ఆకొన్న కూడె యమృతము

పూర్వం ధారా నగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు కాపురముండేవాడు. భుక్తి గడచేది కాదు. కుటుంబపోషణార్థం యాచకవృత్తి నవలంబించినవాడు. రాజాశ్రయం పొందితే ధనధాన్యాలకు లోటుండదని ఎవరో సలహా ఇస్తే, ఆ ప్రయత్నం చేయాలని ఆశ. కానీ ఏమంత చదువు సంధ్యలున్నవాడు కాదు. అపండితుడు. మరి రాజ దర్శనమెలా? అదీ తాను చేరవలసింది మహారాజు భోజుని దర్బారు!

ఏదైనా కవిత్వం రాసుకెళ్ళి భోజరాజును మెప్పించమని మార్గాంతరం సూచించాడుట, ఆ సలహా ఇచ్చినాయన. ఇక మన కథానాయకుడు ఆ పనిలో పఢ్డాడు. సరే, వెళ్ళేది మహారాజ సముఖానికి. పక్కింటి బకాసుర చయన్లుగాడిని పలకరించినట్లు అరే ఒరే అంటే తలకీ మిగిల్న శరీరానికీ తెగతెంపులైపోవూ. అంచాత మర్యాదగా పిలవాలి.

ఎలా?
ఓ రాజా, అంటే ఏమంత బాగు? అదే, ఇంద్రుడితో సముడవైన ఓ రాజా అంటే ఎంత ఘనంగా వుండూ! కాబట్టి అదే సరైన సంబోధన. రాజేంద్ర, అన్న పిలుపు స్థిరమైంది. ఇక ప్రభువులవారి ఎదరపడి ఆయనని రాజేంద్రా అని పిలిస్తే చాలదే! మనం అక్కడికి వెళ్ళిందే మన కోరిక తెలియ చేయాలని. మరి మనం కోరేదేమిటీ?

కాలే కడుపుక్కావలసింది కబళమే కదండీ. నలుగురి ముందు చేయి చాచి దేహీ అనటమే నిత్యకృత్యమైన వాడు ఇంకేం అడగగలడు? అతగాడూ అదే అడిగాడు. అలా పద్యంలోని మొదటి పాదంలో సగభాగం – భోజనం దేహి రాజేంద్ర అని సాధ్య పడింది.

మరా భోజనంలోనికి ఏం కావాలయ్యా? ఏ స్టఫ్డ్ పీకాక్ అనో, ఖడ్గమృగం కబాబులనో ఆడిగితే ఏమనుకుంటారో. ఆపైన కులం కర్మం కలిసిరాక ఈమాట ఊరిలో పొక్కితే సాటి బ్రాహ్మణ సమాజం ఎంత ఆక్షేపించునో, కేలండరు మారి ఏ మనేకా గాంధీగారో మింస్టరైపోతే, ఇంకేమగునో! అందుకని ట్రైడండ్టెస్టెడ్ వెజిటేరియన్ ఫుడ్డీజ్వెరీగుడ్డనుకున్నాడుట.

ఆ ప్రకారం అన్నంలోకి కాస్తంత పప్పు, ఆపై కమ్మని నెయ్యి – రోజూ కలగనేదిదే కదా, ఇంతే చాలనుకుని వీటినే సంసృతంలోకి తర్జుమా చేసుకున్నాడో, చేయించుకున్నాడో – ఏదో తంటాలు పడ్డాడు.
శుభం! మొదటి పద్యపాదం తయార్.
“భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం..”

