వింజమూరి కధలు – 2 – నేల టిక్కెట్టు


“మోవ్… నీకు ఎన్నిసార్లు చెప్పాలి. నాకు సైడ్ క్రాఫ్ వద్దు, పైకి దువ్వు” అరిచాడు తిరుమల. పక్కకి దువ్వితే బావుంటావు రాజా.. నవ్వుతూ తల దువ్వింది అమ్మ. తిరుమల అప్పుడే ఆరో క్లాస్ లోకి వచ్చాడు. ఎలిమెంటరీ బడి నుంచి ప్రమోషన్ వచ్చి జెడ్పీపీఎస్ బాయ్స్ హైస్కూల్ లో చేరాడు. చిరంజీవి, సినిమా, ఫ్రెండ్స్, క్రికెట్, అదే ఒక చిన్న ప్రపంచం. చిరంజీవిలా క్రాఫు కావాలి, చిరంజీవిలా డాన్స్ వేయాలి.

డాడాని నా పుట్టినరోజు డ్రెస్ టైలర్ దగ్గరనుంచి తీసుకురమ్మని చెప్పు, బ్యాగీ ప్యాంటు, ఫ్లవర్ డిజైన్ షర్ట్ వేసుకుంటే చిరంజీవిలా ఉంటాను అని ఊహించుకుంటూ… పుస్తకాల సొరుగులో భద్రంగా దాచుకున్న స్టేట్ రౌడీ సినిమా పాటల పుస్తకాన్ని జేబులో పెట్టుకుని బయటకు పరిగెత్తాడు. డాడా అంటే నాన్న. డాడా పినాకినీ గ్రామీణా బ్యాంకు లో క్లర్కు. తిరుమల వాళ్ళ అమ్మ, తిరుమల, తిరుమల చెల్లి, ఒక చిన్న ఇల్లు, టీవీఎస్ ఫిఫ్టీ. అదే డాడా చిన్న ప్రపంచం

మా ఊళ్ళో అందరికీ సినిమా అంటే పండగ. కొత్త సినిమా అంటే పెద్ద పండగ. చిన్నా, చితకా, ఆడా మగా , ఉన్నవాళ్లు, లేనివాళ్ళు, అందరికీ సినిమా అంటే పండగే. చిరంజీవికి ఫ్యాన్స్ ఉంటారు, విజయశాంతికి ఫాన్స్ ఉంటారు, రాజనాలకి, రాజశేఖర్ కి, సుమన్ కి, సుమలతకి, భానుచందర్ కి, భానుప్రియ కి, అరుణ్ పాండ్యన్ కి, ముచ్చర్ల అరుణ కి, అందరికీ ఫాన్స్ ఉంటారు.

మా ఊళ్ళో అప్పట్లో రెండు సినిమా హాళ్లు, పాత హాలు, కొత్త హాలు. కొత్త హాల్లో బాల్కనీ ఉండేది. సినిమా మారింది అంటే, ఒక బండి మీద పెద్ద పోస్టర్ పెట్టి ఊరంతా తిరుగుతూ మైక్ లో అరుస్తూ చెప్పేవాళ్ళు. రచ్చబండ అంకుల్స్ అప్పటికప్పుడు నైజం, సీడెడ్ కలెక్షన్స్ లెక్కలేసేవాళ్ళు. బోరింగ్ పంపు దగ్గర ఆడవాళ్లు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, మొదటి ఆటకి వెళ్ళడానికి మొగుళ్లను ఎలా ఒప్పించాలో ప్లాన్లు వేసేవాళ్ళు.

కొత్త సినిమా ఎప్పుడూ కొత్త హాల్ లోనే వచ్చేది. మాయాబజార్, గుండమ్మ, మిస్సమ్మ… అన్నీ పాత హాల్లోనే. కొత్త సినిమా వచ్చిందంటే ఊరంతా కదిలి వచ్చేది. నేల టికెట్ అంటే, నేల మీద సినిమా చూసే టికెట్. బెంచీ టికెట్ అంటే చెక్క బెంచీలు. కుర్చీ టికెట్ అంటే కుషన్ కుర్చీలు. బాల్కనీ అంటే మెట్లు ఎక్కి పైకి వెళ్లి మెత్తటి కుర్చీల్లో కూర్చుని చూడటం. ఇంటర్వెల్ వచ్చిందంటే బాల్కనీ లో ఉన్నవాళ్లు స్టైల్ గా కిందకి చూసేవాళ్ళు. నేల టికెట్ వాళ్ళు ఆశగా పైకి చూసేవాళ్ళు. టికెట్ ధర రెండు రూపాయల దూరం, కానీ చూపులో తేడా ఆకాశానికి నేలకి ఉన్నంత దూరం.

