కమలాప్తకుల
కలశాబ్ధిచంద్ర
కావవయ్యనన్ను
కరుణాసముద్ర
కమలాకళత్ర
కౌసల్యాసుపుత్ర
కమనీయగాత్ర
కామారిమిత్ర
మునుదాసులబ్రోచినదెల్ల చాలా విని
నీచరణాశ్రితుడైతినయ్య
కనికరంబుతో
నాకభయమీయుమయ్య
వనజలోచన
శ్రీత్యాగరాజనుత
కమలాప్తకుల — కమలాలకు ఆప్తుడైన సూర్యునివంశంలో పుట్టినవాడవు
క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్పవిషయామతిః
తితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరం
నాకేం రాదు.. ఎట్ల చెప్తనో.. అని చెప్పినరు కద..
అదే సూర్యవంశం.. అదే పరిస్థితి..
నెక్స్టు?
కలశాబ్ధిచంద్ర
అబ్ధి అంటే సముద్రం.. కలశం అంటే కుండ.. కలశాబ్ధి అంటే పాలసముద్రమట.. అదెట్ల అనేది ఆలోచిస్తూ ఉన్న.. కలశాబ్ధిచంద్ర అంటే పాలసముద్రంలో ఉండే చంద్రుని వంటి వాడని..
అదేందది పాలసముద్రంలో ఉండే చంద్రుడు??
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః
అని వాల్మీకివారడిగినపుడు
బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః
మునే వక్ష్యామ్యహం బుధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః
అని మొదలుపెట్టి నారదులవారు.. క్వాలిటీస్ చెప్తూ…
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః
కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః
అని చెప్తరు..
వీరత్వములో విష్ణువులెక్క..
చూసేటందుకు చంద్రునిలెక్క..
ఉంటడని..
ఆ చంద్రునిలెక్క ఉండేటాయన పాలసముద్రంలో ఉన్నడంట..
అందుకు కలశాబ్ధిచంద్ర…
కావవయ్య నన్ను… ఇది ఈజీగా అర్థమైతది..
కరుణాసముద్ర… సముద్రమంతటి కరుణ కల్గిన వాడా.. కాపాడాల్సింది నువ్వే..
నన్ను కాపాడాలంటే సముద్రమంత కరుణ కావాల్నా అంటే..
నేంజేసే తప్పులట్లుంటై మరి..
యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే
యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే
అని చెప్పినా ఇంకా ఉంటై…
అమర్యాదః క్షుద్రః చలమతిః అసూయాప్రసవభూః
కృతఘ్నః దుర్మానీ స్మరపరవశః వంచనపరః
నృశంసో పాపిష్టః
అని ఓ దగ్గర చెప్తరు…
అట్లాంటి నన్ను ఏం అనకుండ ఉండాలంటే కనీసం సముద్రమంత కరుణ ఐనా ఉండాలి…
ఆల్రెడీ చెప్పినరు కద.. క్షమయా పృథివీ సమః అని…
ఓకే ఓకే.. నెక్స్టేమి?
కమలాకళత్ర.. కళత్ర అంటే భార్య అని.. కమల అంటే లక్ష్మీదేవి అని.. లక్ష్మీదేవిని భార్యగా కల్గినవాడా..
రావణున్ని చంపుదామని ఇద్దరు కలిసి కిందకొస్తిరి… వనవాసానికి పోయినాకైనా ఒచ్చిన పని చేస్తవనుకున్నది.. పదమూడేండ్లు వనవాసం ఐనా ఇంకొన్నేండ్లు నీతోనే ఉంటే బాగుండు అయోధ్య కంటే ఇక్కణ్ణే బాగుంది అంటున్నవు… నువ్ మాట వినవని తానే పోయి రావణుని జైలుల కుచునింది.. అట్ల నీకు ధర్మం గుర్తుచేసిందే… ఆవిడ భర్తవి నువ్వు… కమలాకళత్ర…
ఆయనెవరో కష్టాల్లో ఉన్నరని మీ సహాధ్యాయి అని మీ దగ్గరకొస్తే ఆయన తెచ్చిన అటుకుల మూటమీదనే దృష్టి ఉంచిన మీరు, అవి ఓ గుప్పెడు నోట్ల ఏసుకుని బాగున్నై బాగున్నై అని ఇంకో గుప్పెడు నోట్ల ఏస్కుకోబోతుంటే మీ చేయిపట్కుని ఆపి “ఏతావతాలం విశ్వాత్మన్ సర్వసంపత్సమృద్ధయే” అని మీకు ధర్మం గుర్తుచేసిందే.. ఆవిడ భర్తవి నువ్వు… కమలాకళత్ర…
నెక్స్టేమి??
కౌసల్యాసుపుత్రా.. కౌసల్యకు కొడుకైనవాడా..