సరేనయ్యా. కానీ, రెండు వాయలు పప్పన్నం లాగించినా, అరిచేతిలో నాలుగు చుక్కలు నీళ్ళుంచుకు అపసవ్యంగా చెయితిప్పి ఆకు మడిచే ముందు, పెరుగన్నం ఒక్ఖ వాయ తగిలించకపోతే అదేం తిన్నట్టూ!! మరదెలాగా అడగటం??
దానికేం భాగ్యం, “మాహిషంచ దధీ” అనేస్తే పోలా?! చిక్కని గేదె పాలతో తయారైన కమ్మని పెరుగు కదూ అడగటం…

హమ్మయ్య! ఇక రాజాస్థానంలోకి అడుగు పెట్టటం, రాజుగారు మెచ్చి అన్నం పెట్టటం, అంతే.
తగ్గవోయ్, తగ్గూ…
ఏం? కవిత్వమంటిరే? రాసాం కదా?
ఏవిటీ రాసిందీ? వీపు గుంజకేసా??
ఇదేం పితలాటకం మహానుభావా? ఇంకా ఏముందనీ?
ఊరుకోవయ్యా… రాసావుటనే మహా! ఏదీ ఆ రెండో పద్యపాదం పూర్తి కానిదే!?
“భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం
మాహిషంచ దధీ..” (!?)
ఇదిటయ్యా పద్యం? ఇదా కవిత్వం? కాయంలో ప్రాణం మిగలాలనే??
చచ్చాం పో. చంపేసావు కదయ్యా… మరిప్పుడేం దారీ?
గోదారి. కొండుభొట్లవారి అనుజ్ఞ పుచ్చుకు నదీప్రవేశం చైడవేఁ.
బాబ్బాబు. అలా అనకయ్యా. ఏదేనీ ఉపాయం చెపుదూ. అసలే బహు సంతానం, ఏకైక సంతానవతితో నిరంతరం సతమతం సంకులం జీవితం!

ఇదో, ఇలా ఇక్కడ చిక్కడిపోయాడు పాపమా యాచక బ్రహ్మ. చదువు రాదు. పాండిత్య ప్రకర్ష లేదు. భోజరాజు మెప్పు లేక జఠరాగ్ని చల్లారదు. వేరేమీ తోచక తనకు తోచిన ఆ పద్యభాగమే ఒక తాటియాకు మీదికెక్కించి వీధిన పడ్డాడు.

కనపడిన ప్రతివారినీ అడిగాడు. పరిచయమున్న పండితులందరి ముందూ ప్రణమిల్లాడు. తెలియని వారైనా, కవి అని వింటే చాలు కైమోడ్చాడు. తను వ్రాసుకొన్న మాటలకు పద్యరూపమిమ్మని అభ్యర్ధించాడు. ఎవరికీ వశం కాలా. ఏ ఊర్వశి ఊరువులో, సానివాడ సరసిజాక్షి సాంగత్య సౌఖ్యమో అంటే కవనం కదను తొక్కుతుంది కానీ, కళ్ళలో ప్రాణం పెట్టుకున్న బీద బాపడి ఆకలి అరుపులంటే కలం కదలాడదే!

విసిగి వేసారినా, అణగారుతున్న ఆశ తప్ప ఆధారం లేని ఆ బ్రాహ్మణుడి కాళ్ళు దారి వెతుక్కుంటూ ఊరి చివరి సత్రంలో అడుగు పెట్టాయి. ఏదో జరుగుతుందని కాదు, ఏదోకటి జరిగినా అదే చాలని!
ఊరికి దూరంగా. ఎప్పటిదో పాతకాలంనాటి సత్రమేమో. పెద్దగా పరదేశీలెవ్వరూలేని చోటు. అలసిన కాళ్ళు ఆగిపోయాయి. అలసిన ఒళ్ళు చతికిలబడింది. అలసిన మనసు అయ్యోమని విలపించింది. అలసిన కళ్ళు చెలమలయాయి. తన ఈ దౌర్భాగ్యానికి నింద ఎవరు మోయాలో, తన దుస్థితి తొలగే ఉపాయం ఎక్కడ వెదకాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆ పేద బ్రాహ్మడు!
ఎవరవయ్యా నీవు? ఏలనీ వగపు? ఎందుకిలా చింతిస్తున్నావంటూ ఎవరిదో పిలుపు.
తల ఎత్తి చూస్తే ఎదుటన ఒక ఆగంతకుడు. ఎవరో అపరిచితుడు.
ఒక్క ఉదుటన తన గోత్రనామాలు, ప్రవర వల్లించాడు బాపడు. అహం భో అభివాదయే అని ఊపిరి తీసుకున్నాడు, ఉపనయనంనాడు వల్లె వేసిన నాలుగు ముక్కలూ ఎలాగో గుర్తు చేసుకుని.
తమరెవరంటూ ఎదుటి వ్యక్తిని పరిచయం కోరాడు.

