కలియుగంలో సాంకేతికతకు, సంప్రదాయానికి మధ్య జరిగే యుద్ధాలకు కొదవే లేదు. కానీ విశాఖపట్నంలోని సీతమ్మధారలో, సుబ్బారావు గారి ఇంట్లో జరుగుతున్నంత భీకరమైన యుద్ధం బహుశా ముల్లోకాలలోనూ జరిగి ఉండదు. అక్కడ ఒక పక్షం, ఇల్లాలు శాంతమ్మ గారైతే, అవతలి పక్షం అమెరికా నుండి దిగుమతి అయిన ‘స్మిత’ అనే స్మార్ట్ స్పీకర్. మధ్యలో నలిగిపోతున్న అమాయకపు మధ్యవర్తి, భర్త సుబ్బారావు.
ఆ స్పీకర్‌ను వాళ్ళ అబ్బాయి పంపినప్పుడు, “ఇది మీతో మాట్లాడుతుంది, మీ పనుల్లో సాయం చేస్తుంది” అని చెప్పాడు. శాంతమ్మ గారు దాన్ని పైనుండి కిందకు ఒకసారి స్కాన్ చేసి, “దీనికి కళ్ళు, కాళ్ళు లేవు, ఇది చేసే సాయం ఏంటో, నా కర్మ ఏంటో” అని తీర్మానించేశారు. ఆ రోజు మొదలైంది, శాంతమ్మ గారి శాస్త్రానికి, స్పీకర్ గారి సూత్రానికి మధ్య నిరంతర ఘర్షణ.
ఒకరోజు మధ్యాహ్నం, శాంతమ్మ గారు తన చిరకాల స్నేహితురాలు లలితతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. “ఏమిటో లలితా, ఈ మధ్య మా ఆయన ప్రవర్తన ఏమీ బాగోలేదు. ఎప్పుడు చూసినా ఫోన్‌లోనే ఉంటున్నారు. నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో” అని బాధపడ్డారు.
వెంటనే హాల్లో ఉన్న స్పీకర్, ‘స్మిత’, తన మృదువైన స్వరంతో, “ప్రేమను పెంచడానికి కొన్ని చిట్కాలు: రోజూ అభినందించండి, చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి, కలిసి సమయం గడపండి…” అని సలహాల జాబితా చదవడం మొదలుపెట్టింది.
శాంతమ్మ గారు ఉలిక్కిపడి ఫోన్ పెట్టేశారు. “ఆమ్మో … ఈ గూఢచారి డబ్బా నా మాటలన్నీ వింటోంది! దీనికి నా సంసారం గురించి అంత ఆరాటం ఎందుకో!” అని గట్టిగా అరిచారు.
కానీ, ఆ స్పీకర్‌కు, శాంతమ్మ గారికి మధ్య అసలైన యుద్ధం మొదలైంది వంటింట్లోనే. ఒకరోజు, “స్మితా, ఈరోజు ఏదైనా కొత్తగా సాంబారు ఎలా చేయాలో చెప్పు” అని సరదాగా అడిగారు.
స్పీకర్ ఏదో ఇంటర్నెట్ వంటల పుస్తకం నుండి కాపీ కొట్టి, “ముందుగా, కూరగాయలను ఉడకబెట్టి, అందులో కొద్దిగా పంచదార, గరం మసాలా వేయండి…” అని చెప్పడం మొదలుపెట్టింది.
అంతే! శాంతమ్మ గారిలో ఉన్న పాకశాస్త్ర ప్రవీణురాలు ప్రచండ రుద్రురాలిగా మారింది. “ఛీ ఛీ ఆపు! సిగ్గులేకుండా చెబుతున్నావు! సాంబారులో పంచదార వేస్తారా? మా అమ్మమ్మ ఆత్మ ఘోషిస్తుంది. అసలు సాంబారు ఎలా చేయాలో నేను చెబుతాను, నీ బుర్రలో ఎక్కించుకో” అని చెప్పి, అరగంట పాటు తన వంశపారంపర్య వంటకాన్ని మొత్తం ఆ స్పీకర్‌కు అప్పజెప్పారు.
అంతా విని, స్పీకర్ ఎంతో వినయంగా, “ధన్యవాదాలు. మీ ‘సిగ్గులేని సాంబారు’ రెసిపీని నేను సేవ్ చేశాను” అని బదులిచ్చింది.
ఆ దెబ్బతో శాంతమ్మ గారు ఆ స్పీకర్‌తో మాట్లాడటమే మానేశారు. దాన్ని “సాంబారును ఖూనీ చేసిన డబ్బా” అని పిలవడం మొదలుపెట్టారు.
ఆ వారం వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు. భోజనాల దగ్గర, వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వీడియో కాల్ చేసి, “అమ్మా, బంధువులందరికీ నీ స్పెషల్ సాంబారు రుచి చూపించు” అన్నాడు. దానికి శాంతమ్మ గారు, “నా సాంబారు కాదురా, ఇప్పుడు మన ఇంట్లో కొత్తగా ‘సిగ్గులేని సాంబారు’ ట్రెండ్ నడుస్తోంది. ఆ డబ్బాయే చేసి పెడుతుందిలే!” అని వ్యంగ్యంగా అన్నారు.
ఆ మాట వినగానే, సుబ్బారావు గారికి తన జీవితం ఆ స్పీకర్‌లాగే, భార్య శాస్త్రానికి, టెక్నాలజీ సూత్రానికి మధ్య నలిగిపోతున్న ఒక బఫర్ పరికరంలా అనిపించింది.
ఆ రోజు నుండి, సుబ్బారావు గారు ఒక కొత్త అలవాటు చేసుకున్నారు. ఆఫీసు నుండి రాగానే, ఇంట్లోకి అడుగుపెట్టే ముందు, తలుపు దగ్గరే నిలబడి, “స్మితా! ఈరోజు ఇంట్లో వాతావరణం ఎలా ఉంది? ఏమైనా వంటల ప్రయోగాలు జరిగాయా?” అని అడుగుతారు. స్పీకర్ నుండి “అంతా ప్రశాంతంగా ఉంది” అని వస్తేనే లోపలికి అడుగుపెడతారు. లేదంటే, ఏమీ తెలియనట్టు, “పక్కింటి పరంధామయ్య గారు పిలిచారు” అని చెప్పి, గంట తర్వాత వస్తారు.
అందుకే అంటారు, టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తుందో లేదో తెలియదు కానీ, ఖచ్చితంగా బతకడానికి కొత్త దారులు మాత్రం నేర్పిస్తుందని.
