వద్దులే అత్తా, ఉప్మా పెట్టు అని దీనంగా చెప్పాను. అందుకే రాత్రి పూట పడుకోబోయే ముందు దేవుడికి దణ్ణం పెట్టుకు పడుకోవాలి, లేకపోతే పొద్దునే టిఫిన్లో ఇలా కనీసం నీళ్ల చట్నీ కూడా లేని గట్టి ఇడ్లీ లేదా గడ్డలు కట్టిన ఉప్మా తినాల్సి వస్తుంది. ప్చ్.

బయల్దేరండి, బయల్దేరండి అంటూ అందరూ కళ్యాణ మండపానికి హడావుడిగా బయల్దేరారు. పేద్ధ.. కళ్యాణ మండపం. పూలు, తళుకుల కాగితాలతో మెరిసిపోతోంది . లోపలికి అడుగుపెట్టగానే పన్నీటి జల్లు చల్లగా చల్లుతున్న యాంత్రిక వింజామరలు.పట్టు చీరల మెరుపులు, స్వర్ణాభరణాల ధగ ధగలు, అత్తరు, అగరొత్తుల గుభాళింపులు. డోలు, సన్నాయి మేళాలు. ఆనందం అంబరాన్నంటే లోగిళ్ళు తెలుగు పెళ్లి పందిళ్లు.

పెళ్లి మండపం చుట్టూ మేడ పైన విడిది గదులు. గదుల బయట నుంచుంటే పిట్టగోడ మీద నుంచి పెళ్లంతా చూడొచ్చు. నేనూ, తమ్ముడు పైన గది ముందర ఆడుకుంటున్నాం. క్రిందకి రమ్మని అమ్మ చెయ్యి ఊపింది. మా బొమ్మలు గదిలో పెట్టి, మా బొమ్మలు ఎవరూ ఎత్తుకు పోకుండా తలుపు బయట గొళ్ళెంపెట్టి కిందికి పరిగెట్టాం. భోజనాలు చేసి ఆడుకోండి అని చెప్పింది అమ్మ. పొద్దున్నే నీరసంగా తిన్న వంద గ్రాముల ఉప్మా మా ఆటలకి హారతి కర్పూరంలా కరిగిపోయింది. కడుపు నక నక లాడుతుంటే చక చకా అడుగులు వేస్తూ భోజనాల దగ్గరికి చేరాం. మంచు వేసిన మంచి నీళ్లతో గొంతు తడిపి రాబోయే పదార్ధాలకి మార్గం సుగమం చేశాం, తేనెలూరుతున్న జాంగ్రీ, ఒంటి నిండా చక్కర చిలకరించుకొచ్చిన బూందీ లడ్డు, పొత్రం కింద నలిగి, పచ్చి శెనగపప్పు, ఎండు కొబ్బర్లతో చేరి, బెల్లం ముద్ద పొట్ట నిండా నింపుకు వచ్చిన వేడి వేడి పూర్ణం బూరెలు, తోడుగా నేతి ప్రవాహం, తీపి ఎక్కువై వెగటు పుట్టగానే అరటికాయ బజ్జి, వంకాయ బజ్జి. పెళ్లి భోజనం అని గుర్తు చేస్తూ ముద్ద పప్పు, దోసావకాయ, పక్కనే నంజుకోవడానికి ఊర మిరపకాయలు, గుమ్మడి కాయ, సొరకాయ, ములక్కాడ, టొమాటో , ఇంగువా దట్టించిన సాంబారు, పళ్ళకింపుగా కర కర లాడే అప్పడాలు, ఊర మిరపకాయలు, దొండకాయ, బెండకాయ వేపుళ్ళు. ఆనక , చారు పోస్తాం అంటే తాగలేక, పులిహోర తినే ఖాళీ లేక, గడ్డ పెరుగు, విస్తరాకులో మిగిలి ఉన్న దోసావకాయతో భోజనం ముగించి, కిళ్ళీ జేబులో పెట్టుకుని నేనూ తమ్ముడు భోజనాల నుంచి బయటపడ్డాం.

