పూర్వం నైమిశారణ్యంలో వికృత భోజుడు అనే దానవుడు బ్రహ్మవరం పొందాలని ఘోరమైన తపస్సు చేశాడు. అతని ఘోర తపస్సుకి మెచ్చి ఒక నాడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై, “నాయనా, నీ తపస్సును మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు”. అందుకు ఆ దానవుడు, దేవా నేను భోజన ప్రియుడను. నీ వరం పొందాలని సవిరామ ఉపవాసం చేస్తూ, అనుక్షణం నిన్నే ధ్యానిస్తూ, నేటికి నీ సాక్షాత్కారం పొందాను. నేను కోరబోయే వరం ఏమిటంటే నేను భోజనం చేసిన ప్రతిసారి నా శక్తి హెచ్చింపబడాలి. వార్ధక్యమన్నది నా దారి చేరకూడదు, ఏ మానవుని చేత గాని, దానవుని చేత గాని, కిన్నెర, కింపురుషుల వల్ల గానీ, జలచరాలు, జంతువుల వల్ల గానీ నాకు మరణం సంభవించకూడదు, నాకు ముసలితనం వల్లనే మరణం రావాలి” అని వరం కోరుకున్నాడు.
అది విన్న బ్రహ్మ దేవుడు, “నాయనా, నీవు భోజన ప్రియుడనంటున్నావు, భోజనం చేసిన ప్రతి సారి నీ శక్తి హెచ్చింపబడాలి, వార్ధక్యమన్నది రాకూడదు అంటున్నావు. మరి నీకు మరణం ఎలా సంభవిస్తుంది ? ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు గిట్టవలసిందే. కానీ నీకు వరమివ్వకుండా వెనుతిరగలేను. నీ తపస్సుకు మెచ్చాను గనుక నీవు ఈ కాలంలో లోకులందరూ యథాప్రకారం తినే ఆహారం తిన్నన్ని రోజులు నీవు కోరినట్లే హెచ్చింపబడిన శక్తితో, యవ్వనంతో జీవించగలవు. ఏనాడైతే సృష్టిలో ఆమోదయోగ్యం కానీ ఆహారం తింటావో ఆ రోజు నీ శక్తి నశిస్తుంది. నీకు మరణం సంభవిస్తుంది” అని వరమొసంగి అంతర్థానమయ్యారు .
బ్రహ్మ వరం పొందిన ఆ దానవుడు ఆ అడవిలోని ఫలాలన్నిటినీ అమాంతం మింగాడు. బ్రహ్మ వరం వల్లన అతని శక్తి హెచ్చింపబడింది. అతడు మదించి ఆ రాజ్యంలోని పాకశాస్త్ర ప్రవీణులందరినీ తన బందీలుగా చేసుకుని మూడు పూటలా తనకు ఇష్టమైన వంటలు వండించుకుని పొట్ట చెక్కలయ్యేలా భోజనం చేయసాగాడు. దాని వల్ల అతని శక్తి అపారమయ్యింది. అతడు మరింత మదించి సమస్త భూలోకాన్ని ఆక్రమించి లోకులను నానా యాతనలు పెట్టసాగాడు. అతని ఆకలి తీర్చలేక లోకంలోని ప్రాణులందరూ తమ ఆకలిని చంపుకుని అతనికి భోజనం ఏర్పాటు చేయసాగారు.
తమ ప్రాణాలే నిలుపుకోలేని ప్రజలు దేవతలకు హవిస్సు సమర్పించలేకపోయారు. దేవతలు ఖిన్నులై వికృత భోజుడి మీద దండయాత్ర చేసారు. బ్రహ్మ వరప్రసాదం, తాను రోజూ తినే ప్రసాదం వలన అపరిమిత బల సంపన్నుడైన వికృత భోజుడు యుద్ధంలో దేవతలను ఓడించాడు. అప్పుడు దేవతలు భయకంపితులై శ్రీ హరి శరణుజొచ్చారు. అప్పుడు శ్రీ హరి ఒక ఉపాయమాలోచించి, నారద మహామునిని పిలిచి ఆయన చెవిలో ఒక ఉపాయాన్ని ఉపదేశించారు.
నారద మహాముని శ్రీ హరి ఆజ్ఞానుసారం వికృత భోజుని కలవడానికి వెళ్లారు. వికృత భోజుడు నారద మహామునికి ఎదురేగి ఆయనను సత్కరించి ఆయన రాకకు కారణమేమని అడిగాడు. నారద మహాముని ఇలా చెప్పారు. “వికృత భోజా నీ రాజ్యంలోని వంటల గూర్చి ముల్లోకాలలో వేనోళ్ల కొనియాడుతుంటే విని, ఆ గొప్పదనమేమో కన్నులారా చూడాలని, నిన్ను ఇంత శక్తివంతుడిని చేసే ఆ భోజనం రుచి చూడాలని. ఆ గొప్పదనమేమో నా అంతట నేనుగా తెలుసుకోవాలని ఇలా వచ్చాను “ అన్నారు. ఎంత మాట మహాముని, ఇప్పుడే మీ కోసం ప్రత్యేకంగా ఈ లోకంలోనే అత్యుత్తమ పాక శాస్త్ర ప్రవీణుల చేత మీకు భోజనం ఏర్పాటు చేయిస్తాను. ఎవరక్కడ” అని తన సేవకులను ఆజ్ఞాపించాడు. కొద్ది సేపట్లోనే పంచ భక్ష్య పరమాణ్ణాలు సిద్ధమయ్యాయి. లోకంలో లభించే ప్రతి కంద మూలము, ఫలము అన్నీ ప్రత్యక్షమైనాయి. ఆరగించండి మహాముని అని తన ఆతిథ్యాన్ని గర్వంగా సమర్పించాడు వికృత భోజుడు.
