ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కధనం ప్రచురించింది. జీఎస్టీ రేట్లు తగ్గటం, అంతేగాక “తల్లికి వందనం” పథకం ద్వారా దాదాపు అన్ని కుటుంబాలకి డబ్బులు రావడం వల్ల అంధ్రాలో అనేక రకాల వస్తు సామాగ్రుల అమ్మకాలు పెరిగాయని, ఆఖరికి ఆ డబ్బుతో బంగారం కూడా కొని దాచుకుంటున్నారని. ఆ విధంగా కూటమి ప్రభుత్వం విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్ధిక వ్యవస్థ బలపడుతున్నదని.
ఏడవాలో నవ్వాలో అర్ధంకాలేదు. ప్రజలు “తల్లికి వందనం” సొమ్ముతో అనేక రకాల వస్తు సామాగ్రులు కొనుక్కుంటున్నారంటే దాని అర్ధం వాళ్ళు ఆ డబ్బుని పొదుపు చేసుకుని తమ పిల్లల చదువుకి వాడుకోవాల్సిన అవసరం లేకపోటం వల్లే కదా. అంటే ఈ పధకం కింద వేలకోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వం అనర్హులకి లేదంటే అవసరం లేని వారికి కూడా ఇస్తున్నట్టే కదా. పైగా ఇదేదో గొప్ప ఆర్ధిక విధానమన్నట్టు ఆంధ్రజ్యోతి బాకాలు ఊదటం. ఐతే మీలో కొంతమందికి ఈ కొనుగోలుశక్తి పెరుగుదల అనేది సబబైన వాదనగా అనిపించొచ్చు. అది ఎందుకు డొల్ల వాదనో వివరిస్తాను. దీన్ని ఆర్ధిక శాస్త్ర నిపుణులు the fallacy of broken window గా అభివర్ణిస్తారు.
ఒక ఆకతాయి కుర్రాడు ఒక షాపుకున్న గాజు కిటికీని రాయి విసిరి పగలకొట్టి పారిపోయాడనుకోండి. ఆ షాపు యజమాని ఆ తర్వాత ఏమి చేస్తాడు? కొత్త గాజు కిటికీ పెట్టించు కుంటాడు. గాజు కిటికీలు అమ్మే వ్యాపారికి అదనంగా రాబడి వచ్చింది కాబట్టి అతను ఆ డబ్బుతో వాళ్ళావిడకి చీర కొనిపెట్టాడు. ఈ ఆంధ్రజ్యోతి లాజిక్ ప్రకారం ఆకతాయి చేసిన పని వల్ల కిటికీలు అమ్మేవాడు, చీరలు అమ్మే వాడు ఎక్కువ వ్యాపారం చేయగలిగారు, అలా ఆ పట్టణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందింది. కానీ ఇక్కడ గమనించాల్సిందేంటంటే కొత్త గాజు కిటికీ కోసం ఆ షాపు యజమాని పెట్టిన ఖర్చు (ఐదు వేల రూపాయలనుకుందాం) అతను అకారణంగా కోల్పోయినట్లేగా. సరే అతను కోల్పోయిన ధనం సమాజం వేరెవరికైనా పూర్తిగా దక్కిందా? కిటికీలమ్మే వ్యాపారికి ఆ 5 వేలు ముట్టాయి, కానీ అతను 4 వేల ఖరీదయిన కిటికీని షాపు యజమానికి అప్పజెప్పాడు కదా. అంటే అతనికి నికరంగా వెయ్యి రూపాయిలు దక్కాయి. మరి షాపు యజమానికి 5 వేల రూపాయిలు పోయాయి కదా. ఆ మిగిలిన నాలుగు వేల రూపాయలు ఆ పగిలిన కిటికీ విలువ అన్నమాట. అంటే ఆ ఆకతాయి వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థలోంచి నాలుగు వేల రూపాయల విలువున్న ఆస్తి వృథాగా నష్టమయింది.
