రేవతి చివరిసారిగా రాజేష్‌ని చూసి దాదాపు పదిహేనేళ్లు అయ్యింది.
HCU. హైదరాబాద్
రేవతి రాజేష్ లు ఒక ఫ్రెషర్స్ ఈవెంట్ లో మొదటి సారి కలిశారు .
చూపులు మాటలు కలిసాయి. రేవతి MA లిటరేచర్ , రాజేష్ M.Tech .
రాజేష్ ది ప్రశాంతమైన స్వభావం , రేవతిది గలా గలా మాట్లాడే స్వభావం – రెండు విభిన్న ధ్రువాలు. అంటారు గా విభిన్న ధ్రువాలు ఆకర్షించ బడతాయని.అదే జరిగింది
లిటరరీ ఈవెంట్ల లో , లైబ్రరీ , కాంటీన్ లతో మొదలైన పరిచయం నెమ్మదిగా మొదలై, అనతి కాలం లోనే చాలా గాఢమైన ప్రేమ కు దారి తీసింది.. గంటల తరబడి ఫోన్ల సాక్షిగా ఎన్నో బాసలు,కలలతో యూనివర్సిటీ రోజులు గడిచిపోయాయి.
కానీ ప్రేమ వేరు, జీవితం వేరని తొందర్లోనే అవగతం అయింది,
రాజేష్ కుటుంబం వారు స్థితి పరులు. అంతస్థులు, పాత సంప్రదాయాల కు ప్రాణం పెట్టే కుటుంబ నేపధ్యం.
రేవతిది దిగువ మధ్యతరగతి కుటుంబం.రాజేష్ తల్లిదండ్రులు రేవతి తాహతు సరిపోదని నిర్ధారించగా, కుటుంబాన్ని ఎదిరించలేక రాజేష్ మిన్నకుండి పోయాడు,
రేవతిని కలిసి,తన నిస్సహాయత ను చెప్పాడు రాజేష్.ఇద్దరూ కన్నీరు మున్నీరయ్యారు.
ఇద్దరి దారులు వేరయ్యాయి.
—-
ఇప్పుడు రేవతి కి 38 ఏళ్ళు. ప్రసిద్ధ రచయిత్రి. ముంబైలో నివాసం.
కాలం ఆ పాత గాయాన్ని పూర్తిగా మాన్పలేక పోయింది.
బుక్ లాంచ్ లు, రీడింగ్ సెషన్స్ కోసం తను దేశం అంతా తిరుగుతుంటుంది .
ఈ జీవితానికి ఆమె అలవాటు పడిపోయింది. కానీ ఎక్కడో వెలితి.
ఆమె ఒక సారి వివాహ బంధం లోకి వెళ్లి, కుదరక బయటకు వచ్చేసింది. పిల్లలు లేరు.
బెంగళూరులో జరిగిన ఓ బుక్ లాంచ్ లో పాల్గొనటానికి వచ్చింది రేవతి.
ఒక చిన్న ఆర్ట్ గ్యాలరీ వాళ్ళ కేఫ్ లో జరిగింది రీడింగ్ సెషన్.. దాని తర్వాత, పుస్తక ప్రియులతో ఆమె కలిసి మెలిసి మాట్లాడుతున్నప్పుడు ,ఎవరో ఆమె భుజాన్ని సున్నితంగా తట్టారు.
“మీ ప్రేమ కథల్లో బాధ ప్రస్ఫుటం గా కనబడుతుంది”
రేవతి వెనక్కి తిరిగి చూసింది. ఆ మాటలన్న ఆవిడ కు బహుశా 35 ఏళ్ళ వయస్సు ఉంటాయి. చక్కటి కళ్ళు, హుందాతనం ఉట్టిపడే చీర, మోముపై చిరునవ్వు.. ఆమె తనను తాను కుసుమ అని పరిచయం చేసుకుంది.
“నేను మీరు రాసిన నాలుగు పుస్తకాలూ చదివాను. అవి నా కెంతో ఇష్టం . చాలా చిక్కటి ప్రేమ కథలు . నాకైతే వ్యక్తిగత అనుభవాలతో రాసారని అనుకొంటున్నా, నిజమా? “” కుసుమ అడిగింది
రేవతి , ” అవునండి. కొన్ని పుస్తకాలు మన వెన్నంటే ఉంటాయి. వ్యక్తులు మనతో ప్రయాణించలేనప్పుడు, పుస్తకాలే గదా తోడు !” అని నవ్వింది.
కేఫ్ లో టీ తోసి బాటు మాటలు, కబుర్లు.కుసుమ మంచి మాటకారి, లోక జ్ఞానం మెండు. తక్కువ సమయం లోనే బాగా దగ్గరయ్యారు. ఓ అరగంట గడిచింది. కేఫ్ లో జనం పలుచబడ్డారు.
ఇంతలో కుసుమ రేవతి తో : ” మీరు ఇంతకుముందు ప్రేమలో పడ్డారా? మీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్ లో కనబడే బాధ మీ స్వానుభవమా?”
రేవతి తడబడింది. సాధారణంగా, ఆమె ఈ ప్రశ్నలను దాటవేస్తుంది.. కానీ కుసుమ సౌమ్యం గా అడిగిన విధానం నచ్చింది.