అమ్మ ఎదురొచ్చి తాతయ్యని చూశారా అని అడిగింది. లేదు అని తలూపి ఆడుకోవడానికి పరిగెట్టాం. కాసేపటికి నాన్న కనిపించి తాతయ్య కనిపించారా అని అడిగాడు, లేదని చెప్పాం. సరే, ఎక్కడున్నాడో చూడండి ముహూర్తం దగ్గర పడుతోంది. కనిపిస్తే వెంటనే పెళ్లి పందిరి దగ్గరికి రమ్మని చెప్పండి. మేము ఆట ఆపేసి తాతయ్య కోసం వెతుకుతున్నాం. అమ్మా, నాన్న కూడా చెరో దిక్కు వెతుకుతున్నారు. భోజనాల దగ్గర, పెళ్లి మండపం దగ్గర, వాకిట్లో, వీధిలో అన్ని చోట్లా వెతికారు. ఏరా, నాన్న కనిపించారా ? అని అడిగింది బామ్మ నాన్నని. లేదమ్మా, ఎక్కడా లేరు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లారు ముహూర్తం దగ్గర పడుతుంటే ఈ మనిషి అని నసిగింది బామ్మ. సరే నేను మళ్ళీ ఒక సారి చూసి వస్తాను అని తాతయ్యని వెతకడానికి బయలుదేరాడు నాన్న. పెళ్లి పందిరిలో లేని తాతయ్య, ఆయనను వెతకడానికి వెళ్లిన అమ్మా, నాన్న, నేనూ, తమ్ముడు అందరము ముహూర్త సమయానికి పెళ్లి పందిరిలో లేకుండా పోయాం. పెళ్లి అయిపొయింది. కోలాహలం కొద్దిగా సద్దుమణిగింది.

కాసేపటికి అమ్మ, బామ్మ రక్తపోటు మాత్రలు తీసుకురావడానికి మేడ పై గదిలోకి వెళ్ళింది. కాసేపటికి చేతిలో మాత్రలతో బాటు తాతయ్యని వెంటబెట్టుకొచ్చింది. తాతయ్యను చూడగానే బామ్మకి ఆనందం, ఆశ్చర్యం, ఆవేశం అనే త్రిగుణాలు పెల్లుబికాయి.

ఇక్కడ పెళ్లి పెట్టుకుని ఏ రాచకార్యాలు వెలగబెట్టడానికి వెళ్లారు ? అలా తడిసిపోయారు ఏంటి ? అని తాతయ్య మీద ఇంతెత్తున లేచింది.

తాతయ్య తాపీగా టర్కీ టవల్తో మొహం తుడుచుకుంటూ, సరే, ముందు ఆ మాత్ర వేసుకో. నేను ఎక్కడికి వెళ్లానో ఈ కుంకలిద్దరిని అడుగు చెప్తారు అని మా వైపు చూపించారు. మేము ఏమీ అర్ధం కానట్టు తెల్ల మొహాలు వేశాం.

వాళ్ళా !! వాళ్ళేమి చేశారు ?

అడుగు వాళ్లనే..అడుగు ..అన్నారు.

మాకు ఏమీ అర్ధం కానట్టు అడ్డంగా తలాడించాం.

నన్ను పైన ఆ గదిలో పెట్టి గొళ్ళెం వేసింది మీరేనా ? అని అడిగారు నా వంక తమ్ముడి వంకా చూస్తూ.

అప్పటికి వెలిగింది మా కపి మస్తిష్కంలో కార్తీక దీపం, తాతయ్య స్నానాల గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి మేము బొమ్మలు లోపల పెట్టి తలుపుకి బయట గొళ్ళెం పెట్టాం.

