ఈ కథలోని పాత్రలు కొందరిని పోలి ఉండవచ్చు, ప్రదేశాలు చూసినవిలా ఉండవచ్చు, వస్తువులు ఎప్పుడో వాడినవిలా ఉండవచ్చు. చేసుకున్న వాడికి చేసుకున్నంత ప్రభుదేవా అని, వారి చేతలే నా చిట్టి కథలు.
ఆనందో బ్రహ్మ గోవిందో హార్ … నా పేరే ప్రేమ నీ పేరే ప్యార్…. అని పక్కింట్లో కఱ్ఱ బిళ్ళ ఆడుకుంటున్న కుర్రాడికి వినిపించేలా పెద్ద పెద్ద గా పాట పాడుకుంటున్నారు అమల, నాగార్జున. ఆ పాట అంటే ఆ కుర్రవాడికి ప్రాణం. అసలే యవ్వనాశ్రమానికి అద్దె కట్టలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఇక ఇటువంటి పాటలు అతనిని కుదురుగా ఉండనిచ్చేవి కావు. ఆట మానేసి ఆ ఇంటి ప్రహరీ గోడకు ఆనుకుని నిలబడి కళ్ళు మూసుకుని ఆ పాటె తన్మయత్వంతో వింటున్నాడు. తలకి తగిలిన బిళ్ళ తన్మయత్వానికి గండి కొట్టింది. ప్రహరీ గోడకు వేసిన నిచ్చెన పై నిలబడి వాళ్ళ ఆట వీక్షిస్తున్న నీలవేణి పగలబడి నవ్వింది. కిలకిలా నవ్వుతూ ముత్యాలవాన కురిపిస్తున్న ఆ కన్నెకేసి కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు.

రేయ్ సెంది, బిళ్ళ సరిగ్గా చూసి పట్టుకోరా, బుర్ర ఇక్కడ పెట్టి ఆడకపోతే అలాగే బుర్ర పగులుతుంది అని ఒక వెటకారపు వాల్తేరు నవ్వు నవ్వాడు సెంది స్నేహితుడు ఆదిత్య.
రాత్రి భోజనాలు ముగించి పెరట్లో నులక మంచం మీద పడుకుని చల్లగాలి, చందమామతో, తనను చూసి నవ్విన, ఆ నిచ్చెన పై నీలవేణి గురించి కబుర్లు చెప్తున్నాడు. తన గురించి తెలుసుకోవాలని, తనతో మాట్లాడాలని కుతూహలం మొదలయ్యింది యువ సెందిర సేగరన్లో. బోర్లా తిరిగి నీలవేణి, సెందిల ఇళ్ల మధ్య ప్రహరీ కేసి చూశాడు. ఒక పది అడుగులు పైనే ఉంటుంది. గోడ ఎక్కి చూస్తే తను కనపడుతుందేమో, చూడనా, వద్దా !! తను ఏమన్నా అనుకుంటుందా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ? వచ్చి నాన్నకి చెప్తే ? తన కోసం ఎన్ని తన్నులైనా తినచ్చు. తన క్రీగంటి చూపులతో ఒక సారి చల్లగా చూస్తే ఎంతటి ఖేదమైన మోదమే కదా. తన నవ్వే నొప్పి నివారించే ఝన్డు బామ్ కదా అని శంకలకు శెలవు పలికి పెరట్లో మామిడి చెట్టు కింద ఉన్న వెదురు నిచ్చెన తీసుకుని ప్రహరి గోడకేసి బయలుదేరాడు. చుట్టూ పక్కల కలయజూసుకుని, ఎవరూ చూడటం లేదని రూఢి చేసుకుని నిచ్చెన ఎక్కి నీలవేణి ఇంట్లోకి తొంగి చూశాడు.
తల నిండా సన్నజాజులు, వెండి వెన్నెల పడి తళ తళలాడుతున్న వెండి పట్టీలు, పెరట్లో మల్లె తీగల పందిరి కింద మల్లె సువాసనలను గ్రోలుతూ, తన నుదుటిని మణికట్టుకు దిండుని చేసి అర్ధ నిద్రలో ఉన్న అలివేణిని చూస్తూ ఉండిపోయాడు. రోజూ రాత్రి భోం చెయ్యడం ఇంట్లో వాళ్ళందరూ నిద్ర పోయారో లేదో చూసుకుని ప్రహరీ గోడకు నిచ్చెన వెయ్యడం, సెంది దినచర్యలో భాగం అయిపొయింది. ఒకానొక రోజున ఆ వెధవ వెదురు నిచ్చెన కూసిన కూని రాగానికి ఉలిక్కి పడి లేచింది నీలవేణి. అర్ధరాత్రి వేళ ఆ గోడ మీద గుర్ఖాని చూసి కెవ్వున కేకేసింది. ఆ అరుపులకి భయపడి నిచ్చెన మీంచి నేలజారాడు సెందిర సేగరన్. పాపం కాలు విరిగి నడుము కదిలి బతుకు జీవుడా అంటూ నిచ్చెన తిరిగి చెట్టు కింద పడేసి, నులక మంచం పై జేరి, తలను దుప్పట్లో, బాధను పంటి కింద దాచుకున్నాడు.
