అన్నట్టు చెప్పటం మరిచా- మా దోస్తు సత్య DNA — పసిమి వన్నె అందగాడు.మడత నలగని బట్టలు,చెదరని క్రాఫ్.
సరే నేను ఆట పట్టిస్తున్నానని గుర్రుగా చూసాడు.మర్నాడు మళ్ళీ అదే పాప అక్కడ నుండి కదలటం లేదు.కండక్టర్ అదిలించినా అక్కడే. కదిల్తే గా?
నేను సత్యతో”ఆ మొటిమల అమ్మాయి గత 4 రోజుల నుండి నీదగ్గరే తచ్చాడుతుంది. అసలు కథ ఏమిటో కనుక్కో”అన్నా. వాడు ఓ రెండు రోజుల తర్వాత ధైర్యం కూడదీసుకొని hello అని మాట కలిపాడు.(ఆ రోజుల్లో బస్సు సీట్లల్లో ఆడ మగ కలిసి కూర్చునే వారు కాదు ). మాట మాట పెరిగి ఫ్రెండ్స్ అయ్యారు వారిరువురు.
బస్సులో తెగ అల్లరి చేసే వాళ్ళలో వీరభద్రరావు ప్రథముడు. ధవళేశ్వరం SI గారి అబ్బాయి. నా సింగిల్ సీట్ లో ఇరికి నా ముఖానికి ఎదురుగా, ముందు సీట్ కు వీపు ఆన్చి కూర్చునే కళ ఎవరి అబ్బదు.దేవ్ ఆనంద్ Jewel Theif కాలరు,రాజేష్ ఖన్నా guru షర్టులు,గళ్ళ చొక్కాలు వాడి స్పెషాలిటీ.ఒక్క క్షణం ఊర్కొడు.హాస్యానికి మారుపేరు. సభ్యత గిరి లో ఇమిడి కామెడీ చేసేవాడు.అందరికీ ఇష్టుడు.అమ్మాయిల టిఫిన్ బాక్సుల్లో ఉప్మా ఓపెన్ గా అడిగి తినేవాడు.
ఒకసారి, ఒరే గౌసూ “ఇష్క్ పర్ జోర్ నహి” అంటే అర్ధం ఏంట్రా? అని నన్ను అడిగాడు. నేను చెప్పబోయా. వాడు నన్ను ఉద్దేశించి ఆ మాత్రం తెలియదా ? “ఇసుక మీద జోరుగా పరుగెత్త వద్దు” అని అర్థం అన్నాడు . ఆడ మగ అందరూ గట్టిగా నవ్వారు.. పైగా జనాంతికంగా “మా గౌస్ కు ఏమీ తెలియదు. Atomic energy తప్పించి “ అని చెప్పాడు. అందరూ మళ్ళీ నవ్వులు. ఇలా సరదాగా నడిచేది నా కాలేజి యాత్ర. ఇంతకూ బస్సులో వచ్చే అమ్మాయిలు ఆర్ట్స్ కాలేజ్ వాళ్లు కాదు. విమెన్స్ కాలేజి బాపతు.
మొత్తానికి చివరి సంవత్సరం లో ప్రవేశం. .
డైరెక్ట్ గా కడియం నుండి ఆర్ట్స్ కాలేజీకి బస్సు పడింది. 3A నంబర్. సరదాలు,స్నేహితులు,సినిమాల మధ్య కాలం పరుగిడిన వైనం.
కొన్నాళ్ళు సత్య గాడి జావా పై కాలేజి కి. ఆ రోజు ఫైనల్ year valedictory function. సత్య డ్రెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ .సాయంత్రం ఫంక్షన్ కు ఇస్త్రీ చేసిన white pant,white Shirt సంచి లో పెట్టుకొని ( అప్పుడే వేసుకొంటే నలిగి పోతాయని, కాలేజీలో వేసుకోవాలని తలంచి ) జావా హ్యాండిల్ కు తగిల్చి రయ్యిన వేమగిరి నుండి వైయా బొమ్మూరు కాలేజి బయలు దేరాం. కాలేజీ చేరిన తర్వాత నేను ఒరే సత్యా..ఏదో వాసన వస్తుంది అన్నా. గబుక్కున హ్యాండిల్ కున్న బాగ్ లో చూస్తే , బాగ్ తో బాటు లోపలున్న పాంటు కూడా కాలిపోయింది. సైలెన్సర్ కు తగిలింది కాబోలు. చాలా మధనపడ్డాడు ఇస్త్రీ బట్టలు లేవని. నేను పోనీలేరా అంటే ఫైనల్ ఫంక్షన్ నాడు ఎలా, ఇస్త్రీ బట్టలు లేకుండా ? వెనక్కి వెళ్దామంటే టైం లేదు అని తెగ ఇదై ఫీల్ అయిపోయాడు.( 1971 అంటే –Rapido లు , మొబైల్ లు లేని కాలం).
(సశేషం)
