నా టర్కీ యాత్ర

2012. జూన్.

ఇరాన్ నుంచి 30 కోట్ల యూరోల చక్కెర బిజినేస్ కన్ఫర్మ్ అయింది . ఇరాన్ బ్యాంక్ వాళ్ళు లెటర్ ఆఫ్ క్రెడిట్ (LC) మా కంపెనీ పేరు మీద ఇష్యూ చేస్తారు. కానీ ఇరాన్ పై ఆంక్షలున్నాయి కదా.. ఎలా అని మా ఓనర్ హైదరాబాద్ లో సెలవు లో ఉన్న నన్ను అడిగారు. నేను ససేమిరా కుదరదు అన్నా.

మా ఓనర్ మర్నాడు మళ్ళీ ఫోన్ చేసి వెంటనే రమ్మని హుకుం జారీ చేశారు. సరే దుబాయి లో వాలాను. ఏమి చేస్తావో తెలియదు.. ఈ ట్రాన్సాక్షన్ చేయాల్సిందే అన్నారు. నాకు పాలు పోలేదు.

ఇక తప్పదని స్విస్ , సింగపూర్ లలో ఉన్న బ్యాంకర్ ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు/సమాలోచనలు. ఒక జేనీవా బ్యాంక్ మిత్రుడు, ఆరే భాయి ఫలానా బ్యాంక్ ఇస్తాంబుల్ లో ఉంది. వాళ్ళకు ఇరాన్ తో లావాదేవీలకు temporary waiver ఉంది అన్నాడు. నేను మా ఓనర్ కు చెప్పా. వెంటనే ఇస్తాంబుల్ కు వెళ్ళు అన్నారు. సరే ఇస్తాంబుల్ ప్రయాణం.

ఇస్తాంబుల్ లో ఎయిర్పోర్టు నుండి హోటల్ వెళ్ళటానికి 2 గంటలు పట్టింది.. మధ్యలో బోస్ఫోరౌస్ బ్రిడ్జి ఆసియా/యురోప్ లను కలుపుతుంది. ఎంత బావుంటుందో!

మర్నాడు సూటు బూటు వేసుకొని ఆ బ్యాంక్ కు వెళ్ళా.

బ్యాంక్ వాళ్లకు ఇంగ్లీష్ రాదు. మనకు టర్కిష్ రాదు. యు నో ఇట్ ఇస్ నరకం . నా బాధ వర్ణనాతీతం.

అక్కడ ఒక అందమైన అమ్మాయి నన్ను నా బాధ రెంటిని చూసి నవ్వింది. నవ్వింది మల్లె చెండు అనుకోని వెళ్లి నా బాధ చెప్పా ఇంగ్లీష్ లో. ఆ అమ్మాయి కి కొంచెం ఇంగ్లీష్ వచ్చు. అమ్మయ్య అనుకోని ఆ అమ్మాయిని బ్రాంచ్ హెడ్ దగ్గరకు తీసుకని వెళ్ళాను. అ బ్రాంచ్ హెడ్ ఒక వెర్రి నవ్వు నవ్వి ఎక్కడో దుబాయ్ కంపెనీ అకౌంట్ మేము తెరవం. పో..ఆన్నాడు. ఈసురో మంటూ హిల్టన్ హోటల్ ( నా బస ) కు వచ్చి బాగా ఆలోచించా..

మర్నాడు మళ్ళి వెళ్లా. ఆ అమ్మాయి ని కలిసి పాపా, ఈ బ్రాంచ్ హెడ్ గాడి బాస్ దగ్గరకు నన్ను తీసుకొని పో అని అడిగా. ఆ అమ్మాయి వద్దు ఉండండి అని వెళ్లి ఏదో చెప్పింది ఆ మానేజర్ తో. అతను నన్ను చూసి ఇక్కడ రిజిస్టర్అయిన కంపని అయితే ఓకే. వెంటనే కంపనీ రిజిస్టర్ చేయించు అన్నాడు. అది కుదరని పని.

మర్నాడు వస్తానని చెప్పి హోటల్ కు వెళ్లి పడకేసా.దుబాయ్ నుండి ఫోన్ ల మీద ఫోన్లు.

మర్నాడు మళ్ళి హాజరు. సార్ కంపనీ రిజిస్ట్రేషన్ వగైరా కు టైం లేదు. మీరు ఎలాగైనా చేయండి అన్నా. ఆ అమ్మాయి కూడా ఏదో చెప్పింది. ఆ దొంగ వెధవ కుదరదు పొమ్మన్నాడు.

