వారం రోజులు వారణాసిలో ఉండాలి అని శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి దంపతులు లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్లో రాత్రి తొమ్మిది గంటలకు దిగారు. ఎప్పుడో ఉదయం ఎనిమిది గంటలకు అమలాపురంలో తమ ఇంటి నుండి బయలుదేరి రాజముండ్రికి బస్సులో వచ్చి, అక్కడనుండి ఆటోలో ఎయిర్పోర్ట్ చేరుకొని కనెక్టింగ్ ఫ్లైట్స్లో వారణాసి చేరేసరికి ఇంత సమయమైంది. సత్రాలు ఏవి దొరకలేదు, వాటికోసం వారికీ అంతగా తెలియకపోడం వల్ల వారి పెద్దబ్బాయి ఏదో లాడ్జిలో బుక్ చేసాడు దాని లొకేషన్ చూసుకొని దిగుతూనే ఆటో బుక్ చేసాడు శ్రీనివాసరావు.

మొదటిసారి వారణాసి రావడం వల్లనేమో కొంచం గుబులుగా ఉంది ఇద్దరికీ. చుట్టుపక్కలవాళ్ళు తెలిసిన వారు చెప్పిన విషయాలు ఓ నోటుబుక్లో రాసుకొని అవి పాటించాలి అనుకున్నారు. పిల్లల్ని తోడు రమ్మంటే వారికి కుదరదు అని చెప్పేసారు.

“ఏమండీ, ఆటో కన్నా క్యాబ్ మంచిదేమో” అంది భాగ్యలక్ష్మి.

“కాశీ అంతా, చిన్న చిన్న సందులట కదా, మన కాంతంగారు చెప్పారు. మళ్ళీ సందుల్లో క్యాబ్లు వెళ్తాయో లేదో అని ఆటో బుక్ చేశా”

“సరేలెండి ఏదో ఒకటి, ఆకలేస్తుంది. ఫ్లైట్లో వాడు పెట్టిన గడ్డి తినాలి అంటేనే ఏదోలా అనిపించింది, అందులోను అంత పైన ఆకాశంలో తినాలి అంటే భయమేసింది నాకు. మీరు మాత్రం హాయిగా అన్నీ కానిచ్చేశారు”

ఇంతలో బుక్ చేసిన ఆటో రావడంతో సామాన్లు లోపల పెట్టి, ఎక్కి కూర్చున్నారు. ఆటోవాడు “ఎక్కడికి” అడిగాడు ఓటీపీ తీసుకున్న తరువాత.

“వాడు ఎక్కడికి అని అడుగుతున్నాడు చెప్పండి” అంది ఆవిడ. శ్రీనివాసరావు కన్నా భాగ్యలక్ష్మికే హిందీ కొంచం బాగా వచ్చు. ఆవిడా నాన్నగారు రైల్వేస్లో పనిచేసేవారు, ట్రాన్స్ఫర్లు కారణంగా కొన్నాలు బిలాస్పూర్లో ఉన్నారు.

“మ్యాప్లో వస్తాది కదా చూడమను వాడిని” అంటూ మొబైల్ లో చూసి “గిరిజా ఘర్ దగ్గర” అన్నాడు.

మొత్తానికి ఆటోవాడు బయలుదేరాడు. మార్చ్ నెల కావడం వల్ల కొంచం చల్లగానే ఉంది వారణాసి. గంట తరువాత గిరిజా ఘర్ దగ్గరకి చేరుకున్నారు, అక్కడినుండి ఆ లాడ్జి వాడికి ఫోన్ చేస్తే వాడు ఆటోవాడు మాట్లాడుకొని ఓ రెండు మూడు సందుల తరువాత దింపేసాడు ఆటో అతను. అక్కడే చిన్న కాలినడకంత సందులో ఓ కుర్రాడు నించొని ఉన్నాడు వీరిని లాడ్జి వరకు తీసుకెళ్లడానికి. అతను ఇంకో రెండు మూడు సందులు తిప్పి ఓ ఇంటి ముందు ఆగి “ఇదే మన గెస్ట్ హౌస్” అన్నాడు హిందీలో “చూస్తే ఓ ఇల్లులా ఉంది ఇరుక్కగ్గా, ఇది గెస్ట్ హౌస్ ఏమిటి” అన్నాది అనుమానంగా భాగ్యలక్ష్మి. “ఏమో మానేకేం తెలుసు, పద చూద్దాం” అంటూ శ్రీనివాసరావు లోపలి అడుగు పెట్టాడు.

