(15-08-2020) పునస్సమీక్ష.

పెళ్ళి.

“ఆరోజు అలా చేసి ఉంటే…ఈరోజు ఇలా ఉండేది కాదు, అని మీరు అనుకునే సంఘటన ఏంటి?”
పొద్దున్న ట్విట్టర్లో వచ్చిన పై ప్రస్తావనకు నా సమాధానం నా పెళ్ళి అని ఇచ్చాను.

దానికి వివరణ అని కాదు కానీ, కొన్ని భావాలు, అనుభవాలు పంచుకోవడానికే ఈరోజు ఈ రాత.

చిన్నప్పట్నుంచీ కూడా పెళ్ళి అంటే సదభిప్రాయం లేని మాట వాస్తవం. దానికి తోడు, ఇంట్లో దైవభక్తి, అందుకు సంబంధించిన ఆచార వ్యవహారాలు ఎక్కువగా ఉండడం చేత అసలు పెళ్ళి కంటే దైవభక్తి మార్గమే చాలా గొప్పదీ, ఉపయోగమైనదీ, మానవ జన్మను సార్థకపరచేదీ అని ఇలా రకరకాల అభిప్రాయాలు కలగడమూ, కొండొకచో, కొన్నింటిని కొంతమంది బుర్రలోకి జొప్పించడం కూడా జరిగింది.

పెళ్ళి అంటే కేవలం పిల్లలూ, సంసారం, బరువూ, బాధ్యతా తప్పించి అందులో మరే ఇతర ఉపయోగమూ లేదని బాగా గట్టిగా అల్ట్రాటెక్ సిమెంటు ముద్రలు బుర్రలో బాగానే పడ్డాయి. పైగా, అటువంటి అభిప్రాయాలకు బలం చేకూరుస్తూ పద్ధెనిమిదో యేటనుంచే ఉద్యోగం చేయవలసి రావడం, కుటుంబ భారం కాస్తంత నెత్తిన పడడం లాంటివి కూడా జరిగాయి. అందువల్ల పెళ్ళి ప్రసక్తి తెచ్చినపుడల్లా అమ్మ మీద కోపం తెచ్చుకునేవాణ్ణి.

కానీ, “ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలిరా” – “నాకు ఓపిక ఐపోతోంది నేను పూర్తిగా మూల పడితే నువ్వు ఇబ్బంది పడతావురా” ఇవి మా అమ్మ రికార్డులు అరిగిపోయేదాకా వాడగా వాడగా, నిజంగా ఒకానొక సమయంలో ఆవిడ అనారోగ్యం చూసి, ఓహో, తల్లిదండ్రులు పెద్దవాళ్ళవుతూ ఉన్న సమయంలో నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే వారికి సహకరించడానికైనా ఇంకొక మనిషిని నేను నమ్మి నా జీవితంలోకి తెచ్చుకోవాలని నాకు కలిగిన ఆలోచన ద్వారా, నేను పెళ్ళికి ఒప్పుకోవలసి వచ్చింది.

నిజానికి నా ప్రణాళిక ఏమిటంటే, ఉద్యోగం చేసుకుంటూనే దేశం మొత్తం తిరగాలనీ, అందులోని సర్వ జీవరాశులనూ పరికించి, పరిశీలించి, పరిశోధించి అర్థం చేసుకుని, మిగతా ప్రజలందరికీ నన్ను నేను ఉపయోగించే అవకాశాలు వెతుక్కుంటూ, పనిలో పనిగా దేశంలో ఉన్న అన్ని క్షేత్రాలూ, చారిత్రక ప్రదేశాలూ కూడా చూసేసి సంతృప్తి చెందిన పిమ్మట, చివరగా అంత్యకాలంలో, శేషజీవితాన్ని అరుణాచలంలో గడిపివేయాలని నేను నా ఇరవై రెండవ యేట 1995లో నిర్ణయించుకున్నాను.