ఎలారా భగవంతుడా అని మధన పడ్డా.

ఇక లాభం లేదని మాది చాలా పెద్ద కంపెనీ అని చెప్పా.సపోర్ట్ కోసం దుబాయ్ నుండి కంపని బాలన్స్ షీట్స్ తెప్పించా. అవి ఆ మానేజర్ కు చూపించా. తను నన్ను వెయిట్ చెయ్యమన్నాడు. సాయంత్రం అయింది.. ఎంతకు పిలవడే? బ్రాంచ్ మూసే టైం కు వచ్చాడు. ఆ అమ్మాయి వాడి తో నా వెయిటింగ్ గురించి చెప్పింది. ఆతను మీ ఇండియన్స్ తోనే మీటింగ్ అంటూ విజిటింగ్ కార్డు చూపెట్టాడు. మన దేశపు పెట్రోలియం సెక్రటరీ -వాళ్ళు కూడా ఇరాన్ ఆయిల్ బిజినెస్ కోసం వచ్చారట.

నా పని రేపు చూద్దాం ఆన్నాడు. నేను మరల హిల్టన్ కేళ్లి పడకేసా..

మర్నాడు, నా పోరు పడలేక ఎకౌంటు ఓపెనింగ్ ఫారమ్స్ ఇచ్చి అకౌంటు ఓపెనింగ్ ఫండ్స్ $ 250K అన్నాడు. సరే అని , ఎక్కడెక్కడ సంతకాలు తీసుకోవాలో మార్క్ చేసుకొని దుబాయ్ కు బయలు దేరాను.

ఆఫీసు కు వచ్చి $ 250K రెడి చేసి, నేను చెప్పగానే మా కంపనీ అకౌంటుకు అక్కడికి పంపండి అని పురమాయించి, మా ఓనరు సంతకాలు తీసుకొని, అది ఇది అని లేకుండా అన్ని పేపర్లు, పాస్పోర్ట్ కాపీలు వగైరా తీసుకొని మరల మూడు రోజుల్లో ఇస్తాంబుల్ లో వాలాను.

మళ్ళీ సూటు బూట్లు వేసుకొని వెళ్ళాను. ఆ మేనేజర్ ఏ కళలో ఉన్నడో కాని అకౌంటు ఓపెన్ చేస్తాను..కాని కొన్ని షరతులు ఉన్నాయి అన్నాడు. నాకు చిర్రెత్తు కొచ్చింది. కోపం తమాయించుకొని ( వాడి గొంతు పిసికేయాలనిపించింది) ఏమిటి ఆ షరతులు అని అడిగా:

1. బ్యాంకు చార్జీలు డబు ల్

2. $ 250k min balance

3. ఇరాన్ నుంచి వచ్చే డబ్బు ఒక వారం కూలింగ్ పీరియడ్ తర్వాత పంపుతాం..

4. రిమైన్దర్లు,ఫోనులు నిషిద్ధం.మేమే అన్ని సవ్యంగా చేస్తాము. తొందర పెట్టకండి.

అన్నిటికి సరే అని తల ఊపిన తర్వాత , ఒక వారం తర్వాత రమ్మన్నాడు, సరే నేను దుబాయ్ కు వచ్చి, ఓ వారం తర్వాత ఇస్తాంబుల్. అకౌంట్ ఓపెన్ చేసి నెంబర్ ఇచ్చాడు.

నేను వెంటనే మా ఆఫీస్ కు ఫోన్ చేసి $ 250K ట్రాన్స్ఫర్ చేయించా. ఆ మర్నాడు ఆ ట్రాన్స్ఫర్ కాపీ వాడికి ఇచ్చాను.. డబ్బు చేరిన తర్వాత ఓకే అన్నాడు. నేను మర్నాడు రాత్రికి నా రిటర్న్ బుక్ చేయమని మా ఆఫీస్ కు ఫోన్ చేశా.

నేను ఆరోజు ఒక ఖరీదైన బ్రాండెడ్ పెర్ఫ్యూమ్ బాటిల్ కొని మర్నాడు బ్యాంక్ కు వెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చాను. వద్దు అంది. నేను తనకు ఇచ్చేసా.

ఆ మేనేజర్ ను డిన్నర్ కు ఆహ్వానించాను.సున్నితంగా తిరస్కరించాడు.