అయ్యా, తమరు కవులా? సంస్కృత పండితులా?
ఏదో తోచిన నాలుగు మాటలు రాసుకుంటూ వుంటానండీ. గొప్ప కవినైతే కాదు. ఇక సంస్కృతమంటారూ, శబ్దమంజరినుండీ రామ శబ్దం, మరో నాలుగితరములేవో చెప్పుకొన్నానంతే.
ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు తను. ఎదుటనున్నది గడ్డిపరకేనేమో. ఏమో.. అదే ఒడ్డుకు చేరిస్తేనో? ఆనూతన వ్యక్తికి తన కథంతా చెప్పుకున్నాడు. తన రాసిన పద్యపాదం చూపాడు. ఆ మిగిలిన భాగం పూర్తిచేసిపెట్టగలరేమో చూడమని అర్థించాడు.
ఏదీ, చూడనిమ్మని ఆ తాటియాకు అందిపుచ్చుకున్నాడా కొత్తమనిషి. అందుమీదనున్న పద్యపాదం చదవగానే ఒక చిత్రమైన నవ్వు… చేత గంటం పుచ్చుకుని ఆ పద్యాన్నేదో సరిచేసి తిరిగిచ్చాడు. మహారాజుగారి ఆదరణ పొందుమని ఆశీర్వదించాడు.
ఎట్టకేలకు పద్యం పూర్తయినదన్న సంతోషం నేలను నిలువనీలేదా యాచకస్వామిని. తనూ తన కుటుంబం పిడికెడు కూటి కొకింత చేరువయ్యామన్న ఆలోచన అతడికి కొత్త బలాన్నిచ్చింది. తనను వీడకుండా నిలచిపొమ్మని ప్రతి రాత్రీ నిశీధికన్యను ప్రాధేయపడే అతడు, ప్రభాతకాంత గాఢపరిష్వంగ భాగ్యమెపుడెపుడా అని ఉవ్విళ్ళూరాడు.

సకల చైతన్యమునకూ కారణభూతుడు తానేనని విర్రవీగే మేల్ప్రొద్దు మొనగాడు ఉదయాద్రిపైన అచేతనుడైనాడు. తెలవారిందిక లేవండొక్కొక్కరొకో అంటూ రోజూ కూసే కోడి కూసింత కంగారు పడింది. ఏళ్ళ తరబడి సూర్యోదయాన్నీ కోడికూతనీ పట్టించుకోని మన విప్రుడు వాటికే స్వాగతం పలుకుతూ గుమ్మం మొగదల!!
భార్య ఎదురురాగా, చిరకాల స్నేహితులైన జంకు భయములు తోడుగా, ఎందుకైనా మంచిదని ధైర్యము గాంభీర్యాలను కూడా బతిమాలి వెంటదోడ్కొని ఇంటినుండి రాజాస్థానం కడకు సాగిందతడి ప్రస్థానం.

ఎట్టకేలకు ప్రభువులు కొలువుతీరి వుండగానే వారి సముఖంలో, మహారాజ రాజమార్తాండ డాండడడాండ.. అంటూ మునుపెన్నడూ లేని, రాజావారికే తెలీని మరో రెండు బిరుదులంటించి, మరి తమ శలవైతే… అని ప్రభువును చూసాడు ఆశగా.

