స్వదేశీ నినాదం చెరువు మీద అలగటం లాంటిది

విదేశీ మార్కెట్లలో మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడో లేక విదేశాలు మనని చులకన చేశారు అనుకున్నప్పుడో మనకి సర్రుమని వస్తుంది – ముందుగా కోపం, తరువాత స్వదేశీ నినాదం. స్వదేశీ వస్తువులు మాత్రమే కొనటం అంత గొప్ప విధానమైతే ఎప్పుడూ అదే దారిలో నడవొచ్చుగా. మన దేశంలో దాదాపు 1991 దాకా అదే విధానం అమలయ్యింది. స్వాతంత్య్రం వచ్చాక అప్పటి ప్రధాని నెహ్రూ, ఆయన తర్వాతి ప్రధానులు కూడా విదేశీ కంపెనీలకు తలుపులు మూసి స్వదేశీ, స్వావలంబన విధానాలే పాటించారు.

యూరోపియన్ వలస పాలకులు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని ఎన్నో దేశాలకు వ్యాపారం పేరుతో వెళ్ళి వందల ఏళ్ళు పాటు అధికారం చలాయించిన నేపధ్యంలో, సోవియట్ యూనియన్‌లో ఏర్పడ్డ సోషలిస్టు ప్రభుత్వం వ్యవసాయంతో సహా అన్ని రంగాల్లో ప్రజా ప్రభుత్వం అద్భుతంగా నడుపుతుందన్న ప్రచారం ఉన్న నేపధ్యంలో ప్రధాని నెహ్రూ కూడా చాలా తక్కువ రంగాల్లో విదేశీ వాణిజ్యానికి ఆస్కారం ఇచ్చారు. చాలా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి, కొన్ని రంగాల్లో పరిమితంగా ప్రైవేటు సంస్థల ఉనికికి అవకాశమిచ్చారు.

ఫలితమేంటో అందరికీ తెలుసు. ఏ వస్తువు కావాలన్నా కొరత..ఆఖరికి బియ్యం, చక్కెర లాంటివి కూడా. ఒకవేళ దొరికినా నాసిరకం నాణ్యత. అది ఉప్పూ పప్పూ కావొచ్చు, రేడియో, సైకిల్ కావొచ్చు. కారణమేంటంటారు? తయారీదారులు పోటీకి భయపడాల్సిన అవసరం లేకపోవడం, దానికితోడు అప్పుడూ ఇప్పుడు కూడా వస్తు నాణ్యతను పరిరక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు లంచాలకు అమ్ముడుపోవడం.

1991 ఆర్థిక సంస్కరణల తర్వాత విదేశీ వస్తువులు, వ్యాపారులకు మన మార్కెట్‌లో ప్రదేశం లభించినాకే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. పోటీతత్వం పెరిగింది. నాణ్యత, ధర ఆధారంగా వినియోగదారులు తమకి నచ్చిన వస్తువులను, సేవలను ఎంచుకునే అవకాశం లభించింది. దానివల్ల దేశీయ వ్యాపారులు కూడా నాణ్యత, మన్నిక, కస్టమర్ సర్వీస్ మీద దృష్టి పెట్టి కొందరు మనగలిగారు, కొందరు చరిత్రలో కలిసిపోయారు. లాభపడింది ప్రజలే కదా.

మరి ఇప్పుడు స్వదేశీ నినాదం ఎందుకు?

ట్రంప్ చర్యలతో గాయపడిన హృదయాలకు కొంత సాంత్వన లభిస్తుంది. అలాగే స్వదేశీ అనగానే అదో దేశభక్తిని ప్రతిష్ఠించే చర్యలా అనిపిస్తుంది. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మార్కెట్లో పోటీ తగ్గితే నష్టపోయేది ప్రజలే. ఇది చెరువు మీద అలగటం లాంటిది.

ఇక్కడ ఒక ఆర్థిక సూత్రం గురించి మాట్లాడుకోవాలి- ‘కంపేరిటివ్ ఎడ్వాంటేజ్’. అనగా.. ఏ దేశం కూడా అన్ని రకాల వస్తువులను, సేవలను అతి తక్కువ ఖర్చుతో, మంచి నాణ్యతతో తయారు చేయలేదు. ఒక్కో దేశానికి కొన్ని సహజ సిద్ధమైన వనరులు, కొన్ని యోగ్యతలు ఉంటాయి. దానివల్ల కొన్ని వస్తువులు అక్కడ తయారు చేస్తే మంచి నాణ్యతతో పాటు తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఆ వస్తువులను అక్కడి నుంచి దిగుమతి చేసుకుని, మనం బాగా తయారు చేయగలిగే వస్తువులను ఎగుమతి చేయటమనేది తెలివైన పని.