అదెందుకట్ల స్పెషల్గా కౌసల్య కొడుకనడం…
పొద్దు పొద్దున రేడియోలో (ఐ మీన్ ఫోన్లో) ఒచ్చేదాన్లో కూడా..
కౌసల్యాసుప్రజా రామ
పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికం
అని చెప్తరే..
విశ్వామిత్రునికి, దశరథునికి డిస్కషను జరుగుతున్నపుడు, మా వాడు చిన్నపిలగాడు నేనొస్త మీ యాగ సంరక్షణకి అని దశరథుడి చెప్తున్నపుడు వెనక రూంలో మావాడు క్షేమంగా పోయి పని చేసుకుని రావాలని విహారయాత్రకి కావల్సిన సబ్బు, షాంపూ సర్ది
కృతస్వస్త్యయనం మాత్రా పిత్రా దశరథేన చ
పురోధసా వసిష్ఠేన మంగళైరభిమంత్రిత్రం
నవ్వుకుంటూ పంపించింది..
అని..
అట్ల కొడుకుని నమ్మి నవ్వుకుంటూ పంపిందని గుర్తుచేసుకుంటూ “కౌసల్యా సుప్రజా రామ”..
అది సరే.. కౌసల్యకి ఎట్ల తెలుసు??
అందరు కొడుకులు వారి వారి సకల కళా నైపుణ్యాలని అమ్మల ముందే చూపిస్తరు కద..
సా తత్ర దదృశే విశ్వం జగత్-స్థాస్త్ను చ ఖం దిశః
సాద్రిద్వీపాబ్ధి భూగోళం సవాయ్వగ్నీందుతారకం
అని ఒకాయన వాళ్ళమ్మకి టాలెంటంతా చూపిస్తరు కద.. అట్ల ఈయనా ఎమైన చూపించినరేమో.. అందుకే అంత ధైర్యంగా పంపించిందేమో..
సరే సరే.. చాలాదూరమొచ్చినము కద…
మల్ల వెనక్కి పోయి చూద్దము.. ఎక్కడ ఆగింది అని..
కమలా కళత్ర, కౌసల్య సుపుత్ర… తరవాత.. కమనీయగాత్ర.. కామారి మిత్ర…
కమనీయగాత్రం అంటే??
గాత్రం అంటే గొంతని కద… వారు బాగా పాడతరనా??
ఒకాయన ఫ్లూట్ వాయిస్తరని ఉంది కాని, ఈయన పాడతరని ఎక్కడా లేదు..
ఏమో.. ఎక్కడైన ఉండొచ్చును.. నాక్కనపడలేదు..
ఓ సారి కమనీయగాత్రం అనే దానికి ఇంకేమన్న అర్థాలున్నయా, అదే ప్రయోగం ఇంకెక్కడైనా ఉందా అని చూస్తే
సుబ్రహ్మణ్య పంచరత్నంలో..
జాజ్వల్యమానం సురబృందవంద్యం కుమారధారాతటమందిరస్థం
కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే
అని…
సో.. కమనీయగాత్ర అనేది బాగపాడతరనే ఉద్దేశంలో కాదని తెలిసింది..
కమనీయ, రమనీయ, పూజనీయ, మహనీయ, విశ్వసనీయ (సారీ) లాంటి పదాలు వినింటరు..
కమనీయ అంటే మనోహరమైన అని గాత్రం అంటే శరీరం అని చెప్తుంది ఆంధ్రభారతి…గచ్ఛతి అనేన గాత్రం అని..
రమనీయ అని ఉన్నా ఠక్కుమని వెలిగేదేమో..
రమంతే సర్వే గుణైః అస్మిన్ ఇతి రామః అని…
బయ్ ద వే రమనీయగాత్ర అని కూడా చాల చోట్ల ప్రయోగం ఉంది…
పవనజస్తుతిపాత్ర
పావనచరిత్ర
రవిసోమవరనేత్ర
రమనీయగాత్ర
అని..
ఊరూరికే డైవర్ట్ ఐతున్నమా?? సరే సరే.. వెనక్కొద్దము…
కమలాకళత్ర, కౌసల్యాసుపుత్ర, కమనీయగాత్ర… నెక్స్టు.. కామారిమిత్ర..
కామున్ని తీసి దిబ్బక్కొట్టి బూడిద చేసినడే ఒకాయన…
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామతత్తుల్యం రామ నామ వరాననే
అని చెప్పినడే ఒకాయన..
ఆయనకి మిత్రుడని..
అద్సరే.. ఏం అడ్డం అండీ కామము…
యస్యసర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం తమాహుః పండితం బుధాః
అన్నడు కద..
కామాన్ని తీసి దిబ్బక్కొట్టినంకనే నీ మిత్రత్వం కలుగుతదని తెలుసు…
తీసి దిబ్బక్కొట్టిన.. నాక్ చేతనైంది నేన్ చేసిన.. ఇంక నీ ఇష్టం..