వీళ్ళు తలుపు వెయ్యడం నాకు వినిపించింది, నేను గదిలోంచి అరుస్తూనే ఉన్నాను. వీళ్లు గొళ్ళెం వేసి తుర్రుమన్నారు. రెండున్నర గంటల నుంచి ఆ తలుపు బాదుతూనే ఉన్నాను. ఈ మేళాలకి, కోలాహలానికి ఎవ్వరికి వినిపించినట్లు లేదు. అరిచి అరిచి గొంతు నొప్పి పుట్టింది. ఇహ విసుగు, నీరసం వచ్చేసి అలా అక్కడే కూర్చుండిపోయాను, ఇదుగో ఇప్పుడు కోడలు వచ్చి తలుపు తీస్తే మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాను. ఇంతకీ పెళ్లి బాగా జరిగిందా ?

బానే జరిగింది కానీ, ఇంత దూరము వచ్చి ఎవ్వరమూ పెళ్లి సరిగా చూడనైనా లేదు అని వాపోయింది బామ్మ. మరుసటి రోజు అందరం కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి బయలుదేరాం. స్వామి దర్శనం చేసుకుని, అక్కడి కమ్మటి ప్రసాదంతో కడుపు నింపుకుని, బంధువులందరికీ వీడ్కోలు పలికి తిరిగి బాపట్ల బయలుదేరాం.

అన్నవరం రైల్వే స్టేషన్ బాగా రద్దీగా ఉంది. రైలు రావడానికి ఇంకా అరగంట సమయం పడుతుందని చెప్పింది శబ్దప్రసారిణి. చెవులదిరిపోయేలా కూత వేస్తూ, తన దారికి దూరం దూరం జరగమంటూ, రైలు పట్టాలు పట పటలాడిస్తూ, కీచుమంటూ ప్లాట్ఫారం మీద ఆగింది రత్నాచల్ ఎక్సప్రెస్. దండేనికి ఆరేసిన బట్టల్లా రైలు తలుపుల దగ్గర వ్రేలాడుతున్న పుణ్యాత్ములందరూ క్రిందకి దిగి చక్రాల మీదున్న రత్నాచల స్వర్గంలోకి దారి ఇచ్చారు. బాగా రద్దీగా ఉంది అని మోము దీనంగా పెట్టుకుని రైలెక్కింది బామ్మ. అలా అలా అందరిని జరుపుకుని ఎలాగొలా సామాను అటకెక్కించాం. ద్వారానికి దగ్గర ఉండే బెర్తుల మధ్య అందరం తలా ఒక రెండు అడుగులు చోటు చేసుకుని నిలబడ్డాం. ఎవరో కర్ణ సగోత్రీకుడు మా బామ్మ అవస్థ చూసి జాలిపడి తన ఆసనం మా బామ్మకు దానమిచ్చాడు. బామ్మ అతనిని ఆశీర్వదించి కాస్త కుదుట పడింది. దొరికిన సౌకర్యంతో మనసు కుదుట పడుతుందా. పై బెర్తు వంకీ పట్టుకు వ్రేలాడుతున్న తాతయ్యకేసి దీనంగా చూసింది. పర్లేదులే, వచ్చే స్టేషన్లో ఖాళీ అవుతుందిలే అని అభయ హస్తం చూపాడు తాతయ్య . ఇదంతా చూస్తున్న ఎదురు సీట్లో కూర్చున్న బుర్రు మీసాలాయన, రాజమండ్రిలో రైలు మొత్తం ఖాళీ అయిపోతుందని మా అందరికి భరోసా ఇచ్చాడు.