ఇప్పుడు ఇంకో సన్నివేశం ఊహించుకోండి. కిటికీలు అమ్మే వ్యాపారి కొంత సొమ్ము R&D పై వెచ్చించి కొత్త డిజైన్ల కిటికీలు తయారు చేశాడు. షాపు యజమాని అలాంటి కొత్త కిటికీ ఒకటి 8 వేల రూపాయలకి కొనుక్కుని, పాత కిటికీని OLX లో 4 వేలకి అమ్మేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో షాపు యజమానికి నికరంగా 4 వేల రూపాయల ఖర్చయినా ఆ కొత్త కిటికీ వల్ల తన షాపుకి కొత్త అందాలు వచ్చి ఎక్కువ కస్టమర్లు రావటం మొదలెట్టారు, దానివల్ల అతని ఆదాయం పెరిగింది. ఈ సన్నివేశంలో షాపు యజమాని, కిటికీల వ్యాపారి ఇద్దరికీ నికర ఆదాయం పెరిగింది. ఇదీ ఆర్థిక వ్యవస్థ పెరగాల్సిన పద్ధతి.
మళ్ళీ ప్రభుత్వ సంక్షేమపథకాల దగ్గరికి వద్దాం. ఒక అంచనా ప్రకారం ప్రభుత్వాలు ఖర్చుపెట్టే ప్రతి రూపాయి అక్కడి ఆర్థిక వ్యవస్థ నుండి 2-3 రూపాయలు పీల్చేస్తేనే ప్రభుత్వానికి సమకూరుతుంది. ఎలా అంటే, ప్రభుత్వం సమాజం నుంచి పన్నుల రూపేణా, అప్పుల రూపేణా 2 రూపాయలు లాగేసుకుని, ప్రభుత్వ యంత్రాంగం నడవటానికి కొంత ఖర్చుపెట్టు కుని మిగిలిన డబ్బంతా సంక్షేమ పధకాలద్వారా మళ్ళీ ప్రజలకి ప్రభుత్వానికి సహజంగా ఉండే inefficiency తో వెనక్కిచ్చినా మిగిలేది ఒక్క రూపాయే. ఆ అసలు రెండు రూపాయలు ప్రజల దగ్గరే ఉండనిస్తే వారు జాగ్రత్తగా దాన్ని మూడు రూపాయలు చేసేవారు. ప్రభుత్వం కూడా సరైన అభివృద్ధి పధకాలమీద ఖర్చు పెడితే ఇలాంటి మంచిఫలితాలే వస్తాయి
ప్రభుత్వానికీ ఈ విషయం తెలుసు, అందుకే ఆర్ధిక వ్యవస్థ పుంజుకోటానికి వేరే ఉపాయాలు లేనప్పుడు పన్నులు తగ్గిస్తారు, మొన్న GST రేట్లు తగ్గించినట్టు. అలా ప్రజల జేబుల్లో ప్రభుత్వం అదనంగా ఉండనిచ్చిన డబ్బు ఆర్థికవృద్దికి దోహదం చేస్తుంది (discretionary spending పెరగటం వల్ల). అంటే ప్రభుత్వం అస్సలు ఖర్చు పెట్ట కూడదా అంటే, లేదు పెట్టాలి. ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రభుత్వ యంత్రాంగమ్మీద ఖర్చు సాధ్యమైనంత తక్కువగా, capital expenditure (రోడ్లు, పోర్టులు, విద్య వైద్యం లాంటి Public goods మీద) సాధ్యమైనంత ఎక్కువగా, అలాగే సంపాదించే శక్తి లేని అభాగ్యులకిచ్చే పెన్షల్ల మీద ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటో మీకు తెలుసు. ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పధకాల మీద ఖర్చు పెట్టడమే కాక, అలా ఖర్చుపెడుతున్నామన్న సంగతి ప్రచారం చేసుకోటానికి కూడా ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రచారహోరుకి సామాన్య ప్రజలూ పత్రికల వారు కూడా గొంతు కలపనక్కర్లేదు. అక్కడ ఖర్చుపెడుతుంది మన డబ్బే.

చాలా మహత్తరంగా రాశారు. మీ విశ్లేషణ కు సలాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇది చదివి బుద్ది తెచ్చు కొంటాయని నాకు నమ్మకం కల్ల. ఇలా ఇబ్బడి ముబ్బడి గా ఉచితాలు ఇవ్వడం = ఓటర్లకు లంచాలు.
ప్రతి పార్టీ శ్రేణులు దీనిని ఒప్పు కొరు కానీ.. ఇలాంటి వ్యవస్థ దేశానికి అరిష్టం.
ధన్యవాదాలు, గౌస్ సాబ్