
జయ జయ జయ శ్రీ వినాయకా
మమ్మెన్నడు కావవె వినాయకా
గణరాయ జయము శ్రీ వినాయకా
భక్తజన గణ రక్షక వినాయకా
అంబ నలచె నలుగు శ్రీ వినాయకా
సలుగు నిన్ను బడయగా వినాయకా
గడప నిలిపి అయ్యను శ్రీ వినాయకా
గజముఖధారి వైతివట వినాయకా
అమ్మ యానతి నీకట శ్రీ వినాయకా
అబ్బ అబ్బొ యనంగదె వినాయకా
శివ తాండవ కేళి నీవె శ్రీ వినాయకా
గౌరి ముద్దు పట్టి వీవురా వినాయకా
మరుగుజ్జు రూపము శ్రీ వినాయకా
ఎంత పెద్ద బొజ్జ నీదయా వినాయకా
నడక నెమ్మది నీకుట శ్రీ వినాయకా
నాట్యగణపతి వెట్లయో వినాయకా
గణ నాయకుడగుటకు శ్రీ వినాయకా
నమో నారాయణననంటివ వినాయకా
తలిదండ్రికి మొక్కుట శ్రీ వినాయకా
లోకాలకు నేర్పితివంటనె వినాయకా
తొలుత నిను దలతు శ్రీ వినాయకా
పెద్ద ఒజ్జవు గద నీవు వినాయకా
సకల సిద్ధుల ప్రోవట శ్రీ వినాయకా
సద్బుద్ధి నొసగు నాకు వినాయకా
గంగమ్మ ఒడి జేరుటది శ్రీ వినాయకా
నువు అమ్మ ఒడి చేరగను వినాయకా
దయయు దైవము నీవె శ్రీ వినాయకా
మము బాయకుండుమీ వినాయకా
#వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #వినాయకచవితి, #భక్తి #అధ్యాత్మికం
@vennela