మరుసటి రోజు కుంటుతూ కాలేజీకి బయలుదేరిన సెందికి, దారిలో గానుగ చెట్టు కింద వేచి చూస్తున్న నీలవేణి కనపడింది. అయిపోయాను, నిన్న రాత్రి జరిగిన విషయం గురించేనేమో. ఇప్పుడు ఏమి చెప్పాలి ? నేను కాదని చెప్పాలా ? ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేసిందేమో, ఇహ ఇవ్వాళ నాకు తన్నులు తప్పేలా లేవు అనుకుంటూ తిరిగి మెల్లగా నడవనారంభించాడు. ఇంతలో సెందికి ఎదురుగా వచ్చి నిలబడింది నీలవేణి. సెంది గొంతు తడారిపోయింది, ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు గానీ నోరు పెగలడం లేదు. ఒళ్ళంతా చల్లబారిపోయింది. శరీరం వణుకుతోంది.
క్షమించండి, మీరని తెలియక పెద్దగా అరిచాను. రాత్రి మీరు గోడ మీద నుంచి భళ్ళున పడ్డ శబ్దం వినిపించింది. మీకు ఏమయ్యిందో అని రాత్రంతా మనసు మనసులో లేదు. ఎందుకంత సాహసం చేశారు. నా కోసమేనా ?
అవునన్నట్టు తల ఊపాడు సెంది.
ఇంకెప్పుడు అలా చెయ్యకండి, మీకు నన్ను చూడాలనిపిస్తే ఏదో ఒక శబ్దం చెయ్యండి. నేను వచ్చి కనబడతాను. మీకు ఏమన్నా అయితే నాకు చాలా బాధ వేస్తుంది.
సెంది గుండె చప్పుడు నెమ్మదించింది. మనసు వర్ణించలేని స్థితిలో నిశ్చలంగా నిలిచిపోయింది.
సరేనండి, ఎవరైనా చూస్తారు, నేను బయలుదేరుతాను. మీరు జాగ్రత్త అని వెనుదిరిగింది.
నీలవేణి గారు, వణుకుతున్న స్వరాన్ని సరి చేసుకుంటూ పిలిచాడు సెంది.
చెప్పండి, ఏమని చెయ్యమంటారు ?
హా, అర్ధం కానట్టు చూసింది నీలవేణి.
అదేనండి, మిమ్మల్ని చూడాలనిపిస్తే ఏదో శబ్దం చెయ్యమ్మన్నారు కదా. ఏమి శబ్దం చెయ్యమంటారు ?
మీ ఇష్టమండి, నవ్వుతూ చెప్పింది నీలవేణి.
కాకిలా అరవమంటారా ?
అర్ధ రాత్రి కాకిలా అరిస్తే అనుమానమొస్తుందేమోనండి. మా ఇంట్లో ఎలాగూ ఒక గండు పిల్లి తిరుగుతోంది మీకు పిల్లిలా అరవడం వచ్చా ?
ఓహ్, దానికేం భేషుగ్గా వచ్చండీ. పిల్లి నవ్వినట్లు, ఏడ్చినట్లు కూడా చెయ్యగలను.
సరేనండి, మీరు ఈ రోజు రాత్రి గోడ దగ్గరకి వస్తే శబ్దం చెయ్యండి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి నడుము తిప్పుతూ నడిచిపోయింది నీలవేణి.
ఈ విస్తారానందంలో విరిగిన కాలు గురించి మరచి వడి వడిగా తన వెనుక అడుగులు వెయ్యబోయి వెల్లకిల్లా పడ్డాడు సిల్లీ సేగరన్.
ఒకానొక ఆదివార సూర్యోదయ సమయాన, నీలవేణి జన్మదిన పర్వదినాన, తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి బహుమతి ఇవ్వాలని గోడ దగ్గర చేరాడు. మియావ్. మియావ్ అని గండు పిల్లిలా రెండు సార్లు శబ్దం చేశాడు. పెరట్లో దంతావధానం చేసుకుంటున్న నీలవేణి వాళ్ళ బామ్మగారు ఎల్. విజయలక్ష్మిగారు అది విని, ఈ మాయదారి పిల్లి పీనుగకి మరీ వేళా పాళా లేకుండా పోయింది, దీని పిండం పిచ్చుకలు తిన అని కసురుకుంటూ చేతిలో ఉన్న కర్ర విసిరేసింది. ఆవిడ గురి వెంట్రుకవాశిలో తప్పి సెంది బుర్ర రామ కీర్తన తప్పించుకుంది. బామ్మగారి గురి తప్పినా నీలవేణి నాన్న గురి తప్పలేదు. పిల్లిలా అరవగలడు గానీ పిల్లిలా కనబడలేడు కదా. మేడ మీద నుండి సెందిర సేగరన్ నిచ్చెన బాగోతం అంతా నీలవేణి వాళ్ళ నాన్న రాజనాల చూసేసాడు.
