మనసు తానై తానె నేనైంది నా పెంటి

సేను కాడ నేను సెమట గారుత వుంటే
సెంగుతో తుడిసి నా అలుపు పోగొడతాది
సెలమ దడిసీ ఒల్లు సితసితామంటాంటె
ఉడుకు నీల్లతో తోమి శీరామ రక్సెడతాది
అరిటాకు ఇస్తర్ల అన్నమింతా కలిపి
ముద్దుగా ఒక్కొక్క ముద్ద నోటికందిస్తాది
అమ్మవోలె కొసరి కొసరి గోము తినిపిస్తాది
ఆలి ప్రేమకు ఇంగొక్క పేరు తానెలెమ్మంటాది 
గొంతు పొలమారితే నా సవితంటు నగుతాది 
గుండె తడిబారెనా తానె దిండై ఓదారుస్తాది
నా ఇంటి ముంగిట్ల మావి తోరాము నా పెంటి
పెద్ద పండగ నాటి సందె గొబ్బెమ్మ నా పెంటి

రాయంచ నడకలది రాసిలక పలుకులది
మింట అచ్చరలకే అచ్చెరవు కులుకులది
బుద్ది సక్కంగుంటె నువు నా మారాజువంటాది
తిరిగి, రాణిని నేను, నాకు సేవ చెయ్యంటాది
నాకండ్లు సల్లగ మూసి తానెవరనంటాది
గమ్మత్తు ఊసులతొ సెవి నింపుతుంటాది
ఎదురుబొదురుగ నుండి మాటాడమంటేను
సురుకు సూపులు జూసి సీ పొమ్మనంటాది
మింట సందమామ తారలను కూడుకొని
మనల చూసీ మరి మరీ నవ్వుతాడంటాది
మెండు కొంటెదనాల మందసం జూడ నా పెంటి
సెలిమి సినుకై తడుపు మొయిలురా నా పెంటి

శాన నిద్దరలో నేను సొక్కి పొరలుత వుంటె
యే యాల్టికో తన మోవి నా బుగ్గకంటిస్తాది
ఆరారగా నేను అరమూత కండ్లైతాంటె
ఊఁ యనవదేందంటు గిచ్చి సంపేస్తాది
జాము శానాయనిక రెప్ప మలుగుదమంటె
ఎండి ఎన్నెల యేళ ఇంక కునుకెట్లనంటాది
అరనిదుర కండ్లెంత ఎరుపాయె జూడంటె
సిగ్గులేనోడా యంటు సిగ్గయ్యి నగుతాది
రేయంత కువకువలు జటులాల రగస్సాలు
దేవుడా, ఈ రేయి కదలనీవాకంటు మొక్కుల్లు
వలపు వాగుల వోలె పెనుపరుగురా నా పెంటి
తనివి దీరని ప్రేమల వాన జల్లు గద నా పెంటి

ఎవురు నివ్వని నేను ఆయమ్మి నడగాబోతె
అద్దమెదురుగ నేను బొమ్మ తానగపడతాది
ఎవరు నేనని ఎదికి నే కిందమీదైతాంటేను
నాలో నిండావంటు పొదవుకుంటాది నా పెంటి
మువ్వల్ల నవ్వుల్ల యెద సవ్వడే నా పెంటి
పేరు దలసినంతనె ప్రేమ వానైతాది నా పెంటి
ఎనక ఎవురెవురమో ముందు ఏ తీరమో
నా బతుకు నావకు తానె సుక్కాని నా పెంటి
సీకట్లు దోలేటి సిరుదివ్వె ఎలుతురై నా పెంటి
ఒక్క వరముర అయ్య; జల్మ జల్మకిదె నా పెంటి
ముందొక్క నాటికి నా కత ఎవరేన అడుగుతే
కడలంత ఎలమి; గుండె గుడి జేతు, నా పెంటి

#వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #కవిత #ప్రణయగీతం

@vennela

10

12 Comments Leave a Reply

    • వేవేల ధన్యవాదాలు, కళ్యాణ్‌గారూ. మీవంటి నేస్తుల అభిమానం.

  1. కైతే బాగుంది.ఇంక ఎంకి ఎంతో బావుంటుందో కదా!

    • హ..హ..హా… ధన్యోస్మి పెద్దన్నా.. నా రాతలు నీకు ఎంకి పాటలు గుర్తు చేసాయంటే, చాలా మంచి మార్కులు దొరికినట్లే నాకు.

  2. చదవడానికి చాలా బాగుంది … మనసుకు హత్తుకుంది.

    • వేవేల ధన్యవాదాలు, సతీష్. ఎంతో గొప్ప ప్రశంస నాకిది.

    • మీ అంతటి శారద నుండి నాకింతటి ప్రశంస! ఎంతటి పుణ్యమో ఇది..
      వేవేల ధన్యవాదాలు, రామనాథ్‌గారూ.

  3. ఉడుకు నీల్లతో తోమి శీరామ రక్సెడతాది
    అరిటాకు ఇస్తర్ల అన్నమింతా కలిపి
    ముద్దుగా ఒక్కొక్క ముద్ద నోటికందిస్తాది
    అమ్మవోలె కొసరి కొసరి గోము తినిపిస్తాది

    అద్భుతం అంది అదిరింది

    • ఢన్యవాదాలు సర్. ఎంతో గొప్ప ప్రోత్సాహం మీ స్పందన.

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

స్మృతులు-1

నాకు ఎవరో పంపారు.. మీతో ఇక్కడ పంచు కొంటున్నా ….. ==================== రైల్వే

గాజు కిటికీ – రెండు ప్రపంచాలు

A view from my Office window నీలాకాశం, నీరు, చల్ల గాలి