నిన్నటి నుంచీ ఒక్క రవ్వ నడుం నొప్పి! అయినా నా 4 కిమీ మార్నింగ్ వాక్ చేశాను అనుకోండి. ఎందుకంటే నాది సైనికుడి డిసిప్లిన్. నడుం నొప్పని సైనికుడు మార్నింగ్ డ్రిల్ కి డుమ్మా కొడతాడా? కొట్టడు. నేను సేమ్ పించ్!
ఇవాళ కాస్త మాములు మనిషినవ్వాలని వంటింట్లోకెళ్ళి “తప్పుకో మా అమ్మకి చుక్కకూర పచ్చడి చేయమంది. చేసి పారేస్తా” అన్నా
మా ఆవిడ “ఓవర్ ఆక్షన్ చేయకండి. అసలే నడుం నొప్పి అంటున్నారు. వెళ్లి రెస్ట్ తీసుకోండి. లేకపోతే ఉన్నాయిగా టీవీ నిండా చెత్త వెబ్ సిరీస్! వెళ్లి అవి చూసుకోండి” అంది
నేను “హై ఫీవర్ తో సచిన్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. అతనే నా ఇన్స్పిరేషన్. తప్పుకో” అని ఈ హైదరాబాద్ వాతావరణానికి ఒకింత గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినా అలాగే పోయిన గొంతుతో గొంతు చించుకు అరిచా.
మా ఆవిడ చలిస్తేనా? “సచిన్ వయసులో ఉన్నప్పుడు అలా ఆడాడు. మీలా సీనియర్ సిటిజెన్ అయ్యాక కాదు” అని ఓ లా పాయింట్ లాగింది.
(రామాయణంలో పిడకల వేట: అసలు లాయర్లలో ఆడవాళ్లు ఎందుకు ఎక్కువ ఉండరు. వాళ్ళు లాగినన్ని, పీకినన్ని లా పాయింట్లు ఇంకెవరూ పీకలేరు కదా?)
నాకో సందేహం. సచిన్ అలా హై ఫీవర్ తో క్రికెట్ మ్యాచ్ ఆడుతూంటే వాళ్ళావిడ అభ్యంతరం చెప్పలేదా? అసలు ఫీవర్ ఉన్నట్టు ఆవిడకి తెలుసా? తెలిసి, చెప్పినా సచిన్ ఆమె మాటని తోసి పుచ్చి మ్యాచ్ ఆడాడా? చరిత్రలో ఇలాంటి ఇంపార్టెంట్ చిన్న చిన్న పాయింట్స్ రాయకపోవడంతో నాబోటి వాడికి అలాంటి ప్రఖ్యాత ప్రముఖుల్ని ప్రేరణగా తీసుకుని అలా ఆ విధంగా ముందుకి వెళ్లే సదవకాశాలు ఉండవు.
ఇదేటిది? మనం ప్రముఖుల్ని గురించి, విని, చదివి, వీడియోలు చూసిన వెంటనే తర్వాత వచ్చిన మొట్టమొదటి అవకాశం వాళ్ళ ఇన్స్పిరేషన్ తో చేసేస్తాం కదా? చెయ్యాలి కదా? కానీ మా ఆవిడ థియరీ ప్రకారం KFC ఓనర్ (ఆయన పేరేంటో? అయినా ప్రేరణకి పేరుతొ ఏం పని లెండి!) తన 65 ఏట KFC స్టార్ట్ చేసాడు కాబట్టి మనకి చిన్న వయసులో ఏదన్నా వ్యాపారం మొదలెట్టాలన్న ఇన్స్పిరేషన్ వచ్చినా 65 ఏళ్ళు వచ్చేదాకా ఆగాలన్న మాట!
నాకస్సలు నచ్చలేదు ఈ థియరీ!
కానీ ఇంట్లో పురుషుడికి కనీస హక్కులే ఉంటాయి. ఏతా వాతా వంటింటి సర్వ హక్కులు ఆడవాళ్లవే కాబట్టి ఈ పూటకి నాకు వంటింటి ప్రవేశం నిషిద్ధం!
నేనేదో ఇలా నడుం నొప్పితో వంట చేసి నా జీవిత చరిత్రలో ఏదో ఒక చాప్టర్ చివర ఓ చిన్ని బాక్స్ లో ఇలాంటి టిడ్ బిట్స్ పెట్టుకునే ఓ మహత్తర అవకాశం పోగొట్టుకున్నా!
ఐ డోంట్ లైక్ ఇట్ యార్!