కొన్నిరోజుల్లో తిరుమల పుట్టిన రోజు వస్తోంది. కొన్నిరోజుల్లో చిరంజీవి సినిమా కూడా వస్తోంది. మొదటిదానికి డాడా హడావుడి. రెండోదానికి తిరుమల హడావుడి.

బయట సినిమా బండి. రేపే విడుదల మీ అభిమాన హీరో చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా మన కొత్త హాల్లో.

పుట్టిన రోజుకు కొనిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని చిరంజీవి సినిమాకి ఫ్రెండ్ తో వెళ్దాం అని తిరుమల ప్లాన్. రేపు మొదటిరోజు మొదటి ఆట సాయంత్రం షో. డాడా జేబులో నుంచి లేపేసిన ఒక రూపాయి బిళ్ళ భద్రంగా నిక్కర్ జేబులో దాగుంది. ప్లాన్ అంతా సెట్.

“రేపు పక్కూరికి వెళదాంరా తిరుమలా, ఒక పని ఉంది.” డాడా అరిచాడు.

ప్లాన్ షేక్. షేక్ అంటే షాక్. తిరుమలకి షాక్.

“లేదు డాడా సోమవారం నుంచి నాకు క్వార్టర్లీ. ఫ్రెండ్ తో చదువుకోవాలి, నేను రాలేను. మీరు వెళ్ళండి.”

కొంచెంసేపు డాడా – తిరుమల ఇద్దరూ కదనరంగంలో రెండు టీముల్లా ఒక పద్యం, ఒక బాణం, ఒక పద్యం ఒక బాణంలా సమరశంఖాలు పూరించి కొట్టేసుకున్నారు. చివరకి తిరుమల కన్నీటి ప్రవాహానికి డాడా కరిగి కొట్టుకుపోయాడు.

గెలిచిన తిరుమల కళ్ళు తుడుచుకుని ఈ గెలుపులో భాగమైన మన చిరంజీవికి గాల్లో ఒక కిస్ వేసి జేబులోని రూపాయి బిళ్ళని తడుముకుని రేపటి సినిమా ప్లాన్ మరోసారి మననం చేసుకున్నాడు.

రేపు…

మొదటి ఆట సాయంత్రం ఏడున్నర కి మొదలవుతుంది. హాలు తలుపులు ఆరున్నరకే తెరిచేస్తారు. తిరుమల ఆరుకే వెళ్లి గేట్ దగ్గర నిలబడ్డాడు. ఫ్రెండ్ గాడికి వాళ్ళ నాన్న గంజి పెట్టి ఉతికి ఆరేయడం వల్ల హాలుకు రాలేకపోయాడు పాపం.

గేటు ముందంతా జనాలే. టీచర్ పాఠం చెప్పేటప్పుడు తలకెక్కకపోతే నోటుపుస్తకం లాస్ట్ పేజీలో పెన్ను పెట్టి పిచ్చి గీతలు గీకుతూ ఉంటే ఎలా ఉంటుందో, ఇక్కడ జనాలు కూడా అంతే గజిబిజిగా ఉన్నారు. మన చిన్న చిరంజీవి మొత్తానికి ఎలాగోలా నేల టిక్కెట్టు కొనుక్కుని హాలులో గోడకు అనుకుని కూర్చున్నాడు.

హీరో ఎంట్రీ అయ్యేసరికి హాలు అంతా విజిల్స్, అరుపులు. స్క్రీన్ మీద రంగురంగుల లోకం. తిరుమల కళ్ళల్లో కలల కాంతి. “నేనే చిరంజీవి ఫ్యాన్! ఇదే నా స్వర్గం!” అనుకున్నాడు.