లోపల ఒక లిఫ్టు మూడు అంతస్తులు ఒక అంతస్తుకి మూడు గదులు కొంచం బాగానే అనిపించింది. అందులో ఒక గది తాళం వారికి ఇచ్చి గాడి చూపించాడు ఆ కుర్రాడు.

“బాబు తినడానికి ఏమైనా దొరుకుతాయా ఇక్కడ” అడిగింది భాగ్యలక్ష్మి.

“ఇక్కడ ఏమి దొరకవు కానీ ఇంకో అరగంట లోపల మెయిన్ రోడ్ వైపు వెళ్తే దొరుకుతాయి. మీరు ఫ్రెష్ అవుతుండండి నేను, సార్ వెళ్లి ఏదో ఒకటి తీసుకుని వస్తాము. మళ్ళీ ఒక్కరే వెళ్తే మొదటిసారి కదా దారి మర్చిపోవచ్చు” అన్నాడు కుర్రాడు.

ఓ అరగంట తరువాత శ్రీనివాసరావు రూమ్ తలుపు తట్టాడు. ఆవిడా తలుపు తీస్తే లోపలికి నీరసంగా వస్తూ చేతిలో సంచి ఆవిడా చేతిలో పెట్టాడు.

“అదేంటి ఆపిల్స్, అరటిపళ్ళు తెచ్చారు. ఇడ్లి దోస లాంటివి ఏమి లేవా” అంటూ అడిగింది

“ఇవే దొరికాయి, ఇంక ఏమీ లేవు. ఈ రాత్రికి పలహారమే” అన్నాడు.

“సరే స్నానం చేసి రండి, తిని పడుకుందాం, ఉదయాన్నే గుళ్ళు, దర్శనాలు చాలా ఉంది”

యూట్యూబ్లో చూసి, వెళ్ళినవారు చెప్పినవి ఒక లిస్ట్ వ్రాసుకున్నాడు శ్రీనివాసరావు. ఆ పద్దతి ప్రకారం ఇద్దరు కాశీపట్నం తిరగగాలి అనుకున్నారు.

ఉదయాన్నే మూడింటికి లేచి స్నానాలు కానిచ్చి నెమ్మదిగా సందులు దాటుతూ మెయిన్ రోడ్ మీదకు వచ్చేసరికి నాలుగున్నర, ఒక రిక్షా కనిపిస్తే కాలభైరవుడు గుడికి బేరమాడి ఎక్కి కూర్చున్నారు. కాల భైరవుడి గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఒక టీ దుకాణం దగ్గర బల్లమీద కూర్చొని టీ ఇమ్మన్నారు. ఆ టీ దుకాణమతను మట్టి గ్లాసుల్లో టీ ఇచ్చేసరికి భలే వింతగా అనిపించింది ఇద్దరికీ.

“ఏమిటి ఇక్కడ ఇంకా మట్టివి వాడతారా” అన్నాడు ఆశ్చర్యంగా. “భాగ్యం, మళ్ళీ కడిగి వేరే వాళ్లకు ఇవ్వరుగా” అంటూ సందేహంగా భార్యను అడిగాడు

“లేదు లెండి, పక్కన చెత్త బుట్ట చూడండి అన్నీ తాగి పడేసిన గ్లాసులే” అంది ఆవిడ నవ్వుతూ.

అక్కడనుండి నడుచుకుంటూ ఎదురు వీధిలో ఉన్న మహా మృత్యుంజయ ఆలయానికి వెళ్లారు, శివలింగానికి మనసారా నీళ్లు అర్చన చేసి అక్కడే ఉన్న ధనవంతరి కూపం నుండి నీళ్లు తాగి బయట పడ్డారు. మెయిన్ రోడ్ చేరి ఇంకో రిక్షా మాట్లాడుకొని దశాశ్వమేధ ఘాట్ రోడ్ వరకు వచ్చారు. నెమ్మదిగా తెల్లవారుతుంది ఆ చిన్న వెల్తురులో ఒక్కర్ని అడుగుతూ వారాహి అమ్మవారి దేవాలయం చేరుకున్నారు. దేవాలయం ఉదయం ఎనిమిదో గంటకి మూసేస్తారు అన్నారు ఎవరో, అక్కడ చూస్తే చాలా పెద్ద లైన్ కనిపించింది. దర్శనం అవుతుందో లేదో అన్న అనుమాం వచ్చింది ఇద్దరికీ, సరేలే చూద్దాం అవుతే ఈరోజు లేకపోతె రేపు అనుకున్నారు ఇద్దరు. చాలామంది తెలుగువారు కనిపించారు, కొంతమంది ఒంటరిగా వచ్చిన వారు, కొందరు గ్రూప్స్గా వచ్చిన వారు.