ఒక గంటన్నర నిలబడ్డాక హమ్మయ్య రాజమండ్రి వచ్చేస్తోందన్న ఆనందం మొదలయింది. రెండు రోజుల నుంచి అతిశయించిన ఆటల వల్ల నేనూ తమ్ముడు, ఆ రోజు సత్యనారాయణ స్వామి సన్నిధిలో కలియ తిరగడం వల్ల పెద్దవాళ్ళు బాగా అలిసిపోయారు. కాళ్ళు జాపుకోవడానికి ఒక అడుగు, కూర్చోవడానికి ఒక అడుగు, వీపు ఆనించుకోవడానికి ఒక అడుగు ఇవ్వమని వామనుడు బలి చక్రవర్తిని కోరినట్టు ఆ దక్షిణ మధ్య రైల్వే దక్షిణామూర్తికి దణ్ణం పెట్టుకున్నాం. రాజమండ్రి రానే వచ్చింది, తోపులాట మొదలయ్యింది దడ దడమని ఒక పాతిక మంది పెట్టెలోకి తోసుకువచ్చారు. ఆ తోపుడికి నేను మా తమ్ముడు దూరం జరిగిపోయాం. జనాల మధ్యన కలిసిపోయి నాకు నాన్న గానీ, తాతయ్యగానీ కనిపించడం లేదు. ఈ రద్దీకి నేను తమ్ముడు తప్పిపోయి మళ్ళీ పదిహేనేళ్ల తరువాత వాడు ఏ రెస్టారెంట్లోనో పాట పాడుతున్నప్పుడు తిరిగి కలుస్తామేమో అని భయమేసింది నాకు. రాజమండ్రిలో ఖాళీ అవుతుందని అభయమిచ్చిన ఆ బుర్రు మీసాలాయన కనిపిస్తే గాట్టిగా మీసాలు పట్టుకు లాగుదామన్నంత కోపమొచ్చింది.

రైలు కదిలినా గాలి ఆడటం లేదు. నాకు రెండు పక్కలా ఒక వీరబాహుడు, ఒక ఘనోదరుడు నిలబడ్డారు. బూడిద గుమ్మడికాయలాంటి బొజ్జలతో నా టమాటా అంత తలకాయని ఒత్తి పారేస్తున్నారు. తలెత్తితే తిరగలేక తిరుగుతున్న రైల్వే వీవెన, మిణుకు మిణుకుమంటున్న విద్యుద్దీపం తప్పితే ఏమీ కనిపించడం లేదు. వీరబాహుడు, ఘనోదరులతో ఒక గంట శిరోదర యుద్ధం సలిపాక, నా కన్నీరు ఆపడానికి ఏలూరు వచ్చింది. రద్దీ తగ్గింది మా అందరికీ కూర్చోవడానికి ఇంత చోటు దొరికింది. అందరం కూర్చుని కాస్త ఊపిరి పీల్చుకున్నాం. కానీ పీలుస్తున్న గాలి చుట్ట కంపు కొట్టసాగింది.

ముక్కుకి పేద్ద సత్తు ముక్కు పుడక, ముందే పచ్చ పొడిచిన నుదుటి మీద పేద్ద బొట్టు, చేతికి మట్టి గాజులు , కాళ్ళకి సత్తు వంకీలు, ఎర్రంచు ఆకుపచ్చ చీర కట్టుకుని కిటికీ దగ్గర కూర్చుని ధూమశకటానికి పోటీ ఇచ్చేలా గుప్పుగుప్పున చుట్టకి కొరివి పెడుతోంది మమతల… అసిరితల్లి. మా ప్రక్కనే కూర్చున్న బాధ్యత గల పౌరుడు భావపురి భావన్నారాయణ గారు పూనుకుని ఏవమ్మా రైలులో చుట్ట తాగకూడదు అన్నాడు. రైలు కిటికీలోంచి వదిలేసిన కాగితపు కాఫీ కప్పు ఎగిరిపోయేంత వేగంగా కళ్ళెర్రజేసుకుని గిర్రున తల తిప్పింది అసిరితల్లి.

పొగపోయేది పెట్టి బయటకి కాదేటి ? అని విసురుగా అడిగింది.

బాధ్యత కంటే బ్రతుకు తియ్యనైనదని తెలుసుకున్న భావన్నారాయణ మిన్నకున్నాడు.

