అతివలు – కలువలు

కొలనంతా తామరలు. ఎర్రవి, తెల్లవి, దట్టంగా అల్లుకుని ఉన్నాయి. కెంపులు, పచ్చలు, రవ్వలు కలిపి చేసిన గుండ్రని పతకం భూదేవి మెడలో వేలాడుతున్నట్టు ఆ చెరువు ఎంత శోభగా ఉందో. అతడికి ఈ దృశ్యం అంత అబ్బురంగా ఏమి తోచలేదు. రోజూ చూసేదే. ఆ కొలనులోని తామరలు చూస్తే అతనికి తన విస్తరాకులోని మెతుకులు గుర్తొస్తాయి.

మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళి, ఎర్రటి ఎండలో ఆ కోలునులోకి దూకి తామరలను తెంపి తలపైన ఉన్న తట్టలోకి వేసుకోవడం, తట్ట నిండాకా ఒడ్డుకొచ్చి తమరాకులతో కప్పి, దాని పైన ఇంకో తడిపిన తువ్వాలు కప్పి, మళ్ళీ ఇంకో తట్ట తీసుకుని కొలనులోకి దూకడం ఇదే అతని దినచర్య. తెంచుకొచ్చిన పూలను అమ్మా, చెల్లెలు కలిసి గుడి దగ్గర అమ్మేవారు. ఎక్కువ పూలుంటే పక్కూరికి వెళ్ళి మార్కెట్లో ఇంకా ఎక్కువ ధరకి అమ్ముకొచ్చేవాడు.

ఎప్పటిలానే ఆ రోజూ కొలనులోకి దూకాడు. గట్టు మీద నుండి ఎవరో కేకలు పెడుతుంటే తలెత్తి చూశాడు. బుట్టబొమ్మలా నిలబడ్డ ఆమెని చూశాడు. పక్కనే ఉన్న రెండు అరచేతులు పట్టేంత ఉన్న కలువను చూపించి తెంచివ్వమని కోరుతుంది. మాములుగా అయితే మార్కెట్లో ఆ పువ్వుకి వంద తక్కువ రాదు. కానీ ఆలోచించకుండా ఆ పువ్వుని కోసిచ్చాడు. ఆమె మెడలోని లాకెట్ కూడా అచ్చం ఆ కొలను లాగానే కెంపులు, పచ్చలతో మెరిసిపోతుందని మొదటిసారిగా అనుకున్నాడు. ఆమె చిరునవ్వు ముందు ఆ పువ్వు ఎందుకూ పనికిరాదనుకున్నాడు. తెల్లటి కారులో ఆమె వెళ్లిపోతుంటే, లక్ష్మీదేవి చేతిలో తామరను అలంకరించుకుని, ఐరావతాన్ని ఎక్కి వెళ్తున్నట్టుగా ఉంది. ఇంత సంతోషం ఎన్నడూ అతనికి కలగలేదు. ఈ భావనే ఏదో తీయగా ఉందని ఎగిరాడు. అక్కడ పువ్వులు ఇప్పుడు విస్తరాకులోని మెతుకుల్లా కాక, ఆమె అరచేతుల్లా ఆనుతున్నాయి.

రోజూ అదే సమయానికి ఆమె రావడం , పువ్వులను తెంచి ఇవ్వడం, పువ్వులను ఒ చేతిలో పట్టుకుని కారు అద్దం దించి మరో చేతిని వెళ్లొస్తానంటూ ఊపుతూ, సమ్మోహనంగా ఆమె నవ్వే నవ్వు, అతనికి జీవితం మొదటిసారిగా ఓ మధుర కావ్యంలా తోచింది.

ఆ రోజు కూడా పువ్వులను తీసుకోవడానికి ఆమె వచ్చింది. ఎప్పటిలా ఆమె అద్దం దించి చేతిని ఊపలేదు. నోట్ల కట్టను తీసి అందివ్వబోయింది. “ఈ పూలు చాలా ఖరీదు అంటగా. ఇది సరిపోతుందా? ” ఆమె మాటలకు అతను లోపలే కుప్పకూలాడు. “పర్వలేదండీ. కానీ రేపటి నుండి నేను పువ్వులు గుడిలో ఇవ్వాలి. మీకు ఇవ్వడం కుదరదు. మరేమి అనుకోకండి.” “మరేమి ఫర్వాలేదు. మీ కొట్టు గుడి దగ్గరే కదా. అక్కడ ఉంటే కొనుక్కుంటాను.” అతను వెనక్కి చూడకుండా గుడి దారి పట్టాడు.

ఆమె అతన్ని ఇష్టపడుతుందని అనుకోకపోయినా, తన ఇష్టాన్ని స్వీకరిస్తుందని సంబరపడ్డాడు ఇన్నాళ్లు. అందుకే ఆమె ఏనాడూ డబ్బులు ఇవ్వలేదని అనుకున్నాడు. కానీ ఆమె దృష్టిలో అతనేంటో తెలిసాక మనసు విరిగిపోయింది.

గుడి దగ్గరకు వెళ్ళగానే, అమ్మా, చెల్లి ఇద్దరూ కనిపించలేదు. పక్కనే ఉండే తన మరదలైన పూలమ్మి ట్టు బేరాన్ని చూస్తుంది. అతన్ని చూడగానే పూలమ్మి సిగ్గుతో ముడుచుకుపోయింది. “అత్తమ్మకు బాలేదని చెల్లాయిని తోడిచ్చి ఇంటికి పొమ్మన్నా” మనసంతా మధుర భావానేదో నిండిపోయింది అతనికి. ఆమె కళ్ళలోని సిగ్గు, బుగ్గల్లో ఎరుపులు చూస్తుంటే తన బుట్టెడు తామరలు కూడా సరితూగలేవనిపించింది.

ఆమె చేతుల్లో తను ప్రత్యేకంగా ఉంచే ఎర్రటి కలువను పెట్టాడు. “ఏంటిది?” అన్నట్టు చూశాయి ఆమె కళ్ళు. “నా మనసు” అన్నట్లు సైగ చేశాడు. “ఇక ఎప్పటికీ నీదే” అన్నాడు. “ఎన్నడూ లేనిది ఇప్పుడేటి కొత్తగా?” ఆమె కళ్ళలో నీళ్లు జలాజలా కారుతున్నాయి. తాను రోజూ ఈదే కొలను ఈమె కన్నీటి నుండి వచ్చిందేనా!

దేవత కోసం గుడికి రావాలని తెలియలేదు ఇన్నాళ్లు” అతని కంఠం వణికింది. ఆమె చేయిపట్టుకుని మొట్టమొదటిసారిగా ఆ గుడిలోకి అడుగుపెట్టాడు. కుంకుమరంగు చీరలో,తామరపూల దండలతో మెరిసిపోతున్న అమ్మవారు, మాసిన చీర, మట్టిగాజులు, చేతిలో పువ్వుతో ఉన్న ఆమె వేరుగా కనిపించలేదు అతనికి.

0

1 Comment Leave a Reply

  1. బాగుందమ్మా. కథాంశం, కథ నడిచిన తీరు, భాష అన్నీ చక్కగా కుదురుగా చేరాయి. మంచి ప్రయత్నం. 🙂

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

నాన్న టీ షర్ట్

నేను పూనే లో వ్యవసాయ కళాశాలలో చదివేరోజుల్లో, లక్ష్మీ బజార్ లో నాన్న

Courage to Dream Beyond One’s Lifetime

This tweet recently provoked me to articulate thoughts that have