చినిగిన గావంచా. చింకిపాత చీరొకటి తలపాగా. చేతనొక తాటాకు బద్ద! ఆహా, ఊడిపడ్డాడయ్యా కవి మార్తాండుడు, అనుకుంటూ మొగాలు చిట్లించారు సభాసదులు. ఆస్థాన శోభయైన నవరత్నాలు నవ్వుకున్నాయి: ఒకింత జాలిగా, కించిత్ వేడుకగా. సభంతా నిశ్శబ్దంగా నిరాసక్తంగా వుండటం గమనించి కంగుతిన్నాడా యాచకుడు. భయపడుతూనే ప్రభువులాజ్ఞ కొరకు ఆశగా చూసాడు.

మందహాసంతో తల పంకించాడు భోజుడు. రసికుడైన శ్రోత/పాఠకుడు కవి అంతరంగ మధనంలోనుండీ పుట్టే రచనామృతం బిందుమాత్రమే లభ్యమైనా సింధువంతగా భావించి ఆస్వాదిస్తాడే కానీ, రత్నఖచిత పానపాత్రలో నింపలేదని ఆ రససుధను తిరస్కరించడు కదా. మరి భోజుడు కవిరాజు కూడానయే!

హమ్మయ్య!! ఆజ్ఞ అయింది.

“భోజనం దేహిరాజేంద్ర, ఘృతసూప సమన్వితం”

పద్యం మొదటి పాదం వింటూనే భోజుడి మొహంలో ఒకింత వైకల్యం, ఒకింత వినోదం! ఐనా కడుపు నిండిన వాడికి కళలూ కవితలూ కానీ, ఆకలితో అలమటించే అడుగు తరగతి కుటుంబీకుడికి కడుపాశే తప్ప కవిత్వం మీదనా ధ్యాస! వాడింకేం చెప్పగలడు!?
ఏమో… వాడింకా ఏం చెప్పగలడో!!

“మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి.”

భయపడుతూనే తడబడుతూనే రెండవ పాదం చదివి పద్యం ముగించాడో లేదో ఆ అన్నార్తి, సభలో సంభ్రమం. భోజుడి మొహంలో విభ్రమం. తన సింహాసనం వీడి వడి వడిగా అతడిని సమీపించాడా రాజు.
అయ్యా, ఈ పద్యం తమరి స్వీయమేనా, వేరెవరైనా రాసి ఇచ్చారా? నిజం చెప్పండి. మీకే ఆపదా లేదు!

వణికిపోయాడా బ్రాహ్మణుడు. గ్రాసం మీది ఆశ కంఠం మీద పాశమౌతుందన్న భయం. బహుమానం పీడాపోయే, బలుసాకు దక్కితే బతికిపోయామన్నట్లే అనుకున్నాడు మనసులో. చేతులు జోడించి, మహారాజా మన్నించండి. భుక్తి గడచే మార్గం లేక తమరి ఆశ్రయం పొంది భార్యా బిడ్డల పోషణ చేసుకుందామన్న దురాశ తప్ప మరో పాపం ఎరుగను. పద్యం లోని మొదటి పాదం మాత్రమే నాది. పూరణ ఎవరో పరదేశి; కవి వలెనే వున్నాడు. నాకథ విని, రెండవపాదం అవలీలగా అలవోకగా రాసి ఇచ్చి, తమరికి వినిపించమన్నాడు

ఓహో. విధివశాత్తూ, ఆ అపరిచితుడు ఈనాటి సభలో కాలూనాడేమో. మీరు అతడిని గుర్తించగలరేమో, చూడండి. ఆ అగంతకుడు ఈ కాళిదాసమహాకవిని పోలి ఉంటాడేమో పరికించండి!

ఈసారి తెల్లబోవటం ఆ బ్రాహ్మడి వంతు. ముందునాటి సంధ్యాసమయంలో తాను కలిసిన వ్యక్తి రాజాస్థానంలోనా? కాళిదాసంతటి మహాకవి తానే స్వయంగా తనకు పద్యపూరణ చేసి ఇవ్వటమా. ఆహా… అవును కదా. అతడీ మహాకవే నిస్సందేహంగా. ముందునాడు తానున్న మానసిక స్థితి, ఎదుట సామాన్యుడివలె ఉన్నది సాక్షాత్తూ కాళీవరప్రసాదుడని పోల్చుకోనివ్వలేదు.

