“పలుకు!”

చక్కటి తెలుగు పదం ఇది. సూచించిన హర్షకు అనేక అభినందనలు. ఈ వేదిక సుందరంగా అగపడుతున్నదని మీలో ఏ కొందరు సంతోషించినా, ఆ ఖ్యాతికి హర్షకు కూడా హక్కుంది. మాధురి, ఆదిత్య మిగిలిన ఇద్దరూ. దీక్ష, దక్షత అనే పదాలకు వీళ్ళే నిర్వచనమేమో అన్నంత కృషి. నిజానికి, ఇంకా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ‘పలుకు.ఇన్’లో లాగిన్ అయే మనమంతా ఈ ముగ్గురికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి.

ఐతే, దీనంతటికీ మూలవిరాట్టు మరొకడున్నాడు. నాగ్ వాసిరెడ్డిగా మనందరికీ సుపరిచితుడైన ఈ పాడ్‌కాస్టర్ కమ్ బ్లాగర్ పుఱ్ఱెలో పురుగు తొలవటం, తోడుదొంగ ఆదిత్యగారిని నువ్వేమంటావని సంప్రదించటం, వారిద్దరూ ఔననుకున్న దగ్గర మొదలైన కథ ఇది. క్లీన్ అండ్ క్రిస్ప్ అంటారు కదా మీ చదువుకున్నవాళ్ళు. ఆ ప్రక్రియ కొనసాగటానికి ఇతగాడి మేధని తడుముతూనే ఉన్నాం.

ఇంకొక రెండు పేర్లు చెప్పవలసినవున్నాయి. మొదటగా వయసుకి చిన్నవాడైనా, విషయానికొస్తే నలుగురిని కూలేసి పాఠం చెప్పగల చదువరి, కాదంటూనే కాయితం నలుపు చేయగల చేవగలవాడూ, ఆర్యన్ హరీశ్‌గా మనకు తెలిసినవాడు. ప్రారంభం నుండి సలహా, సమీక్షల సాయం అందించిన ఘనుడు. ముందురోజుల్లో మరింతగా ఒళ్ళువిరుచుకోవలసిన కార్యశూరుడు.

ఇక మోహన్ అనబడే కృష్ణమోహన్. మనం ఆయనని ప్రత్యేకంగా అనుమతి అడిగాలా? ఎద్దునడిగి గంత కడతామా? నీపని నువ్వు చెయ్యమంటే కాదంటాడా? అని దబాయించటమే అన్నారు శ్రీ చిన్న కం.దర్పంగా.రు. ఈ మాటలతో పాటు, సౌమ్యంగా, ఒకసారి ఈ వెబ్‌సైట్ సిద్ధమయాక నీవు చేయాల్సిన పని, మోయాల్సిన భారం చాలా ఉంటుందని, అందుకు నువ్వు ఒప్పేసుకున్నావోచ్ అని నావంతు రాయ.భారం కూడా దించేసుకున్నా.

అంచాత మనందరి నుండీ ఈ అందరికీ ఓ పె……..ద్ద థాంక్స్!

మరైతే, ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నట్టుండి ఎందుకీ ‘పలుకు?’ ఎవరికి?

ఆ కథా క్రమంబెట్టిదన… ఒకంత కాలంగా మన తెలుగువారు కొందరం ట్విట్టరు మాధ్యమం ద్వారా ఒండొరులకు పరిచయం కావటం, అటునుండి స్నేహం పెంచుకోవటం, నిజ జీవితంలోనూ ఆత్మీయత పంచుకోవటం…

అలా మనకు తెలియకుండగనే అందరం ఒకే కుటుంబమనుకునే దగ్గరితనం. ఇలా మనందరినీ కట్టిపడేసిన సూత్రం, మన అమ్మనుడి తెలుగు. మన తెలుగుదనం. మన తెలుగు ధనం.

వివిధ రంగాలలో ఆసక్తి, నేర్పరితనం ఉన్నవారు మనలో అనేకులు. తమకున్న విషయ పరిజ్ఞానం, నైపుణ్యం మరొకరితో పంచుకోవాలని, ఇతరులనుండి మరికొంత తెలుసుకోవాలనే కాంక్ష తరచుగా చూస్తుంటాం. అలాగే కేవల మేధోమధనం మాత్రమే కాక, తమలోని భావోద్వేగానికి కూడా రెక్కలు కట్టి ఎగరనీయగల చాకచక్యం కూడా.

పేరుప్రఖ్యాతులున్న రచయితలకు పోటీ కాకున్నా, తమకున్న పరిధిలో, ఎంతో చక్కని కథలు కవితలు, సాహితీ చర్చలు, రోజువారీ సంఘటనలకు రంగులద్ది శభాసనిపించుకోగల వారు మన మధ్య కొల్లలు. నిత్యం మనకు ఆ అనుభవం అందచేస్తూనే ఉన్నారు.

ఐతే, ట్విట్టరు, ఫేస్‌బుక్ వంటి వేదికలు వీరిలోని సృజనాత్మకతను కొంతమేరకే, ఆయా వేదికల వరకు మాత్రమే; పరిమితం చేస్తున్నవనిపిస్తుంది. ఈ రచనలు, రచయితలు పాఠకలోకానికి మరింతగా చేరువ కావటం బాగుంటుందన్నది ఒక కోరిక. నవ్యతను నాణ్యతను వెతికే చదువరులకు కూడా ఒక మంచి మంచెను ఏర్పాటు చేయాలన్నది మరొక ఆశ.

అలా నాటుకున్న బీజం నేడు ఇలా చిగురు తొడుగుకున్నది.

కలం కదిపి మీముందట ‘పలుకు’ తేనె చిలుకుతున్నది.

ఆదరాన వెంట నిలువు. కొత్త అడుగులతో ఎదుగు కోరుతున్నది.

అభినందనలతో,

సంపాదకులు

5

1 Comment Leave a Reply

  1. పలుకు సర్వాంగ సుందరం గా ఎదగాలని కోరుకొందాం.

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

నాన్న టీ షర్ట్

నేను పూనే లో వ్యవసాయ కళాశాలలో చదివేరోజుల్లో, లక్ష్మీ బజార్ లో నాన్న

స్మృతులు-1

నాకు ఎవరో పంపారు.. మీతో ఇక్కడ పంచు కొంటున్నా ….. ==================== రైల్వే