పసుపుపచ్చ ‘పచ్చ’ ఎందుకయింది?

“ఆకుపచ్చ, పసుపుపచ్చ రెండూ వేర్వేరు రంగులు కదా మరి రెండిటినీ ‘పచ్చ’ అని ఎందుకు అంటాం?” అని ఓ పడుచుపిల్ల ప్రశ్న. “అవును కదా, ‘పచ్చ’ అనే మాటని మనం ఆకుపచ్చ రంగుకే ఎక్కువగా వాడతాం. మరి పసుపుకి కూడా పచ్చ ఎందుకు చేరుస్తాం?” అని ఈ నవవృద్ధుడికీ విస్మయం కలిగింది. తెలుసుకునే ప్రయత్నం చేస్తే తేలిన విషయమే ఈ టపా.

నిఘంటువులో ‘పచ్చ’ అనే మాటకి బంగారము, సంపద అనే అర్థాలిచ్చారు. రంగులకు వెళ్తే పసరు రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, పాలిపోయిన రంగు అని ఇచ్చారు. అక్కడే తేలిపోయింది కదా ఈ మాటను ఈ రంగులన్నిటికీ కలిపి వాడేవారని. ఇప్పుడే గుర్తొచ్చింది చిన్నప్పుడు విన్న వాడుక: ఒంటి ఛాయ గురించి చెప్పేప్పుడు తెల్లగా ఉన్నవారిని ‘పచ్చని ఛాయ’ అనేవారు. ఇదే వాడుకలో చికిలింత అనే కథలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఇలా వ్రాసారు:

ఎదురు గుమ్మంలోకి, ఎవరో అమ్మాయి వచ్చింది. పచ్చగా ఉంది. పది పద్ధెనిమిది
ఏళ్ళుంటాయి.

బంగారు, పసుపు రంగుల్లో ఉండే గిజిగాడు పక్షిని ‘పచ్చపిట్ట’ అంటారట. పాలిపోయిన ఎరుపురంగులో ఉండే రాయి ‘పచ్చసుద్ద’. ‘పచ్చగన్నేరు’ పూలు పసుపు రంగులో ఉంటాయి మరి.

‘పచ్చ’ అనే మాట ‘పస’ అనే మూలం నుండి వచ్చింది. దాన్నుండే పసరు, పసపు/పసుపు, పసిడి/పైడి అనే మాటలు వచ్చుంటాయి.

సరే, సంస్కృతపు మాటలు చూద్దాం అని ‘హరిత’తో మొదలుపెడితే దానికీ, ‘హరి’ అనే మాటకీ కూడా పసుపు రంగు, పాలిపోయిన ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు అనే అర్థాలున్నాయి. బంగారుకాంతితో ఉండే సింహం అని కూడా ఓ అర్థం. బంగారురంగులో ఉంటుంది కనుక జింకను ‘హరిణం’ అన్నారు. పసుపుని హిందీలో ‘హల్దీ’ అంటారు కదా, (హళిది) దానికీ ‘హరి’ అనే మాటే మూలం. హరీ!

దీన్నిబట్టి మనం తేల్చేదేమిటంటే… మన పూర్వీకుల పూర్వీకులకు పసుపుపచ్చకీ, ఆకుపచ్చకీ భేదం చూపించాల్సిన అవసరం రాలేదేమో!?

(ఇంతాచేసి, ‘పచ్చనోటు’ అనే మాట నోటు రంగు వల్ల కాకుండా ‘పచ్చ’ అనే మాటకి ఉన్న సంపద అనే అర్థాన్ని బట్టే వచ్చివుంటుంది.)

7

వీవెన్

తెలుగు, స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఔత్సాహికుడు.

4 Comments Leave a Reply

  1. ఒంటి ఛాయ గురించి చెప్పేప్పుడు తెల్లగా ఉన్నవారిని పసిమి ఛాయ అని కూడా అంటారు నవ వృద్ధుడు గారు . వంటి రంగులో కూడా తెలుపు ,పసిమి రెండు వర్ణాలుగా చెప్తారు.కొద్ది పాలిపోయిన రంగు ఉన్నవారిని వారిని తెలుపు అని ,మెరుపుతో ఉన్న తెలుపును పసిమి అని భావం

  2. వివరణ బాగుంది వీవెన్ గారూ

    పచ్చ పచ్చగా వున్నది

    స్వర్గమిక్కడే అన్నది

    అన్నట్లుగా వున్నది – జత చేసిన చిత్రం

  3. మామూలుగా పది పన్నెండు ఏళ్ళ అమ్మాయని అంటాము.( 10-11-12 అని భావం వచ్చేలా )

    ఇక్కడ కథలో మల్లాది గారు “”ఎదురు గుమ్మంలోకి, ఎవరో అమ్మాయి వచ్చింది. పచ్చగా ఉంది. పది పద్ధెనిమిది
    ఏళ్ళుంటాయి.”అని రాసారు మల్లాది గారు.

    ఎందుకు అలా రాసారో?

Leave a Reply to Jagan Mantha Cancel reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

హిందీ పాటలు -లిరిక్స్

అతివ వర్ణన పాటల సిరీస్ లో రెండో పాట : अब क्या

ఒక 40+ ఏళ్ళ సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి కంపెనీకి భారమా ?

'దీని సిగతరగా' అన్నది "ముత్యాలముగ్గు" లో కాంట్రాక్టర్ ఊతపదం కావచ్చు కానీ ఈ