అయితే, ఆ నిర్ణయం తీసుకునే సమయానికి, పెళ్ళి అనే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలే కాక ప్రేమలు, త్యాగాలు కూడా ఉంటాయనీ, పిల్లలు అనే రత్నాలు, మోయగలిగే బరువునే కాకుండా మరువలేనంత ప్రేమను కూడా ఇస్తారనీ, టోకు మొత్తంగా చేదు గుళికలే కాక చాలా తీపి జ్ఞాపకాలు కూడా ఉంటాయనీ తెలియదు (మేం ముగ్గురు పిల్లలమూ మా తల్లిదండ్రుల పట్ల అలానే ఉన్నా కూడా, స్వీయానుభవమే గురువు కాబట్టి). తెలిపేందుకు ఇంట్లో ఆ వాతావరణమూ లేదు.

తర్వాత, పైన చెప్పుకున్న విధంగా పెళ్ళి అయిపోయిన తర్వాత, ఏమేమి ఉంటాయని తెలియదో అవన్నీ ఉంటాయని అర్థమైన తర్వాత, పెళ్ళి కూడా అవసరమేనూ, మనిషి జీవితంలో లెక్కించదగ్గ అనుభవమే అని అర్థమైంది. పెళ్ళి కాకుండా ఉండి ఉంటే, నేను అనుకున్న ప్రకారమే నా జీవితం ఉండేదో లేదో తెలియదు కానీ, పెళ్ళి అయిన తర్వాత కూడా అప్పటి లక్ష్యాలను కొద్దిగా అటూ ఇటుగా సాధించుకోవచ్చని మాత్రం స్పష్టంగా అర్థమైంది.

నా తమ్ముడు ఆదిత్య ఇంగ్లీష్ లో వ్రాసిన Struggle for Acceptance అనే బ్లాగుపోస్టు కూడా https://twitter.com/vizagobelix/status/1250325190493368321?s=09  ఈరోజే రావడం కేవలం యాదృచ్ఛికమే అయినా కూడా చాలా సమయానుకూలంగా వచ్చిందని సంతోషిస్తూ, జీవితంలో ఎలా వచ్చినదాన్ని అలా అనుభవిస్తూ అనుభూతి చెందడంలోని సంతృప్తిని సంతృప్తిగా స్వీకరిస్తూ..

ఈరోజు ఈ బ్లాగుపోస్టు వ్రాసేటందుకు కారణమైన  https://twitter.com/avasaramledu/status/1249898596712845312?s=09   ఈ ప్రశ్న అడిగినవారికి కృతజ్ఞతలతో..

కందర్ప కృష్ణమోహన్.

0

3 Comments Leave a Reply

  1. పెళ్ళంటే కేవలం ఒక లొల్లి అన్న మాటను వ్యతిరేకించి రాయడమే ఒక పెద్ద విషయం అని చెప్పాలి

    మీరు రెఫెర్ చేసిన ఆదిత్య కందర్భ గారి ‘struggle for acceptance’ ఇంగ్లీష్ వ్యాసం కూడా చాలా హృద్యంగా వున్నది

    (మీరు దాన్నే ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు)

  2. మోహనూ

    పెళ్లి ఒక విచిత్ర వ్యవస్థ. అందులో ఉన్నవారు బయటకు రావాలని, బయట ఉన్నవారు లోపలి వెళ్లాలని తపిస్తూ ఉంటారు..
    కొన్ని ఎక్ససెప్షన్స్ ఉంటాయి లెండి …..

    • ఒక మౌలిక ప్రశ్న ..

      మన దేశంలో అందరూ అన్ని విషయాలనూ రూల్స్ తోనే నడుచుకుంటారా ?

      exceptions తోనే విషయం ఎక్కువగా ముందుకు పోతూ ఉంటుందా?

      ఈ పరిస్థితి పెళ్లి అన్న అత్యంత ముఖ్యమైన “institution” కి కూడా వర్తిస్తుందా? వర్తించదా ?

Leave a Reply to Ghouse Hyd Cancel reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

కనాట్ ప్లేస్ కథలు – ఫ్లయింగ్ కిస్

మా బ్యాంక్ పక్కనే BOAC ఆఫీస్ ఉండేది.( బ్రిటిష్ ఎయిర్వేస్ కంటే ముందు

మీ జీవితంపై బాగా ప్రభావం చూపిన మూడు పుస్తకాల పేర్లేమిటి?

కాస్త వైవిధ్యముగా వివరించే ప్రయత్నం చేసానేమో అన్న భావనతో రాసిన పోస్ట్ అలా