ఏంది నాసుట్టు నేనేంది ఈడని
రోజు సదమద మైతరొ శివిగా
సదువూ గురువూ ఎరగని జీవిర
ఇవరం నివ్వే దెలుపరొ శివిగా
యాడ నీ ఇల్లు యేది నీ కొలువంట
బగు ఆత్రము ఆగమైతరో శివిగా
పురుగు బుట్రకే నీ ఆదరమాయెన
నేనీడ నీ నీడ గోరి అల్లాడగ శివిగా
సేదుకో నన్నని అడిగినంతనే
అదుకుంటవని పేరుర శివిగా
శివ శివాయంటె సెవికినపడదా
నీకు సెవుఁడా ఏందిర శివిగా
నిన్ను దలపకుండ నా దినమేడుందిర
గుండె సెలమ జేసి అబిసేకము శివిగా
మరి నే ఓయని పిలిసితే కోయనవేందిర
బక్తసులబుడంట ఎచ్చులేందిర శివిగా
కరువు దీర నిను రెండు కండ్ల జూడ
నా కండ్లు జాలవంట గద శివిగా
నీ దరిసెనమానని సూపు నాకేల
నీ అగ్గికన్ను దెరుసు నాదిక్కుర శివిగా
ఆట నీది ఆటగాడు నీవటర
నీమనిబందము నీ మాయట శివిగా
నీ కుశాలు నువు జూసుకుంటవా
ఇందిల నా తపన ఎంచవా శివిగా
నివ్వే సత్యము నివ్వే నిత్యము
సకలము నివ్వేనంటగ శివిగా
అంతా నివ్వే అయ్యిన కాడికి
నేనెవురన్న కౌతు నాకేలర శివిగా
ఎవ్వురు నివ్వని ఎదికిన దంకా
ఎన్నెన్ని ప్రశ్నలు నివ్వుర శివిగా
ఎఱిక దెలియుకై ఎదను తడిమితే
నా ఉనికి నీవని అరసిర శివిగా
పలుకు, #తెలుగు #అమ్మనుడి, #శివోహం #ఆధ్యాత్మికం, #భక్తి, #కవిత
@vennela