ఒక రెండు నిమిషాల పాటు అక్కడ అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అసిరితల్లి పౌత్రుడు పైడితల్లి ఏడుపు లంఖించుకున్నాడు. పిల్లగాడు ఏడుస్తుంటే సూస్తూ కూకుంటావేమియా సింహాచలిమియా అని పెనిమిటిని గదిమింది పైడితల్లి వాళ్ళ నాయనమ్మ. సింహాచలం ఒకటో నెంబరు బెర్తు నుంచి అరవై నాలుగో బెర్తు దాకా ఒక ఆరు భ్రమణాలు చేసాక పైడితల్లి కునుకేశాడు. మూడో నెంబరు బెర్తు నుంచి ఆరో నెంబరు బెర్తుకి తన ఎర్ర కాటన్ చీరతో ఉయ్యాల వేసింది అసిరితల్లి. చల్లగాలికి కళ్ళు మూతపడుతుంటే ఏదో నీళ్లు ఒలుకుతున్న శబ్దం అయ్యింది. చీరతో కట్టిన ఉయ్యాలలోంచి పైడితల్లి పెట్టెని పావనం చేస్తున్నాడు. అదాట్టున లేచిన అసిరితల్లి పైడితల్లిని తీసుకుని శౌచాలయంలోకి పరుగెట్టింది. ఏమ్యా, ఇట్రా ఈణ్ణి తీస్కుపో అని అరిచింది.కడిగిన ముత్యంలాంటి పైడితల్లిని ఎత్తుకుని తిరిగివచ్చాడు సింహాచలం. పావనమైన చీరని పిండుకుని వచ్చి, గట్టిగా ఒక విదిలింపు విదిలించింది. చల్లటి చిరు జల్లు తగిలిన భావన్నారాయణ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. చీరారేస్తున్న అసిరిని విసుగుగా చూసి ఏమీ అనలేక అటు తిరిగి పడుకున్నాడు భావన్నారాయణ.

అసిరి ఆకలేస్తోందంటే ఉడకబెట్టిన వేరుశెనగ కాయలు, ఉప్పూకారం పూసిన జామకాయలు తెచ్చాడు సింహాచలం. రెండు జామకాయలు తెస్తే ఇద్దరికీ చెరోటీ తెచ్చాడు అనుకున్నా గానీ రెండూ అసిరే మేసింది. ఎదురు బెర్తు మీద కాళ్ళు జాపుకుని ఒళ్ళో వేరుశెనగల పొట్లం పెట్టుకుని నిదానంగా ఒక్కొక్క శెనగకాయ తిని తొక్కలు తిరిగి కాగితంలో ఒక పక్కకి వేసింది. నీళ్లు నములుతున్న సింహాచలాన్ని చూసి జాలేసి ఒక నాలుగు వేరుశెనగ కాయలు అతని దోసిట్లో పోసింది. అతిగా తినడం వల్ల అజీర్తి చేస్తుందేమో అని సింహాచలం దీనంగా చూశాడు. ఏపాకు పచ్చడి తిన్నోడిలా అలా ఎర్రి మొహం ఏసావేందియా, నేను తినొద్దా అని కసురుకుంది అసిరితల్లి. అయ్యో అట్ట నేనెందుకంతను అసిరి ?, ఆజుమోలా గుళిక ఇయ్యమందువా !! ఆ … నువ్వు తినుమీ ఆజుమోలా నాకు బానే అరుగుతాది అని ఒళ్ళో పోసుకున్న వేరుశెనగ తొక్కలు కిటికీలోంచి విసిరికొట్టింది. ఎదురుగాలికి తొక్కలు ఎగిరి నా మొహం మీద పడ్డాయ్. మా బామ్మకి కోపం నషాళానికి అంటింది. ఏవమ్మోవ్, అలా పిల్లాడి మొహం మీద వేస్తావేంటి అని గద్దించింది. ఆ…గాలికి ఎగిరొచ్చి పడితే నానేటి సేతును అని చిరాకు పడుతూ లేచి తలుపు దగ్గరికి పోయింది. తిరిగి వస్తూ దారిలో ఉన్న మా బామ్మ కాలు తొక్కింది. ఓసి మీ అమ్మ కడుపు బంగారం గానూ, కాలు విరగగొట్టేశావు కదే అని బాధతో పెద్దగా అరిచింది బామ్మ. నాన్న పట్టరాని ఆవేశంతో అసిరి మీద కసిగా లేచాడు. సింహాచలం, తాతయ్య మధ్యలో కలగజేసుకుని నాన్నని శాంతింపజేశారు. సింహాచలం క్షమార్పణ చెప్పి, మన్నించమని కోరాడు. కొంత మందికి ఇల్లుకి, రైలుకి తేడా తెలియదులెండి అన్నాడు భావన్నారాయణ కొద్దిగా ధైర్యం కూడదెచ్చుకుని. అసిరి భావన్నారాయణ వంక చుర చురా చూసింది. ఈ కోలాహలం పూర్తయ్యే సరికి బెజవాడ చేరాం. కాలి నొప్పిని పంటి బిగువున దాచుకుని మాతో పాటు బాపట్ల బస్సు దాకా నడిచింది బామ్మ.