వారాహిదేవిని దర్శనం చేసుకొని బయటకి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది. నెమ్మదిగా విశ్వనాధ గల్లీ వెతుకుంటూ వచ్చి సాక్షి గణపతి ముందు నించున్నారు. చిన్న గుడైనా నారింజ రంగులో ఉన్న స్వామికి తమ పేర్లు చెప్పుకున్నారు.

“ఆకలేస్తుందండి” అన్నాది ఆవిడ

“పక్కన ఎవరినైనా అడుగుదాం ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో” అన్నాడు. ఎవరో తెలుగువారు కనిపిస్తే వారిని అడిగారు “పైకి విశాలక్షమ్మ గుడి వైపు వెళ్తుంటే దారిలో ఉంటుంది” అని చెప్పారు. సరే అని మెట్లు ఎక్కి మళ్ళి సందులు వెంబడి నడుస్తూ వెళ్తుంటే గోడకు అనుకోని రెండు చిన్న చిన్న బడ్డీలు కనిపించాయి. ఒకరు పూరీలు ఇంకొకరు ఇడ్లిలు అమ్ముతున్నారు. ఇడ్లిలు కనిపించిన ఆనందంలో ఓ రెండు ప్లేట్లు చెప్పారు. అవి నోట్లో పెట్టుకొనేసరికి గట్టిగ్గా చప్పగా రబ్బరు ముక్కలా అనిపించాయి. రెండు తినేసరికి వారి ఆకలి చచ్చిపోయింది. ఏదో తిన్నామని వాడికి డబ్బులు ఇచ్చి విశాలక్షమ్మవారి దగ్గరకు బయలుదేరారు.

అక్కడ అమ్మవారి విగ్రహాన్ని వెనుకనే ఉన్న మూల విగ్రహాన్ని దర్శించుకొని మల్లి విశ్వనాధ గల్లీ చేరుకొని పక్కన ఉన్న దుండి గణపతిని దర్శించుకొని ముందుకు వెళ్ళగానే కుడి చేతిపక్క అన్నపూర్ణమ్మ గుడి ఎడమ చేతి వాపు విశ్వనాధుడి గుడి గేట్ నెంబర్ 1 ఉన్నాయ్.

ముందు అమ్మని చూద్దామని కుడిపక్కకు తిరిగి చెప్పులు బయట పెట్టి లోపైలికి వెళ్లి అమ్మవారిని, ప్రాకారం లోపల ఉన్న మరికొంతమంది దేవుళ్లను దర్శించి బయటకు వచ్చేసరికి పదవుతుంది. ఇంకా అయ్యవారిని దర్శించుకోడానికి గేట్ నో 1 నుండి లోపలి వెళ్లి సెక్యూరిటీ అన్ని చూసుకొని లోపలి వెళ్లి శివలింగాన్ని దర్శించి, పక్కకు వచ్చి కూర్చున్నారు.

“గుడి ఏమిటండి ఇంత చిన్నగా ఉంది” అనుమానం వ్యక్తం చేసింది భాగ్యలక్ష్మి.

“ఏమోనే నాకేమి తెలుసు, ఈ ప్రాకారం కూడా ఈ మధ్యనే కొత్తగా చేశారట, లేకపోతె ఇంకా ఎలా ఉండేదో. అన్నట్టు పన్నెండు గంటలకు మణికర్ణికా ఘాట్ దగ్గర స్నానానికి వెళ్లగలమా” అన్నాడు అయన.

“వెళ్లి చూద్దాం, లేకపోతె రేపో, ఎల్లుండో చేద్దాం”

“ఇక్కడ శివలింగాన్ని ముట్టుకొనిస్తారట, స్పర్శ దర్శనం అంటారు అని మన ప్రకాశం చెప్పాడు. ఎన్నింటికో కనుక్కో కొంచం” అంటూ పక్కకి తిరిగి చూస్తే ఇంకో తెలుగతను కనిపించాడు, ఆయన్నే ఆ విషయం అడిగాడు. “ఉదయం నాలుగు గంటలకి, మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి ఉందండి. మాది ఉదయాన్నే అయిపోయింది ఈ రోజు” అన్నాడతను. ఇంకా మిగతా విషయాలు మాట్లాడి మణికర్ణికా ఘాట్కి బయలుదేరారు.