ఒక రోజు సెంది కాలేజీకి వెళుతుండగా గానుగ చెట్టు కింద కాపు కాసి, సైకిలుకి అడ్డు నిలుచున్నాడు. ఒరేయ్ అబ్బాయ్, ఇదే చెప్తున్నాను విను, ఇంకొకసారి మా అమ్మాయికేసి చూసిన మా ప్రహరీ గోడకి నిచ్చెన వేసిన నూటారో గడిలో పాము మింగినట్టు మింగేస్తాను ఏమనుకుంటున్నావో. జాగ్రత్త అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
ఆ భయంతో సెంది గోడ జోలికి పోలేదు. రాజనాల గారి ఇంటి ముందు తల ఎత్తేవాడు కాదు. బామ్మగారు పిల్లిని ఏ కుంకబోడి కుక్కో నోటకరుచుకు పోయింది అనుకున్నారు. నీలవేణి, సెంది మాత్రం అభినందన సినిమాలో కార్తీక్, శోభనలా విరహ గీతాలతో కాలం గడిపేస్తున్నారు.
ఒక రోజు పక్క ఊరిలో పెళ్లికని బామ్మగారు ఎల్. విజయలక్ష్మి గారు, నీలవేణి వాళ్ళ అమ్మ బాల సరస్వతి గారు, నీలవేణి బయలుదేరారు. సెందిర వాళ్ళ చుట్టాలు ఇంటికి చూరు వేసుకుంటున్నాం నిచ్చెన పట్రమ్మని కబురు చేశారు. నిచ్చెనను సైకిలుకి కట్టుకుని బయలుదేరాడు సెంది. పక్క ఊరికి వెళ్లాలంటే సన్నని పంట కాలువ దాటి పోవాలి, అడ్డంగా బద్దలుగా నరికిన తాటిచెట్లే ఆ ఊరికి ఈ ఊరికి వారధి. నీలవేణి, బామ్మగారు వంతెన దాటుతుండగా చెక్క చీకి పోవడం వలన విరిగి ఇద్దరు కాలువలో పడిపోయారు. అది చూసి, బాల సరస్వతిగారు భయంతో కాపాడండి కాపాడండి అని కేకలు పెట్టారు. అటుగా వెళ్తున్న సెందిర సేగరన్ ఆ కేకలు విని పరిగెత్తుకు వచ్చాడు. నీటి ఉధృతికి బామ్మగారు, నీలవేణి కొట్టుకుపోతూ కనిపించారు. నీళ్ళ లోకి దూకి వాళ్ళని కాపాడదామని రెండు అంగలు వెనక్కి వేసాడు. ఒక అడుగు ముందుకు వెయ్యగానే తనకు ఈత రాదన్న సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఇప్పుడు ఎలా ? నీలవేణిని, బామ్మగారిని ఎలా కాపాడుకోవాలి ? ఇంతలో అతని బుర్రలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. తన సైకిల్ వైపు పరుగెత్తాడు. సైకిలుని తీసుకుని వేగంగా బామ్మగారిని, నీలవేణిని దాటుకుని ముందుకు పోయాడు. సైకిలుకి కట్టి ఉన్న నిచ్చెన తీసి పంట కాలువకు అడ్డంగా వేసి దాని మీద పడుకున్నాడు. తన చేతిని బామ్మ గారికి కాలిని నీలవేణికి చాపి గట్టిగా పట్టుకోమని చెప్పాడు. సెంది కాలు పట్టుకుని నీలవేణి నిచ్చెన పైకి ఆ పై ఒడ్డుపైకి చేరింది. బామ్మ గారిని సెంది క్షేమంగా బయటకు లాగాడు. దూరంగా ఇదంతా చూస్తున్న బాల సరస్వతి గారు ఊపిరి పీల్చుకున్నారు.
బాల సరస్వతి ద్వారా విషయం తెలుసుకున్న రాజనాల సెందికి కృతజ్ఞతలు చెప్పి తన CA ఫైనల్ పరీక్షలు ఫస్టు క్లాసులో పాస్ అయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తన మాగాణి వాళ్ళకి అప్పజెప్తానని ప్రమాణం చేశాడు .
పెళ్ళికి ఇంకొక వారం రోజులుందనగా….

వరి పైరు గాలి వాటానికి కొండపల్లి బొమ్మలా కదులుతోంది. పొలం మధ్యలో పదడుగుల ఎత్తున వెచ్చటి గడ్డిపై ధవళ వర్ణ దుప్పటితో అమరిన మంచె సేద తీరుస్తోంది, వివిధ భారతిలో వస్తున్న జార్జ్ మైఖేల్ కేర్లెస్ విస్పర్ పాట వీనుల విందు చేస్తోంది. నీలవేణి ఒళ్ళో తల పెట్టుకుని తను చుట్టిచ్చిన చిలకలు తింటూ అధరాలు పండించుకున్నారు..ఇద్దరు.
( డ్రోన్ కెమెరా మంచె నుంచి దూరంగా జూమ్ అవుట్ షాట్ తీసింది ).

కథ కంచికి మనం నిచ్చెన కిందికి. మళ్ళీ కలుద్దాం.
అంత వరకు,
సే-లవ్.