ఇవాళ పొద్దున్నే పెద్ద తప్పు జరిగిపోయింది! అంటే నాలాంటి పెద్ద మనిషి చేసే తప్పు అని చిత్రీకరించచ్చు!
నా దృష్టిలో తప్పు చిన్నదే కానీ మా ఆవిడ దృష్టిలో చాలా పెద్దది.
పొద్దున్నే నాలుగున్నరకి కాకికంటే ముందు లేచి మా ఆవిడ నిద్ర లేచే సమయానికి సర్ప్రైజ్ ఇద్దామని ఒక బర్నర్ మీద పాలు కాస్తూ ఇంకో బర్నర్ మీద నీళ్లు వేడి చేసి కాఫీ ఫిల్టర్లో పోస్తుండగానే, పక్కనే ఉన్నా కదా అని స్టవ్ హై లో పెట్టా అందుకని ఉన్నట్టుండి ఒక్క క్షణంలో పాలు పొంగిపోయి వరదలా పారాయి! చూడుడు మొదటి ఫోటో!
పాలు పొంగితే తర్వాత జరిగే శుభం మాటేమో కానీ ఇంకాసేపట్లో మా ఆవిడ నిద్ర లేచాక…
అమ్మో తలుచుకుంటేనే…
వెంటనే నా తక్షణ కర్తవ్యం ఏమిటి అని ఆలోచించాను. ఏముంది హంతకుడు హత్య చేసిన వెంటనే రక్తం మరకలని శుభ్రంగా తుడిచేసినట్టు పొంగిపోయిన పాలని తుడిచేసేయడమే.
వెంటనే ఒక పాత గుడ్డ తీసుకొచ్చి పాలని సుబ్బరంగా తుడి చేశాను. స్టవ్ ఎత్తి దాని కింద ఉన్న పాలను కూడా. పొంగిన పాలన్నీ ఓ గిన్నెలో పిండితే గిన్నె మొత్తం నిండిపోయింది. చూడుడు రెండవ ఫోటో!
పొంగిన పాలని తుడిచాను గాని పాలు కొంచెం తక్కువ ఉన్నట్టుగా ఉందేమిటని మా ఆవిడకి అనుమానం రాకుండా ఎన్ని పాలు పొంగాయో అన్ని నీళ్లు పాలలో కలిపేసాను. ఆవు పాలు ఎటు తిరిగి పల్చగానే ఉంటాయి కదా? అయినా మీ పిచ్చి కానీ పాలల్లో నీళ్లు కలిపే అమ్ముతారుగా?
తర్వాత మా ఆవిడ కాఫీ ఇచ్చినప్పుడు మన మీద అస్సలు అనుమానం రాకుండా “ఏమిటో ఈమధ్య పాలు మరి పల్చగా ఉంటున్నాయి? కొంపతీసి ఆవులు నీళ్లు ఎక్కువ తాగుతున్నాయా ఏమిటి?” అని ఓ కుళ్ళు జోక్ వేస్తే సరి.
హత్య అనంతరం అన్నీ శుభ్రంగా తుడిచేసి హంతకుడు చల్లగా జారుకున్నట్టు నేను కూడా మార్నింగ్ వాక్ కి వెళ్ళిపోయాను మా ఆవిడ ఇంకా నిద్ర లేవడానికి ముందే.
రోడ్డు మీద నడుస్తున్నానే కానీ ధ్యాసంతా మా ఆవిడ మీదే! ప్రేమతో కాదండోయ్! ఎందుకో విజ్ఞులైన పాఠకులకు ఈపాటికి తెలిసే ఉంటుంది.
సరే మొత్తానికి ఓ గంట పాటు కాళ్ళీడ్చుకుంటూ నడిచి ఇంటికొచ్చి హాల్లో సోఫాలో యధావిధిగా కూలపడ్డాక మా ఆవిడ కూడా యధావిధిగా కాఫీ ఇచ్చింది. హమ్మయ్య ఆవిడ కంట పడలేదు మనం చేసిన వాళ్ళ దృష్టిలో గోహత్యా సమాన అపరాధం.
నింపాదిగా కాఫీ అలా తాగడం మొదలెట్టానో లేదో క్యూములోనింబస్ మబ్బు బరస్ట్ అయినట్టు హఠాత్తుగా ED ఎంక్వయిరీ మొదలయ్యింది.
“ఏమిటి. పొద్దున్నే పాలు పొంగించినట్టున్నారు?” పాలు పొంగినట్టున్నాయి అని అడగలేదు. నోట్ దిస్ ఫైన్ పాయింట్ యువర్ హానర్! అంటే మనల్ని అపరాధిగా నిర్ధారించేసినట్టే. ఇదేం అన్యాయం. కాస్త ఇన్వెస్టిగేషన్. కూసింత ఇంటరాగేషన్ అయ్యాక వాదోపవాదాలు విన్నాక సాక్షాధారాలు పరిశీలించాక చేయాల్సింది ఇలా వెంటనేనా.