నాలుగో గేట్ నుండి బయటకు వచ్చి కొంచం దూరం నడిచాకా కుడి చేతివైపు ఘాటుకి దారి కనిపించింది. కొంచం ముందుకు వెళ్ళగానే కుడి వైపు బ్లూ మూన్ లస్సి అని ఒక చిన్న దుకాణం కనిపించింది.

“కాశీలో ఇక్కడ లస్సి బావుంటుందట, మా వనజ చెప్పింది” అన్నాది భాగ్యలక్ష్మి.

“సరే పద తాగుదాం, అసలే ఉదయం నుండి సరిగ్గా తిన్నదేమి లేదు” అంటూ ఆ దుకాణం మెట్లెక్కి లోపలి వెళ్లి కూర్చున్నారు. ఇద్దరికీ చెరో డ్రై ఫ్రూట్ లస్సి చెప్పిందావిడ. ఇద్దరి లస్సిలు చెరో మట్టి గ్లాస్లో పెట్టి ఓ ఐస్క్రీమ్ స్ప్పోన్ చేతిలో పెట్టాడు.

“ఇంత లస్సి ఇచ్చాడు , ఎంత ధర ఉంటాదో” అన్నాడు శ్రీనివాసరావు

“తీపి బాగా ఎక్కువైంది కదా” అంది ఆవిడ.

లస్సి తాగి నెమ్మదిగా సందులు అన్ని నడుచుకుంటూ మణికర్ణికా ఘాట్లో స్నానాలు చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ అన్నపూర్ణమ్మ దగ్గర భోజనాలు చేసి, లాడ్జి వెతుకుంటూ వచ్చేసరికి మధ్యాహ్నం రెండున్నరైంది. ఒక రోజులో పాపం పన్నెండు పదమూడు కిలోమీటర్లు నడిచేసరికి ఇద్దరికి అలసట వచ్చి పడుకున్నారు. ఆవిడ లేచేసరికి సాయంత్రం ఐదున్నర. ఆయన్ను నిద్ర లేపుతూ “లేచి తయారవ్వండి గంగా హారతికి టైమవుతుంది” అంటూ తొందర పెట్టింది.

దశాశ్వమేధ ఘాట్ దగ్గర గంగా హారతి చూసుకొని పైకి వచ్చేసరికి రాత్రి తమ్మిడి కావస్తుంది

“ఏడుగురు హారతి ఇస్తుంటే కళ్ళు సరిపోలేదు కదండీ” అంటూ చుట్టుపక్కల చూస్తూ “ఏమైనా తిందామా” అంది

“దారిలో అన్ని కచోడీలు, పానిపూరి వాళ్ళే కనిపించారే భాగ్యం, అవి ఏమి తింటాం” అన్నాడు

“అబ్బా! ఏదో ఒకటి పదండి తిందాం” అంటూ పానిపూరి వైపు వెళ్ళి “ఎలా” అంటూ అడిగింది

“పది రూపాయలకు ఆరు పూరీలు” అన్నాడు, ఆశ్చర్యంగా శ్రీనివాసరావు వైపు చూస్తూ “ఇది విన్నారా, పది రూపాయలకు ఆరు పూరీలట, మన ఊరిలో ఇరువై రూపాయలకు నాలుగిస్తాడు” అని ఒక రెండు ప్లేట్లు తిన్నాక “చాలులెండి” అంటూ డబ్బులు ఇచ్చి రూమ్ వైపు నడక మొదలు పెట్టారు. శ్రీనివాసరావు బుద్దిగా ఓ నాలుగు అరటిపళ్ళు తిని పడుకున్నాడు.