ఇంటర్వెల్. లైట్లు వెలిగాయి. మళ్ళీ గజిబిజి. సమోసాలు, సుగంధ వాటర్, సుగంధ పాలు, గొట్టాలు, నానా గడ్డీ. అమ్మడం, కొనడం, తినడం, తాగడం అంతా ఒక పద్ధతీ పాడూ లేకుండా జరిగిపోతోంది. తెచ్చుకున్న రూపాయిలో పావలా మిగిలింది. దాంతో కొన్ని గొట్టాలు కొనుక్కున్నాడు.

నేల మీద కూర్చున్న వాళ్లంతా ఆశగా బాల్కనీ వైపు చూస్తున్నారు. మన చిన్న చిరంజీవి కూడా చూసాడు. ఎప్పట్లానే నింగి-నేల కాన్సెప్ట్. పైన కూర్చున్న వాళ్ళు కూడా క్రిందకు చూస్తున్నారు. ఇంతలో పైనుంచి అరుపు. ఎవరో తిరుమల వైపు వేలు పెట్టి చూపిస్తూ అరుస్తున్నారు. తిరుమల కళ్ళు చికిలించి చూసాడు. చెల్లి. బాల్కనీలో. పక్కనే అమ్మ, డాడా. సమోసాలు తింటూ లిమ్కా తాగుతున్నారు.

“డాడా ! అన్నయ్య కింద కూర్చున్నాడు!”

తిరుమలకి ఒక్కసారిగా గాబరా. అబద్దం చెప్పి దొరికిపోయానన్న బాధ ఒకవైపు, బాల్కనీ లో చెల్లి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనే కుళ్ళుమోతుతనం మరోవైపు.

“ఇప్పుడు డాడా ఏం చేస్తాడో…” అనుకుంటూ గుండె దిటవు చేసుకుంటూ దిక్కులు చూస్తున్నాడు.

డాడా కిందికి వచ్చాడు. మొహంలో కోపం లేదు. గేటు దగ్గరున్న కీపర్ని పక్కకి పిలిచి, “మా బాబుకి బాల్కనీ టిక్కెట్టు తీసుకున్నాం రా, ఆలస్యంగా వచ్చేశాడు. లోపలికి పంపించు.” అని చెప్పి, చేతిలో ఒక అర్ధరూపాయి పెట్టాడు. తర్వాత తిరుమల భుజం మీద చేయి వేసి, బాల్కనీకి తీసుకెళ్లాడు.

ఆలోచిస్తే తిరుమలకి అర్థమైంది. డాడా ఊరికి వెళ్దాం అన్నది అబద్దం అని, తనకు తెలియకుండా తనకోసం సినిమా ప్లాన్ చేసాడు అని, తనే చిరంజీవి పైత్యం వల్ల ఇలా జరిగిందని అనుకుంటూ బాల్కనీ లో కూర్చుని, చెల్లి ఇచ్చిన గోలి సోడా తాగుతూ, అమ్మ పంచిన పల్లీలు నములుకుంటూ ఆలోచించాడు.

“నాన్న ప్రేమ అర్ధం కాదు. నాన్న అనేవాడు కూడా అర్ధం కాదు. కానీ నాన్న చెప్పింది వింటే మంచి జరుగుతుంది, నాన్న చెప్పేది, చేసేది నా మంచి కోసమే, ఈ నేల టిక్కెట్టు నా మనసులో ఎప్పటికీ చెదరని ఒక అమూల్య జ్ఞాపకం” అనుకుంటూ తిరుమల మిగిలిన సినిమా అందరితో కలిసి చూసాడు.

“మా డాడానే చిరంజీవి! ఇదే నా స్వర్గం!”

సమాప్తం

1

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

టిఫిన్ ఏమిటీ

“టిఫిన్ ఏం చెయ్యను” అంటూ వంటగది నుండి వస్తూనే అడిగింది సతీమణి.“ఉప్మా” తడుముకోకుండా

మరుపురాని అనుభూతి!!

1985. కర్ణాటకలో పని చేస్తున్నప్పుడు,నేను డిపాజిట్ల సేకరణ లో కొంచెం చురుకు. అప్పుడు హైదరాబాద్ లో ఉన్న నిజాం ట్రస్ట్ నుండి deposit తీసుకోవాలని ఒక మొండి పట్టుదల మనసులో. ఎలా అబ్బా? ..