ఇస్తాంబుల్ లో చూడవలసినవి ఒక రెండు గంటల్లో టాక్సీ లో తిరిగి చూసేసి ( నా బొంద — ఏది సరిగ్గా చూడలేదు) రాత్రికి దుబాయ్ ప్రయాణం.

ఇరాన్ బిజినెస్ కన్ఫర్మ్ అయింది. వాళ్ళు LC ఆ టర్కిష్ బ్యాంక్ కు పంపారు. ఆ టర్కిష్ బ్యాంక్ వాళ్ళు 2 రోజుల తర్వాత మాకు పంపారు. మేము యమ స్పీడ్ గా ఆ కాంట్రాక్టు ను పూర్తి చేసాం.నాలుగు నెలలు పట్టింది. 2/3 రోజుల గ్యాప్ తో టర్కి బ్యాంక్ వాళ్ళు చెప్పినట్టు, డబ్బు ఒక వారం అట్టే పెట్టుకొని పంపించే వాళ్ళు.

మొత్తానికి ఒక యజ్ఞం లా ఆ ట్రాన్సాక్షన్ ను, ట్రేడ్ ఫైనాన్స్ హెడ్ గా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసాను. అమ్మయ అని ఊపిరి పీల్చుకున్నా.

ఇంతలో మా ఓనరు పిలిచి , టర్కి వెళ్లి బ్యాంక్ వాళ్ళకు థాంక్స్ చెప్పి, అకౌంటు క్లోజ్ చేయించి రమ్మని చెప్పారు. పేపర్లు అవీ తీసుకొని మరల ఇస్తాంబుల్ చలో. అ బ్యాంక్ వాళ్ళకు థాంక్స్ చెప్పా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మరల డిన్నర్ /లంచ్ కు పిలిచినా సరే ఆ బ్యాంక్ మేనేజర్+ఆ అమ్మాయి సున్నితంగా తిరస్కరించారు. అకౌంట్ క్లోజ్ చేయించి నేను బయట పడ్డా.

ఆ రోజంతా ఇస్తాంబుల్ తిరుగుడే.

గ్రాండ్ బజార్: 14 వ శతాబ్దం లో కట్టిన అతి పెద్ద బజార్. దొరకని వస్తువు ఉండదు

హగియా సోఫియా : మసీదు/చర్చి/మసీదు గా రూపాంతరం చెందిన ఒక అద్బుత కట్టడం.

భోస్ఫోరుస్ సముద్రపు పాయ ను ఫెర్రీ లో అటు ఇటు దాటటం .డాల్ఫిన్స్ ఫెర్రి తో పోటి పడటం కనువిందు.

ఎక్కడ బడితే అక్కడ మన టీ బంకుల మాదిరి ఆరంజ్ జ్యుసుల తోపుడు బండ్లు.

ఓల్డ్ సిటీ లో cobbled స్త్రీట్స్ లో నడక.

అక్కడ ఒక ఫ్యాక్టరింగ్ ( ఒక రకమైన ఇన్వాయిస్ financing) మీటింగ్ కు వెళ్ళాను.సీఈఓ అమ్మాయి, ఎంత అందం గా ఉన్నదంటే ,అంత అందం rarity.. బ్యూటీ విత్ బ్రైన్స్.-మేలు కలయిక. అరగంట మాట్లాడి వాళ్ళ చార్జీలు ఎక్కువనిపించి థాంక్స్ చెప్పి బయట పడ్డా.

చివరాఖరికి దుబాయ్ ప్రయాణం.

ఇస్తాంబుల్ బిజినెస్ క్లాసు లౌంజ్ out of the world. ఎంత పెద్దదో! పది భాగాలు గా రకరకాల cuisines.కళ్ళు చెదుర్స్.

ఈ టర్కీ ప్రహసనం లో నేను 4 నెలల్లో 9 సార్లు ఇస్తాంబుల్ వెళ్లాను. అన్ని సార్లు హిల్టన్ లోనే.అక్కడ రిసెప్షన్ లో ఒకతను నన్ను చూసి మళ్ళి వచ్చారా అని నవ్వేవాడు.

అవ్విధంబుగా నా టర్కి యాత్ర పరిసమాప్తమైనది.

=====

2

2 Comments Leave a Reply

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

పలుకు.ఇన్

“పలుకు!” చక్కటి తెలుగు పదం ఇది. సూచించిన హర్షకు అనేక అభినందనలు. ఈ

సఖి

1