నా అపచారం మన్నించండి మహాకవీ. మాన్యులను సామాన్యులనుకొన్నాను. పరుషంగా, దూకుడుగా భాషించానేమో కూడా… అంటూ పాదాలంటబోయాడు. వద్దు వద్దు, నీయందు ఏమాత్రం దోషం లేదంటూ వారించాడా కవిచంద్రుడు.

విప్రుడి వినయ విధేయతలకూ సంస్కారానికీ సంతసిల్లిన భోజుడు, అతడికి, అతడి కుటుంబానికీ ఆజన్మమూ భోజన లేమి కలుగకుండునట్లు సదుపాయము చేసి సాగనంపాడు. తదనంతరం కాళిదాసును ఘనంగా సత్కరించి అది తానే పొందిన గౌరవమని గర్వించాడు.

ఇంటికి మనం చేరేందుగ్గానూ, కంచికి కథను సాగనంపే ప్రాచీన ప్రథ ఇక్కడ పాటించేసాం.

ఇక ఈపద్య విశేషం గమనించిట్లైతే, ఒక సామాన్యమైన అభ్యర్థనకి అతి విశిష్టమైన సౌందర్యం కల్పించిన కవి కల్పనా చాతుర్యం ఎంత అద్భుతమో తెల్లమౌతుంది.

భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం
మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి

“అన్నం, పప్పు, నెయ్యి, ఆఖర్న ఒకింత పెరుగుతో కూడిన భోజనం దయచేయించవయ్యా, మహారాజా!” స్థూలంగా ఇదీ శ్లోకార్థం. కానీ అది ఎటువంటి పెరుగై వుండాలయ్యా అంటే, శరదృతువులో పౌర్ణమినాడు కురిసే చంద్రుని వెన్నెల అంత తెల్లగా, చల్లగా వుండాలట. ఇదీ ఆ కవి చమత్కృతి.

సహజంగా వెన్నెల అన్న తలంపే ప్రతివారికీ ఆహ్లాదకరమైన అనుభూతినందిస్తుంది. ఆపై శరత్కాలమంటే చల్లదనం, ఉల్లాసం. భావోద్వేగ తరంగాలు పెల్లుబికే సమయం. అదే వెన్నెలఱేడి దరహాసం మరి ఆ శరత్కాలంలో అనుభవమైనవారు ఇక మరెంతగా ఆనంద పరవశులవాలి!? అదేవిధంగా, క్షుధార్తుడైనవాడికి, భోజన సమాప్తి వేళ శరద్పూర్ణిమనాటి చందమామ వంటి కమ్మని గడ్డపెరుగు లభ్యమైతే ఆ సంతోషం చెప్పనలవా?!

కాళిదాస మహాకవి ఎంతటి రసరమ్యమైన పద్యం తీర్చిదిద్దాడో. ఇంతటి మనోహరమైన కల్పన సాధారణ మేధకు సాధ్యమా! అందుచేతనే,
“అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః
యధాస్మై రోచతే విశ్వం తధేదం పరి వర్తతే”
అని దణ్ణం పెట్టుకు మరీ, ఆ సుకవులను కీర్తించుకోవటం, మనం.

#పలుకు, #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #సాహిత్యం #పద్యం

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

“…శివా రుద్రస్య భేషజీ…”

కాల,దురితాల నడుమ నలిగి,ఈతి బాధలు పడుతు చెలగి,తనవారికి తక్క, పరులమేలు తలవకఇహపరాల తలపు

మనసు ఛెళ్ళుమంది!

(నిజ జీవిత సంఘటనల ఆధారంగా) కొన్ని సంవత్సరాల క్రిందట, పూనే లో జరిగిన