“అవును, కుసుమా … అతని పేరు రాజేష్.”
కుసుమ కనుబొమ్మలు కొంచెం పైకి లేచాయి, కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు.
రేవతి :” మేము UNIV లో కలిశాము. నేను కలలు కనేదాన్ని అతను నిశ్శబ్దంగా, స్థిరంగా ఉండేవాడు. మేము సరిగ్గా , మ్యాచ్ కానీ పజిల్స్లాంటి వాళ్ళం . నేను అతని మౌనాన్ని ఆస్వాదించినట్లే, తాను నా నవ్వులను దోసిళ్ళతో ఏరుకొనేవాడు. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం.కొన్ని కారణాల వల్ల కుదరలేదు.”
“కుటుంబమా?” అని అడిగింది కుసుమ్.
రేవతి తల ఊపింది. “అతని కుటుంబం ఆమోదించలేదు. వాళ్ళను ఎదిరించే ధైర్యం తనకు లేకపోయింది.నేను దాన్ని అప్పుడు ,ఇప్పుడు ఎప్పుడూ తప్పు పట్టలేదు. భవిష్యత్తు లో కూడా తప్పు పట్ట లేను..నేను అతనిని ప్రేమించడం మరిచిపోతానని అనుకున్నాను. కానీ నేను ఇప్పటికీ అతనిని ప్రేమిస్తున్నా. ఆ భావన తో ఎలా జీవించాలో కూడా నేర్చుకున్నాను. మానిపోని గాయం లా అది నా వెంటే ఉంది”
కుసుమ నిశ్శబ్దంగా టీ సిప్ చేస్తూ వింటూన్నది.
కొన్ని క్షణాల మౌనం తర్వాత కుసుమ మృదువుగా “అతన్ని మళ్ళీ ఎప్పుడైనా చూశారా ?” అని అడిగింది. “లేదు” అంది రేవతి. ” బహుశా అదే మంచిదేమో .మా ఇద్దరి దారులు వేరయ్యాయి . కొన్ని జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉండి పోవాలి. అంతే. ” ఆ తర్వాత కొన్ని పిచ్చాపాటి కబుర్ల తర్వాత టైం అయిపోయిందని గ్రహించి వెళ్ళేముందు రేవతిని గట్టిగా కౌగిలించుకుంది కుసుమ . “నేను మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందం గా ఉంది ,” ఆమె చెప్పింది.
“నాకూనూ ” నవ్వుతూ సమాధానం చెప్పింది రేవతి.
కుసుమ రాజేష్ భార్య అని రేవతికి తెలియదు .
ఆ రాత్రి కుసుమ ఇంటికి చేరుకుంది. ఆమె ఇంట్లోకి వెళ్లేసరికి రాజేష్ ఏదో పుస్తకం చదువుతున్నాడు.
రాజేష్ “ఆలస్యం అయిందేమిటి? రీడింగ్ సెషన్ బాగా జరిగిందా? కుసుమ ” బాగానే జరిగింది” అంటూ . అతని వైపు నడిచింది.
“ఈ రోజు ఒకరిని కలిసాను. తను మన జీవితంతో ముడిపడిన వ్యక్తి.”
రాజేష్ :: “” ఎవరు.. రచయిత?”
ఆమె నెమ్మదిగా నవ్వింది. “అవును. ఆమె పేరు రేవతి.”
రాజేష్ స్తంభించిపోయాడు. అతని పుస్తకం ఒడిలోంచి జారిపోయింది. కుసుమ అతన్ని చూస్తూ అడిగింది . “మీకు ఆమె తెలుసా?” అతను కళ్ళు మూసుకున్నాడు. “అవును” అని మెల్లగా చెప్పాడు.
ఆ జవాబు విన్న కుసుమ మనసు ముకుళించింది.
ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో టెన్షన్
కుసుమ అతనిని నిందించలేదు. ఆమె బిగ్గరగా అరిచి సీన్ క్రియేట్ చేయలేదు, కానీ కొన్ని నిశ్శబ్దాలు విస్ఫోటకాలకంటే తక్కువ కాదు.
” తను ఒకప్పుడు రేవతిని ప్రేమించానని, కుసుమ తన జీవితంలోకి రాకముందే ఆ చాప్టర్ ముగిసిపోయిందని, ఆమెతో గతం గురించి నిజాయితీగా అన్ని చెప్పానని , పేరు బహిర్గతం చేయడం ఎందుకని చెప్పలేదు.”అని రాజేష్ చెప్పటానికి ప్రయత్నించాడు –
“కానీ ఆమె పేరు మీరు నాకు ఎప్పుడూ చెప్పలేదు,” కుసుమ చివరకు చెప్పింది.
“నేను ఆమెను మళ్లీ చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు,” అని అతను బదులిచ్చాడు.”నువ్వు ఆమెను కలిసావా ?”
కుసుమ నవ్వింది.. “ఆమెకు నేనెవరో తెలియదు. ఆమె కేవలం… నాకు తన కథ చెప్పింది. ఇప్పుడు కూడా నేను ఆమె కళ్లలో మీ పై ప్రేమను చూశాను.”
