“టిఫిన్ ఏం చెయ్యను” అంటూ వంటగది నుండి వస్తూనే అడిగింది సతీమణి.
“ఉప్మా” తడుముకోకుండా జవాబు చెప్పాడు ఇంటాయన, హాల్లో మధ్యాహ్నం కూరకి ఉల్లిపాయలు కోస్తూ.
తమ గదిలో కూర్చొని కాలక్షేపం చేస్తున్న పిల్లలిద్దరూ తమమీద పిడుగేదో పడినట్టు ఊలుక్కిపడి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి “ఉప్మాయా” అన్నారు దీనంగా.
“ఏమైంది అమ్ము, మీ అమ్మ ఉప్మా చాలా బాగా చేస్తాది కదా, మీ కోసం జీడిపప్పు ఎక్కువేయిస్తా లెండి” అంటూ ప్రేమగా అన్నాడు అతను వీళ్ళను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ.
“ఆదివారం ఉప్మా ఏమిటి నాన్న” అంటూ గారాలు పోయారు ఇద్దరు.
“ఏ బంగాళాదుంప కూరతో పూరినో, టమాటో పచ్చడితో అట్లొ బాగుంటుంది కదా” అంటూ వారి వారి అభిప్రాయాలూ చెప్పారు.
“బాగుంటుంది కానీ, అమ్మకి పనెక్కువ అవుతుంది కదమ్మా” అన్నాడు.
“మెం సాయం చేస్తాం” అన్నారు కూడబలుక్కొని.
“అలా కాదమ్మా, ఉప్మా ఎంత గొప్పదో మీకు తెలుసా అసలు ” అంటూ ఉప్మా గొప్పలు చెప్పడం మొదలు పెట్టాడు.
“ఉప్మా మనం గోధుమ సన్న రవ్వతో లేదా దుడ్డు రవ్వతోనైనా చెయ్యొచ్చు, బియ్యం నూక అదే వరి నూకతో కూడా చెయ్యొచ్చు, బియ్యం నూక ఉప్మా కిందన మాడు భలే రుచిగా ఉంటుంది, ఇంకా మీ అందరి ఫేవరేట్ సేమ్యా ఉప్మా. ఇన్ని ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి” అంటూ ఊరుకోలేదు “ఉప్మా పూర్వం ఋషులు పార్వతి దేవి కూడా చేసుకొని తిన్నారని ఎక్కడో పురాణాల్లో చెప్పారట, అదే ఒక పెద్దాయన ట్విట్టర్లో చెబితే చదివాను. ఈ ఉప్మా రుచికరంగా చెయ్యగలిగిన వారు ఏ వంటనైనా మహా అద్భుతంగా చెయ్యగలరు తెలుసా” అంటూ సతీమణి వైపు చూసాడు.
ఆవిడ కురులను సవరిస్తూ వయ్యారంగా నడుముపై చెయ్యవేసి పక్కనే ఉన్న గోడ పై వాలి అయన మాటలను వింటూ ఓ చిరునవ్వు వదిలింది.
మళ్ళీ అతను “మీ ఫేవరేట్ హీరో పోకిరిలో ఉప్మా తిన్నాడు చూసారా, పెసరట్టులోకి నేస్తం ఉప్మా, చుట్టాలు వచ్చినప్పుడు సులువుగా చెయ్యగలిగేదే ఉప్మా, పెళ్లిలో అందరి కడుపు నింపేదే ఉప్మా, ఏ పచ్చడి చట్నీ తోడు లేకున్నా మనల్ని ఆదుకునే అమృతమే ఉప్మా. శాకాంబరీ ప్రసాదం ఈ ఉప్మా , అసలు
వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే
అన్నాడే కానీ ఉప్మా వంటి అల్పాహారం అని మధ్యలో కలపాలి, వాళ్ళ ఆవిడా వంకాయ కూర అంత బాగా ఉప్మా చెయ్యలేదేమో అందుకే పెట్టలేదు ఆ కవి గారు” అని గాలి పీల్చుకొని మల్లి ఉప్మాద్గతం అందుకున్నాడు “చిరంజీవి డాన్స్ వంటిది ఉప్మా, బాలకృష్ణ డైలాగ్ వంటిది ఉప్మా, వెంకీ సైలెంట్ ప్రేమ వంటిది ఉప్మా, నాగార్జున చార్మ్ వంటిది ఉప్మా, మహేష్ అందం వంటిది ఉప్మా, ప్లాప్ లో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ వంటిది ఉప్మా” అంటూ గలగలా మాట్లాడుతూ ఉప్మా గుణగణాలు వర్ణిస్తుంటే పిల్లలు ఏఱ్ఱి మొహాలు వేసి “అమ్మ ఉప్మా అంటే నాన్నకు ఇష్టం, దాని కోసం ఎన్ని కథలైనా చెబుతారు, ఈరోజుకి మనకు ఉప్మా ఏ గతి అంటూ గదిలోకి వెళ్తుంటే సతీమణి వారిని అన్నపూర్ణాదేవిలా ఆపి “సర్లే పూరీలోకి ఏ కూర కావాలో చెప్పండి” అంది, అయన వైపు కొంచం జాలిగా చూస్తూ.
“శనగపిండి, ఉల్లిపాయ కూర కూడా పర్లేదు” అన్నారు ఆనందంగా.

వావ్.. ఏమన్నా చెప్పారా ఉప్మా గొప్పదనం .. 👌
ఉప్మా అంటేనే గొప్పది కదండీ