బాపట్లలో దిగి శంకర్రావు సోడా బండి దగ్గర అందరం తలా ఒక గోలీ సోడా తాగాం. అమ్మా, నాన్న , తమ్ముడు బల్ల రిక్షాలో. బామ్మా , తాతయ్య, నేను గూడు రిక్షాలో ఇంటికి బయలుదేరాం. చల్ల గాలికి నిదుర తూగుతుంటే, ఠా…ప్పని పెద్ద శబ్దం అయ్యింది. సగం దూరం చేరేసరికి బామ్మా వాళ్ళ గూడు రిక్షా టైరుకి పంచరు పడింది. బామ్మని, తాతయ్యని బల్ల రిక్షా ఎక్కించి నేను, నాన్న ఇంటికేసి నడవనారంభించాం. బాగా పొద్దు పోయింది నిద్దుర తూగుతోంది. క్రమం లేని అడుగులు వడి వడిగా వేసుకుంటు ఇంటికి చేరి స్నానాలు చేసి మంచాల మీద కూలబడ్డాం.

పొద్దునే లేచే సరికి బామ్మ కోపంగా ఉంది. ఏమిటా సంగతి అని ఆరా తీస్తే పెళ్ళిలో వాళ్ళ చెల్లెలు కట్టించిన లడ్లు, అరిసెలు, జాంగ్రీలూ , కారప్పూస, చెక్కలు ఉన్న సంచి నిన్న కోలాహలంలో రైలులో మర్చిపోయాముట. ఆ అసిరికి దొరికే ఉంటుంది, ఆ అరిసెలన్నీ లొట్టలేసుకుంటూ తిని ఉంటుందని కాలికి కొబ్బరి నూనె రాసుకుంటూ తిట్టిపోసింది బామ్మ. సుష్టుగా భోంచేసి మధ్యాహ్నం మంచి నిద్దుర వేశాం అందరం. నిద్ర లేచాక అందరికి పెద్ద గాజు గ్లాసుల్లో బఱ్ఱె పాలతో చిక్కటి ఫిల్టర్ కాఫీ పెట్టింది మా అత్త. పోస్ట్ అంటూ కేకేశారు మా పోస్టుమాన్ కోటేశ్వరరావు గారు. కార్డు చదువుతూ వస్తున్న తాతయ్యను చూసి ఎక్కడి నుంచి ఉత్తరం ? అని అడిగింది బామ్మ.

ఆ.. ఉత్తరమా. రాజమండ్రిలో మన సత్యనారాయణ గారు లేరూ.. వాళ్ళ పెద్దబ్బాయి పెళ్ళిట రెండు వారాల్లో ఇంటిల్లిపాదిని రమ్మని ఆహ్వానపత్రిక పంపారు అని పెళ్లి కబురు చల్లగా చెప్పారు తాతయ్య.

ఆ.. ఏవిటీ !!! మళ్ళీ పెళ్లా !!!.

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

నా టర్కీ యాత్ర

2012. జూన్. ఇరాన్ నుంచి 30 కోట్ల యూరోల చక్కెర బిజినేస్ కన్ఫర్మ్

COMPLIMENT

1977 ఏప్రిల్ 25. బ్యాంక్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి మద్రాస్ బీచ్