ఉదయాన్నే మూడున్నర కాళ్ళ లేచి స్నానపానాలు కానిచ్చి స్పర్శ దర్శనం కోసం క్యూ లో నించున్నారు. చాలా మంది ఉన్నారు ఎంతకీ ముందుకు కదలదు, ఇంతలో భాగ్యలక్ష్మి “ఏమండీ నా కడుపు గుడుగుడు లాడుతుంది, వాష్రూంకి వెళ్లాలేమో” అన్నాది. “ఈ గుడి ప్రాకారం లోనే టాయిలెట్స్ ఉన్నాయ్, నిన్న చూసాను” అంటూ అటు ఇటు చూసి టాయిలెట్స్ కి దారి వెతికాడు శ్రీనివాసరావు. మొత్తానికి ఆవిడ కానిచ్చి బయటకు వచ్చిన తరువాత “ఇంక ఇలా స్నానం లేకుండా స్పర్శ దర్శనం ఏం చేస్తాం లెండి, పదండి రూంకి వెళదాం. ఆ మల్లికార్జునుడికి అంటే ధూళి దర్శనం ఉంది, విశ్వనాధుడుకి ఉందొ లేదో మనకు తెలియదు కదా” అంటూ రూమ్ వైపు నడక మొదలు పెట్టారు.

ఆ ఉదయం ఆవిడ కడుపు గుడగుడలు ఇంకో మూడు సార్లు ఆడింది దాంతో శ్రీనివాసరావు సరదాగా వచ్చి “పానీపూరి చవగ్గా వచ్చింది కదా అని రెండు ప్లేట్లు తిన్నావు మరీ. ఇంక రెండు రోజులు పెరుగన్నమే తినాలి” అన్నాడు ఇంటినుండి వస్తూ ఊళ్ళో డాక్టర్ని అడిగి తెచ్చుకున్న మాత్ర ఒకటి వేసుకొని ఓ గంట పడుకున్నాక ఆవిడ కడుపు సర్దుకుంది. తొమ్మిది ఆ ప్రాంతంలో ఇంక విశ్వనాథుడు కాదు కానీ ఊరు తిరిగి చూద్దామని అనుకున్నారు. వాళ్ళు వ్రాసుకున్న లిస్టులో మిగతావి ఈరోజు కానిద్దామని బయటకు వచ్చి ఓ ఆటో మాట్లాడుకున్నారు ఆ రోజంతా తిప్పి మళ్ళి వెనక్కి రూంకి తీసుకు రావడానికి.

మొదట దుర్గాకుండ్ వెళ్లి దుర్గాదేవిని కాళికాదేవిని దర్శించుకొని పక్కనే ఉన్న తులసీదాస్ మందిరానికి వెళ్లారు. బయటకు వస్తూ ఏమైనా తిందామని చుట్టుపక్కల చూసారు, ఎదురుగా ఓ ఆంజనేయ స్వామి గుళ్లో ఏం.ఎస్. సుబ్బలక్ష్మి గారి గొంతులో విష్ణుసహస్రనామం వినిపిస్తోంది. పక్కకు చూస్తే ఓ హోటల్ కనిపించింది. అక్కడికి వెళ్లి చూస్తే పూరి వేడి వేడిగా వేస్తున్నాడు. “ఇక్కడ ఇడ్లి దొరుకుతుందా” అని అడిగింది భాగ్యలక్ష్మి. “ఇడ్లిలు కష్టమండి, పూరి, ఆలు పరోటా తప్ప ఇంకేమి దొరకవండి” అన్నాడు హోటల్ వాడు, ఇంకో గత్యంత్రం లేక పూరి తీసుకొని తిన్నాక మళ్ళి ప్రయాణం మొదలైంది. తరువాత దగ్గరలోనే సంకట మోచన హనుమాన్ని చూసుకొని, బనారస్ హిందూ యూనివర్సిటీ చూసుకొని గంగానది దాటి రాంనగర్ కోటకి వెళ్లేవరకు మధ్యానమైంది. కోటకు భోజన విరామం. సరే భోజనం ఏదైనా హోటల్లో చేద్దామని చూసారు, ఎక్కడ చూసినా పరోటా, పూరి, కచోడి ఇంకా రోటి, అన్నం, మజ్జిక ఎక్కడా లేవు. ఇంక చేసేది ఏమిలేక బుద్దిగా రోటి కూర తీసుకుని కానిచ్చేశారు.

కోటలో చాలా విషయాలు చూసిన తరువాత ఆఖర్న వ్యాసమహర్షి స్థాపించిన శివలింగాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణం రూంకి బయలుదేరారు. ఇంక ఎక్కడికి వెళ్లే ఓపిక లేక ఆపిల్స్ అరటిపళ్ళు తెచ్చి తిని పడుకున్నారు.