ఆహారం రుచి చూసిన నారద మహా ముని అన్ని ఒక సారి నాలుకకు తాకించి అయిష్టంగా పాత్రలోనే విడిచిపెట్టారు. “ఆహారము రుచించ లేదా మునివర్యా అని ఆశ్చర్యపోతూ అడిగాడు”. నారద మహాముని మొహం చిట్లిస్తూ “అయ్యో వికృత భోజా ఇంత భోజన ప్రియుడివి, ఇదా నీవు తినే ఆహారం అని దెప్పి పొడిచారు”. అందుకు వికృత భోజుడు “ఇంత కన్నా రుచికరమైన ఆహారమా !!, అసాధ్యము. ఇంత కన్నా రుచికరంగా ఎవరైనా వండితే నా వంట వారికందరికీ శిరచ్చేదమే శిక్ష” అని కోపంతో ఊగిపోయాడు. అందుకు నారద మహాముని, “ఆవేశ పడకు వికృత భోజ, ఇందులో నీ వంటవారి తప్పు ఏమీ లేదు. బ్రహ్మ దేవుని వరం చేత నేను భవిష్యత్తులోకి కాల ప్రయాణం చేశాను గనుక అక్కడి వంటల ముందు ఇవి తేలిపోయి ఉండవచ్చు” అన్నారు. “ఆ… అంత రుచిగా ఉంటాయా”, అని ఆశ్చర్యపోయాడు వికృత భోజుడు. “మరేమనుకున్నావ్? గులాబీ పూలతో బజ్జీలు, పుచ్చ కాయ ముక్కల్తో పకోడీలు, ఐసు క్రీముతో చేసిన వడియాలు” అని ఏఆర్, వీఆర్లో ఒక డజను ఇన్స్టాగ్రామ్ ఫుడ్ బ్లాగర్ రీల్సు చూపారు.
అది చూసి నోరూరిన వికృత భోజుడు వెంటనే తన వంట వారిని పిలిచి తనకు కూడా బంగాళ భౌ, భౌ. అరటి పండు లంబ లంబా, చాక్లెట్ మాగి, జండూ బామ్ దోస చేసి పెట్టమని ఆదేశించాడు. ఏమీ అర్థం కానీ అతని వంట వారు, ఆ భవిష్యవాణిలోని దృశ్యాలను పదే పదే చూస్తూ పని కానిచ్చారు. వికృత భోజుడు ఆ మల్టీకలర్ మెనూ చూస్తూ వికటానందంతో లొట్టలేస్తూ చేసిన పదార్థాలన్నీ స్వాహా చేశాడు. అతనికి కొద్ది సేపట్లోనే ఉదరంలో అదరడము మొదలైనది. బాధతో మెలికలు తిరుగుతూ నేలకూలి తనను రక్షించమని నారద ముని పాదాల శరణుజొచ్చాడు. నారద ముని అతనికేసి తిరిగి, “నాయనా వికృత, నీవు నీకు బ్రహ్మ దేవులు ఇచ్చిన వర నియమాలు ఉల్లంఘించినందువల్ల నీ శక్తి క్షీణించింది. గులాబీ పూలతో వండిన బజ్జీలు, పుచ్చకాయ ముక్కల్తో చేసిన పకోడీలు, ఐసు క్రీము వడియాలు, బంగాళ భౌ, భౌ. అరటి పండు లంబ లంబా, చాక్లెట్ మాగి, జండూ బామ్ దోస వంటి వికృతాహారము తినడం వల్ల నీవు ఇప్పుడు ఈ తనువు చాలించి నరకలోక వాసము చేయబోతున్నావు”. అని అతనికి బ్రహ్మ దేవుడు విధించిన నియమాలను గుర్తు చేసి అంతర్ధానమయ్యారు. వికృత భోజుడి నిష్క్రమణతో ముల్లోకాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆనాటి నుండి అందరూ పద్ధతిగా పప్పు, ఆవకాయ, పూరీ కూర తింటూ ఆమోదయోగ్యం కానీ ఆహారం అవాయిడ్ చేస్తూ ఆనందంగా జీవించారు.
కథ కంచికి, మనం ఇంటి భోజనానికి.
శుభం.
