నాన్న టీ షర్ట్

నేను పూనే లో వ్యవసాయ కళాశాలలో చదివేరోజుల్లో, లక్ష్మీ బజార్ లో నాన్న కోసం ఒక టీ షర్ట్ కొన్నాను.ముదురు ఆకుపచ్చ టీ షర్ట్, ముందు IMPACT అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలల్లో ప్రింట్ ఉండేది. కొన్నది పెద్ద దుకాణం లో కాదు, వెచ్చించింది ఎక్కువ ఖరీదూ కాదు. ఎందుకంటే అప్పుడు నాది, చవకబారు రీసైకల్డ్ పేపర్, 10 రూపాయలకు నాలుగు వచ్చే use and throw పెన్లు,వన్ బై టూ చాయిల తో గడిచే బడ్జెట్ బ్రతుకు — స్టూడెంట్ బ్రతుకు.

నాన్నకి టీ షర్ట్ ఇచ్చిన వెంటనే సరదా పడ్డారు, IMPACT అన్న మాట చూసి IAF కి సంబంధించి ఏదో విషయం గుర్తు చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం badminton ఆడటానికి అదే టీ షర్ట్ వేసుకొని వెళ్ళారు, స్నేహితులంతా కాంప్లిమెంట్స్ ఇచ్చారని మురిసిపోయారు. నాన్నలు

ఆ తర్వాత పై చదువులు, ఉద్యోగం, పెళ్ళి అనే గళ్ళన్నీ టిక్ కొట్టేసరికి మరో 5–6 ఏళ్ళు గడిచాయి. దరిమిలా నేనెప్పుడు ఇంటికి వెళ్ళినా, నేను ఉన్నన్నాళ్ళలో ఏదో ఒక రోజు ఆ టీ షర్ట్ వేసుకొనే వారు. నేను రెండు మూడు సార్లు చెప్పాను, ‘నాన్న, ఈ టీ షర్ట్ రంగు వెలిసిపోయింది. బాగా పాతది కూడా అయిపోయింది. నేను మరోటి ఇలాంటిదే కొనిస్తాను, ఇది వేసుకొవద్దు నాన్న’ అని.

నాన్న మాత్రం,’లేదమ్మ, చాలా మంచి టీ షర్ట్, చాలా సౌకర్యంగా ఉంటుంది’ అని మాట దాటేసేవారు.
అప్పుడు అమ్మ, ‘అవునమ్మ, ఎక్కడ కొన్నావో గాని, చాలా మంచి క్వాలిటి. ఇన్ని సంవత్సరాలలో మీ నాన్న బొజ్జపెరుగుతూనే ఉంది, అది పాపం సాగుతునే ఉంది’ అనటం.
‘నువ్వు ఇంతేసి నూనే పోసి వంట చేస్తే పొట్ట రాక ఏమవుతుంది?

‘అవును మరి, అన్నీ తగ్గించి వండితే అర్థాకలితో లేస్తారు కంచం ముందు నుంచి, ఆ బాధ చూడలేకే మీకు నచ్చినట్టు చేస్తున్నాను. అయినా ఆ టీ షర్ట్ లైఫ్ అయిపొయింది, నాకిస్తే, చక్కగా కిచెన్ కౌంటర్ తుదుచుకుంటా, మెత్తని బట్ట ఇమ్మంటే ఇవ్వట్లేదు మీ నాన్న.’

‘నువ్వు ఇలాంటిదేదో చేస్తావనే ఇంకా వేసుకుంటున్నాను. ఇచ్చే సమస్యే లేదు.’ నాన్నలు

బాబు పుట్టి నాలుగేళ్ళు. వాడి బారసాలకి వెళ్ళినప్పుడు వేసుకున్నారు, వాడి మొదటి పుట్టిన రోజు వైజాగ్ లో జరుపుకునేందుకు వెళ్ళినప్పుడు వేసుకున్నారు, వాడి మూడో దశరాకి వెళ్ళినప్పుడు వేసుకున్నారు. ఈ వేసవికి వెళ్ళుంటే ఖచ్చితంగా వేసుకునే వారేమో. ఈ సారి ఎలాగైన వేరే టీ షర్ట్ ఇచ్చి, ఆ పాత దాన్ని దాచేయమని అమ్మకు చెప్దామని గట్టిగా నిర్ణయించుకున్నా. కానీ….. తలచినదే జరిగినదా దైవం ఎందులకు?

కొరోనా వచ్చి నా ప్లాన్, పెద్ద బడ్జెట్, అంతకంటే పెద్ద హీరోని పెట్టి తీసిన మల్టీ స్టారర్ కు అర స్టార్ రేటింగ్ వచ్చినంత పెద్ద ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సారి ఎలాగైనా నాన్నకు కొత్త టీ షర్ట్ కొనిస్తాను, లేదా పంపిస్తాను.అయినా సరే, మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నాన్న IMPACT టీ షర్టే వేసుకుంటారు.

అది నా మనసుకు తెలుసు.

ఎందుకంటే………. నాన్నలు

2

1 Comment Leave a Reply

  1. ఆయనకు (మీ నాన్నగారికి) ఆ పాత ‘టీ షర్టే’ ఒక తియ్యటి గుర్తు అన్నమాట

    మా (కీ శే) నాన్నగారు కూడా ఎప్పుడో 2014 లో చేసిన అమెరికా ప్రయాణం లో మా డాక్టర్ అక్క / మరియు డాక్టర్ చదువు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్న మేనకోడలు ఇచ్చిన టీ షర్ట్ లని అప్పుడప్పుడు వేసుకొని మురిసిపోతూ ఉండేవారు

    మీ “నాన్నలు” అన్న ఎక్స్ప్రెషన్ ని పూర్తిగా అర్ధం చేసుకోగలను .. అది ‘తాతలు’ అన్న ఎక్స్ప్రెషన్ కి కూడా పూర్తిగా వర్తిస్తుంది (మేనకోడలు వైపు నించి )

    నిన్ననే ఇంకో పలుకు లో రచయిత గారితో చిన్న సంభాషణ చేస్తూ నాన్నగారు ఒక 6/7 నెలల క్రితమే భౌతికంగా మమ్మల్ని వదిలివెళ్లారు అన్న విషయం షేర్ చేసుకుంటే

    అయన సహస్ర పున్నమి చంద్రుల దర్శనం తర్వాతే కదా అన్న విషయం హైలైట్ చేసి ఒక విధమైన కృతజ్ఞతా భావాన్ని గురిచేసారు

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

వింజమూరి కధలు – 2 – నేల టిక్కెట్టు

“మోవ్… నీకు ఎన్నిసార్లు చెప్పాలి. నాకు సైడ్ క్రాఫ్ వద్దు, పైకి దువ్వు”

మాక్ ఓయస్‌లో తెలుగులో టైప్ చేయడం ఎలా ?

మీ మాక్లోని ఆపిల్ లోగో పైన క్లిక్ చేసి సిస్టం సెట్టింగ్స్ ఎంచుకోండి.