మరి ట్రంప్ ఎందుకు మన ఎగుమతుల్లో కొన్ని వస్తువుల మీద సుంకాలు పెంచి ఆ ఎగుమతులను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు? అతనికి ఈ మాత్రం ఆర్థిక సూత్రాలు తెలియవా? అతను తమ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో తయారయ్యే ఆహార ఉత్పత్తులను మనకి అమ్మాలనే ఉద్దేశంతో ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాడు. తద్వారా నష్టపోయేది ఆ దేశ ప్రజలే. ఎందుకంటే నగలు,దుస్తులు,రొయ్యలు లాంటి వస్తువులని ఇప్పుడు ఆ దేశప్రజలు ఎక్కువ ధరలకు కొనుక్కోవాల్సొస్తుంది. అలాగే ట్రంప్ మనదేశానికి ఎగుమతి చేద్దామనుకున్న ఆహార ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించి మోడీ ప్రభుత్వం ఆయా పంటలు పండించే మన దేశ రైతులకు మేలు చేస్తుంది కానీ మన దేశంలోని వినియోగదారులకు నష్టం కలుగుతుంది. ఈ నిర్వాకం చాలక స్వదేశీ నినాదం ఎత్తుకోవటం మోదీ ప్రభుత్వానికి రాజకీయంగా ఉపశమనాన్ని కలిగిస్తుందేమో గానీ ప్రజలకు నష్టమే. కానీ ఆ విషయం ప్రజలు ఆలోచించుకునే అవకాశమివ్వకుండా దేశభక్తి అస్త్రాన్నిప్రయోగించటం చాలా తెలివైన పని కదూ.

7

Nag Vasireddy

After working for nearly 30 years as a corporate leader, I moved away from the regular grind to pursue my interests in sales coaching, content creation and traveling.

3 Comments Leave a Reply

  1. చాలా చక్కని విశ్లేషణ ఇది. ఎంతో అవసరమైన విషయం కూడా. వ్యక్తులు స్వయంకృషితో ఎదగాలని కోరుకోవటం ఎంతగా అభినందనీయమో, ఏదైనా వ్యవస్థ, సమాజం, ప్రదేశం, దేశం కూడా స్వావలంబనా సూత్రాన్ని ఆచరించటం, తగిన ప్రోత్సాహకాలందించటం కూడా అంతే ఎన్నదగిన మార్గం. అందులో విభేదించేదేమీ లేదు.

    ఐతే, మనిషి ఒంటరిగా మనుగడ సాగదని తెలుసుకోవటం వల్లనే తోటివారితో కలిసి సంఘజీవిగా పరిణామం చెందాడు. తన చుట్టూ వ్యవస్థలను నిర్మించుకున్నాడు. దీనిని పెంచుకుంటూ పోవటం ద్వారానే ప్రపంచంలోని అన్ని దేశాల మధ్యనా వ్యాపార, వాణిజ్య, సామాజిక, సాంస్కృతిక ఎదుగుదల సాధ్యమైంది. ఉత్పత్తి, సేవా, వినిమయ రంగాల అభివృద్ధి మెరుగైంది. ఇదంతా, కొంత మేరకే కానీండి; ప్రపంచంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొనేందుకు మార్గం సుగమం అయేలాగ తోడ్పడింది.

    వ్యాసంలో చెప్పినట్లు ఈ సత్యం మరచి, ఉపన్యాసాలకు, నినాదాలకు పెద్దపీట వేయటం, “మబ్బు చూసి ముంత ఒలక పోసుకోవటమే.”

    సరైన సమయంలో, సబబైన హెచ్చరిక. అభినందనలు, నాగ్.

  2. చాలా బాగా చెప్పారు నాగ్ అన్నయ్యా.. ధన్యోస్మి..
    వంద శాతం మీరన్నది నిజం..ఏ దేశమూ కూడా అన్ని వస్తువులూ నాణ్యత నిండిన వాటిని ఉత్పత్తి చెయ్యలేదు.
    అలాగని పూర్తిగా విదేశీ వాటి మీద ఆధారపడ్టమూ సబబు కాదు.
    నాణ్యత నిండిన వస్తువులు తయారు చెయ్యాలంటే పరిశోధనల్లో మన వేగం పెంచాలి. స్థానికం నుండీ ప్రపంచ అవసరాలు గమనిస్తూ సాంకేతికంగా సిద్ధమవ్వాలి. ఇలా పెంచుకుంటూ పోతే ఒకటో తారీఖు కిరాణా లిస్ట్ అంత ఉంటుంది.
    మీ నుండి మరో మంచి పోస్టు కోసం వేచి చూస్తూ
    మీ
    తమ్ముడు
    దేవయ్య.
    ఉంటా అన్నా..
    ఉంటాను..

  3. భలేగా వివరించారు నాగ్ సార్

    మా (కీ శే) నాన్నగారు తరచూ చమత్కరించే ఒక మాట గుర్తుకు వస్తుంది

    ఒకరి భక్తి వేరొకరికి భుక్తి (అని యే విధంగానూ సత్యదూరం కానే కాదు ఎటువంటి మత పరమైన విషయాల్లోనైనా)

    అదేమాట దేశ భక్తి అన్న నినాదానికి కూడా (అంత ఎక్కువ వివాదం) లేకుండానే వర్తించేస్తుందా?

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

అక్షరాల అల్కెమిస్ట్ – ఓ. హెన్రీ!

కొన్ని పేర్లు వింటే చాలు, మనసులో కథల సెలయేరు పొంగుకొస్తుంది. నా పాలిట

ఆడవాళ్ళూ! లా పాయింట్లు!!

నిన్నటి నుంచీ ఒక్క రవ్వ నడుం నొప్పి! అయినా నా 4 కిమీ