మరుచటిరోజు ఉదయం కొంచం నెమ్మదిగా లేచి ప్రయాగరాజ్ వెళదామని నిశ్చయించుకున్నారు. కాలకృత్యాలు కానిచ్చి నెమ్మదిగా ఆటోలో బస్సు స్టాండ్ వరకు చేరి , బస్సు ఎక్కి ప్రయాగరాజ్లో దిగారు. అక్కడ కూడా ఒక ఆటో మాట్లాడుకున్నారు. ప్రయాగలో త్రివేణి సంగమం దగ్గర స్నానం, బడే హనుమాన్ , అలోపీ దేవి (శక్తీ పీఠం), భరద్వాజ ఆశ్రమం చూసారు. ఎక్కడా అన్నం కానీ మజ్జిక కానీ దొరక లేదు, దారి లేక రోటీలు కూర తిని పూట గడిపేశారు. మళ్ళీ బస్సు పట్టుకొని వారణాసి వచ్చేవరకు సాయంత్రం ఏడున్నర అయింది. రాత్రికి మళ్ళీ అరటిపళ్ళు ఆపిల్స్తోనే కడుపు నింపుకున్నారు.

“స్పర్శ దర్శనం ఇంకా కాలేదండి”  ఆరోజు రాత్రి భాగ్యలక్ష్మిఅన్నాది కొంచం బాధగా.

“ఇంకా రెండు రోజులు ఉంది కదా, అవుతుందిలే ఆ విశ్వనాధుడి దయతో, నువ్వు దిగులు పడకు” అన్నాడు అరటిపండు తింటూ శ్రీనివాసరావు.

ఇంకో రెండు రోజులు అన్నపూర్ణమ్మని, విశ్వనాధుడి స్పర్శ దర్శనం చేసేసరికి సాయంత్రం అయ్యేది. నెమ్మదిగా ఘాట్స్ అన్నీ బోటులో తిరిగి, గంగా హారతి చూసుకొని, రాత్రికి మళ్ళీ అరటిపళ్ళు ఆపిల్స్ కొనుక్కొని రూంకి వెళ్లి పడుకునేవారు.

మూడో రోజు సామాన్లు సర్దుకొని రైల్వే స్టేషన్ చేరి ట్రైన్ ఎక్కి విజయవాడ కు చేరుకొనిన తరువాత ఇంటికి వచ్చేసరికి దంపతులిద్దరికీ రెండు రోజులు పట్టింది.

ఇంటికి వచ్చిన తరువాత ప్రయాణ బడలిక తీరడానికి ఓ రెండురోజులు పట్టింది వాళ్లకి. ఆ రోజు సాయంత్రం పక్కింటి ఆవిడ వస్తే కూర్చొని కాశీలో విషయాలన్నీ చెబుతూ “అన్నపూర్ణమ్మ కొంచం పెరుగన్నం ఆవకాయ్ ముక్క మన ఆంధ్ర వారికే కాకుండా ఆ ఉత్తర్ ప్రదేశ్ వాళ్లకి కూడా ఇచ్చుంటే ఈ తీర్థ యాత్ర ఇంకా బాగుండేది” అన్నాది భాగ్యలక్ష్మి.

2 Comments Leave a Reply

  1. మొదటిసారి కాశీ యాత్రకు వెళ్ళే వారికి ఎక్కడెక్కడ ఏమేమి చూడాలో బోలెడు ,అర్ధం అయ్యేలా చెప్పేశారుగా.

    నిజమేనండోయ్,పెరుగన్నం ఆవకాయ ఆ యూపీ వాళ్ళకి, వాళ్ళతో పాటు తూర్పు వేపు మేఘాలయ ,అస్సాం మిగతా వాళ్ళకు కూడా ఇచ్చుంటే కాళ్ళకి చక్రాలు కట్టుకు తిరిగే వారికి బోలెడు సౌఖ్యంగా ఉండేది.

    • ఛాన్స్ ఇస్తే ప్రపంచం అంతా అనేటట్టు ఉన్నారు 😀
      నాలుగు పర్యాలు వెళ్లిన అనుభవం

Leave a Reply to Kalyani G Cancel reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

COMPLIMENT

1977 ఏప్రిల్ 25. బ్యాంక్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి మద్రాస్ బీచ్

NAGPUR UNIVERSITY-2

The university Dept Clerk advised my marks percentage as 52