హతవిధీ! రక్తపు మరకలు, వేలిముద్రలు లేకుండా హంతకుడు తుడిచినట్టు శుభ్రంగా తుడిచానే. ఇలా ఎలా దొరికిపోయాను. ఎంత పెద్ద మేధావి అయినా చిన్న తప్పు చేసి పోలీసులకి దొరికిపోతాడని విన్నా! కానీ నేను చేసిందే చిన్న తప్పు! అది దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నానే? కొంపతీసి అలా వంటింటి గట్టు తుడిచిన పాత గుడ్డ అక్కడే కంగారులో వదిలేసానా ఏమిటి? అలవాటు లేనివాడు మొదటిసారి హత్య చేస్తే ఇట్లాగే దొరికిపోతాడు!
ఇక్కడే ఇంకో చిన్న తప్పు జరిగింది.
అదేమిటంటే నేర ప్రవృత్తి ఉన్నవాడు ఇంటరాగేషన్ లో సమాధానాలు చెప్పే విధానం వేరే ఉంటుంది. “తెలీదు. గుర్తులేదు. మర్చిపోయాను” అలా అన్నమాట! కానీ నాలాంటి పెద్ద మనుషులు, పెద్ద మనసున్నవాళ్ళు ఎప్పుడో ఓ చిన్న తప్పు చేస్తే ఇంటరాగేషన్ మొదలవ్వక ముందే తప్పు ఒప్పేసుకుంటారు. గిల్టీ ఫీలింగ్ మరి.
అందుకని ఆవిడ అలా ప్రశ్న వేయగానే కరుడుకట్టిన నేరస్థుడు అయితే “పాలు పొంగడం ఏమిటీ” అనో లేదా “పాలు పొంగాయా? నాకు తెలీదే?” అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ డిఫెన్స్ అన్నట్టు. మనబోటి వాడు దొరికిపోతామేమోనని గంట నుంచి పైకి కనిపించకుండా లోపల్లోపల వణుకుతున్నప్పుడు ఇలా భార్య నిలదీస్తే కరచరణాలు ఆడక బుర్ర పని చేయక పుసుక్కున దొరికిపోతాం. ఎలా అంటే ఇదిగో ఇలా!
“ఎలా తెలిసింది” అన్నా “ఎలా తెలుసుకున్నావు” అని మనసులో అనుకున్నా. ఈ ఆడవాళ్ళకున్న అతీంద్రియ శక్తులు అనంతం!
నేనలా జవాబివ్వగానే తేలిపోయిందిగా మనం భారీగా పాలు వంటిల్లంతా వరదలా పొంగించామని.
ఇహ తప్పు తేలిపోయాక ఏముంది కోర్టులో అయితే జడ్జిమెంట్! ఇక్కడో “జన్మానికో శివరాత్రి అన్నట్టు అమావాస్యకో పౌర్ణమికో పాలు కాస్తే పొంగాల్సిందే! చిన్నపని కూడా సరిగ్గా చేయలేరు కదా….. …. ” అంటూ జాతిని ఉద్దేశించి ప్రసంగం!
అన్నట్టు ఇవాళ కాకతాళీయంగా పౌర్ణమి!
కాసేపయ్యాక ఎలా దొరికానో ఏవన్నా ఆనవాలు దొరుకుతుందేమోనని ఆవిడ లేని సమయంలో వంటింట్లోకి వెళ్లి పాల గిన్నె, పరిసరాలు అపరాధ పరిశోధకుడిలా పరీక్షించా! వెంటనే దొరికింది. నేనెలా దొరికానో అన్న దానికి నిదర్శనం. గట్టు, స్టవ్ అతి జాగ్రత్తగా తుడిచాను కానీ పాల గిన్నె చుట్టూ పొంగిన పాలు చేసిన మరకలు మరిచా! చూడుడు మూడవ ఫోటో!
ఇంత చిన్న తప్పు చేసి అన్ని మాటలు పడ్డాక కనీసం సాయంత్రం లోపల ఏమన్నా శుభవార్త వింటే బాగుండును. క్లయింట్ నుంచి రావాల్సిన పెద్ద చెక్ వస్తుందా ఏమిటి? అప్పుడు ఎంచక్కా ధైర్యంగా మా ఆవిడతో “చూసావా? పొద్దున్నే పాలు పొంగించానని ఆడిపోసుకున్నావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో? మొగుళ్ళు కూడా అప్పుడప్పుడూ కూసింత మంచి పనులు చేస్తూంటారు. మీరు గమనించరు అంతే” అని నేను పగ తీర్చుకోవచ్చు!



మా నాన్నగారు తరచూ మాటల గారడీ / చమత్కారం చేసేవారు
ఆయనది ఒక పంచ్ లైన్
పాలా ? పాపాలా ? అన్న మాట
అలాగ మీ ఉదయన్నే పాల / పాపాల భాగోతం బాగుంది
మీ కథనమే ఒక కాదనలేని రీతిలో సాగుతుంది
ఈ జైత్ర యాత్ర ఇలా పలుకులో కూడా కొనసాగించండి మరి