రాజేష్ గుండె ఓ క్షణం లయ తప్పింది . “నన్ను క్షమించు. నీకు ఈ విషయం ఇలా తెలిసినందుకు..”
కుసుమ మౌనంగా ఉండి పోయింది. మూడు రోజుల తర్వాత రేవతి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది.
“మనం కలుసుకోగలమా? నేను మీతో మాట్లాడాలి ” – కుసుమ .
హఠాత్తుగా వచ్చిన ఆహ్వానానికి రేవతి ఆశ్చర్యపోయింది, కానీ కుసుమ స్వరంలో సీరియస్ నెస్ గ్రహించింది.
ఇద్దరూ మరో కేఫ్ లో కలిశారు.
కుసుమ సమయం వృధా చేయకుండా “నేను మీకు ఒక విషయం చెప్పాలి”అని టేబుల్ మీద ఒక ఫోటోను ఉంచింది. కుసుమ్ మరియు రాజేష్ ల పెళ్లి ఫోటో. రేవతి తదేకంగా చూసింది. ఆమె గుండె గొంతులోకి వచ్చింది.. “ఓహ్,” ఆమె మెల్లగా . “మీరు రాజేష్ భార్యా ?”
కుసుమ నవ్వింది: “మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరో నాకు నిజంగా తెలియదు.”
రేవతి ఉలిక్కిపడింది. “నన్ను క్షమించండి. రాజేష్ కు నేను ఎటువంటి ఉద్దేశం ఆపాదించ లేదు.”
మెల్లగా చెయ్యి పైకెత్తింది కుసుమ . “మీరు ఏ తప్పూ చేయలేదు. నిజానికి… మీరు మీ భావాలు స్పష్టం చేసారు.” రేవతి అయోమయంగా ఆమె వైపు చూసింది.
“రాజేష్‌తో నా వివాహం స్థిరంగా ఉంది, కానీ ఏదో వెలితి . ఎందుకో నాకు అర్థం కాలేదు – అతనిలో ప్రేమ లో కొంత భాగాన్ని నేను సొంతం చేసుకోలేక పోయాను.. మీ కథ విన్న తర్వాత, చివరికి నాకు అర్థమైంది ఏమిటంటే తను మిమ్మల్ని ప్రేమించడం మానలేదు … కానీ అతను నాతోనే ఉండటాన్ని ఎంచుకున్నాడు. అతను మీకు ద్రోహం చేయలేదని నాకు అర్ధం అయింది. మీరిద్దరిది కేవలం ఒక అసంపూర్ణ కథ.”
రేవతి కళ్లలో నీళ్లు తిరిగాయి. ” నేను అతని జీవితంపై నీడగా ఉంటానని భయపడేదాన్ని .మీరు చెప్పిన మాటలు నాకు చాలా ఊరట నిచ్చాయి.”
కుసుమ చిరునవ్వు లో ఓ బాధా వీచిక…. “మీరు నీడ కాదు ,రాజేష్ జీవితంలో మీది గతించిన అధ్యాయం”
మౌనంగా ఎవరి ఆలోచనల్లో వారు..
ఒకే వ్యక్తిని ప్రేమించిన ఇద్దరు మహిళలు – ఇప్పుడు ప్రత్యర్థులుగా కాదు, ఒకరి కొకరు స్వచ్ఛమైన ప్రతిబింబాల్లా ఉన్నారు.
వెళ్ళే ముందు రేవతి కుసుమ చేతిని తాకింది. “కుసుమా.. నువ్వు తనకి తగిన దానివి, మీ జోడి కలకాలం వర్ధిల్లాలి.” కుసుమ ఆమె వైపు చూస్తూ..” తను మిమ్మల్ని ఎందుకు ప్రేమించాడో , నాకు ఇప్పుడు అర్ధం అయింది.. “
—- ఆ రాత్రి, కుసుమ ఇంటికి వచ్చి రాజేష్ తో :””నేను ఆమెను మళ్ళీ కలిశాను,” అని చెప్పింది. అతను భయపడుతూ ఆమె వైపు చూశాడు. ” మిమ్మల్ని + నన్ను నేను అర్థం చేసుకోవడానికి రేవతి నాకు సహాయపడింది,” అంటూ కుసుమ అతని చెయ్యి పట్టుకొని . “మనం గతాన్ని తుడిచివేయలేము, కానీ మనం దాని గురించి భయపడటం మానేద్దాము. మీ హృదయం అంతా నాది కానక్కర లేదు — మీరు నాకు వాగ్దానం చేసిన భాగం మాత్రమే నా సొంతం.”
రాజేష్ కళ్ళు చెమ్మ గిల్లాయి “అవును. ఆ భాగం ఎల్లప్పుడూ నీదే .”
చాలా నెలల తర్వాత రాజేష్ కుసుమలు అరమరికలు,అనుమానాలు దరి చేరని వెచ్చటి కౌగిలి లో ఇమిడిపోయారు.
Some love stories never end in togetherness. Some don’t need to..
And sometimes, that’s the best ending love can offer.