అదంతా ఓకేనండీ…
కమలాప్తకుల, కలశాబ్ధిచంద్ర, కరుణాసముద్ర, కమలాకళత్ర, కౌసల్యాసుపుత్ర, కమనీయగాత్ర, కామారిమిత్ర…
ఏం చేయాలంట ఇపుడు?
కావవయ్య నన్ను…
కాపాడాలంట..
ఎందుకంట?
నీ చరణాశ్రితుడైతిని…
నీ కాళ్ళు పట్కున్నందుకు కాపాడాలంట..
ఎందుకయ్యా పట్కున్నవు కాళ్ళు??
మునుదాసుల బ్రోచినదెల్ల చాలా విని..
ఏం విన్నవు??
దిక్కులు గెలిచితి నన్నియు
దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదుల్
దిక్కుల రాజులు వేరొక
దిక్కెరుగక కొలుతురితడే దిక్కని నన్నున్
అని ఒకాయన చిన్న పిల్లగాన్ని సతాయిస్తుంటే..
దిక్కులు కాలముతోనే
దిక్కునలేకుండుగలుగు దిక్కుల మొదలై
దిక్కుగల లేని వారికి
దిక్కయ్యెడు వాడు దిక్కు మహాత్మా
అని ఆ పిల్లగాడు చెప్పేటంత ధైర్యం ఇచ్చినవే… అది విన్న..
నీ మరిది మీద బాణాల మీద బాణాలు ఇంత గాపు లేకుండ ఏస్తుంటే నీకు సహనం సచ్హిపోయి ఆయన మీదకి చక్రం ఎత్తితే…
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి
గగనభాగంబెల్ల గప్పికొనగ
ఉరికిననోర్వక ఉదరంబులోనున్న
జగములవ్రేగున జగతిగదల
చక్రంబు చేపట్టి చనుదెంచి రయమున
పైనున్న పచ్చని పటముజార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ
కరికి లంఘించు సిమ్హంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు
విడువుమర్జున అనుచు మద్విశిఖ వృష్టిన్
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు
అని చెప్పినడే… అది విన్న..
ఓ ఏనుగు ఊరికే ఉండకుండ పోయి మొసలితో గొడవపెట్కుని అది తెలుగు సీరియల్ల లాగా సాగి సాగి, దానికి కూసంత జ్ఞానంగల్గి
ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుండెవ్వడు సర్వముదానైన వా
డెవ్వడు వాని నాత్మభవునీశ్వరునిన్ వేడెదన్
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ తప్పెను మూర్ఛ ఒచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవేతప్ప నితఃపరం బెరుగ మన్నింపతగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
అనంగానే..
సిరికింజెప్పడు శంఖచక్రయుగము చేబూని సంధింపడే
పరివారంబునుజీరడు అభ్రగపతింపన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
ఒంటి మీద సోయ లేకుండ పరిగెత్తి పోయినవే… అదీ విన్న..
ఇపుడేమంటవైతే?
మును దాసుల బ్రోచినదెల్ల చాలా విని..
విని??
నీ చరణాశ్రితుడనతిని..
ఐతివా..
సరె…
త్యాగరాజనుత… త్యాగరాజు దండం పెట్కునేవాడా…
హా.. వింటున్న…
వనజలోచన.. తామరాకులంత కండ్లున్నవాడా.. నా కష్టాల్ కనిపిస్తలేవ..
కనికరంబుతో నాకభయమీయుమయ్య..
తొందరగా ఒచ్చి అభయమీయి…
నేనెందుకిస్త అభయం అని అనకూడదు నువ్వు..
గుర్తుంది కద అపుడు ఏం చెప్పినవో…
సకృదేవప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా


క్వ సూర్యప్రభవో వంశః — రఘువంశం రెండో శ్లోకం.. మొదటిది ద వెరీ ఫేమసు వాగర్థావివ సంపృక్తౌ..
కోన్వస్మిన్ సాంప్రతం లోకే.. బాలకాండలో రెండో శ్లోకం… మిగతా రెండూ (బహవో దుర్లభాశ్చైవ, విష్ణునా సదృశో వీర్యే) వెంటవెంటనే ఒస్తయి…
యదహ్నాత్ కురుతే పాపం, యద్రాత్రియాత్ కురుతే పాపం.. సంధ్యావందనంలో ఒచ్చేది…
అమర్యాదః క్షుద్రః.. యామునాచార్యుల స్తోత్రరత్నంలో 62వది..
కృతస్వస్త్యయనం… బాలకాండ 22వ సర్గ లో రెండో శ్లోకం
సా తత్ర దదృశే.. భాగవతం దశమ స్కంధం, 8వ అధ్యాయం, 37వ శ్లోకం
యస్యసర్వే సమారంభాః.. భగవద్గీత 4వ అధ్యాయం 19వ శ్లోకం
సకృదేవప్రపన్నాయ… యుద్ధకాండ 18వ సర్గ 32వ శ్లోకం