స్విగ్గీ డెలివరీ బాయ్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఇంకా… యమలోకంలోని యమకింకరులకి ఒక పోలిక ఉంది. వీళ్ళల్లో ఎవరికీ యూనియన్లు లేవు. రేపు జీతాలు పెంచటానికి బదులు తగ్గించినా, లేదా అసలు ఉద్యోగాలే పోయినా అడిగేవాడు లేడు. సరే, మిగతావారి సంగతి పక్కనపెట్టి IT/KPO రంగం లోని ఉద్యోగుల గురించే కాసేపు మాట్లాడుకుందాం. అసలు వీళ్ళ బాగోగుల గురించి సమాజం, ప్రభుత్వం ఆలోచించాలా వద్దా అన్నది ప్రశ్న. దేశం మొత్తంలో సుమారు 2-3 కోట్ల మంది ఈ రంగం లో ఉద్యోగులుగా, కన్సల్టెంట్స్ గా పని చేస్తున్నారని అంచనా. వీళ్ళందరూ శుభ్రంగా సంపాయించుకోటమే గాక, ప్రధానంగా వీరి మీదే ఆధారపడి ఎన్నో రంగాలు ఎదుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి రియల్ ఎస్టేటు, ఆటోమెబైల్, టూరిజమ్, కన్జూమరిజమ్. మరీముఖ్యంగా ప్రభుత్వానికి వచ్చే డైరెక్ట్ టాక్సుల్లో వీరి వాటా గట్టి గానే ఉంటుంది. అయినప్పటికీ వీరి సాదకబాధకాల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు కనపడదు. ఈ వర్గం వారి కంటే ఎంతో తక్కువ సంఖ్య ఉన్న ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, ఆఖరికి లాయర్లకి కూడా ఆంధ్రా లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవో వరాలు ప్రకటిస్తుంటాయి. ప్రసుత భారత ఆర్ధిక రంగానికి ఉన్న చోదకశక్తుల్లో ఒకటైన IT/KPO రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకి ప్రభుత్వాలు ఏమేమి చేయొచ్చో ఒకసారి ఆలోచిద్దాం.
ఈ రంగంలో ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగ సంఘాలని రిజిస్టర్ చేయాలని, అలాగే Performance ఆధారంగా కాక వేరే కారణాలతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులని తీసి వేయాలనుకున్నప్పుడు గానీ, ప్రతి సంవత్సరం వేతన విధానం నిర్ణయించేటప్పుడు గానీ ఉద్యోగ సంఘాలతో పారదర్శకంగా చర్చించాలని ప్రభుత్వం నిర్దేశించాలి. ఇలాంటి చట్టాలకి భయపడి కంపెనీలు పారిపోతేనో? ఇలాంటి పద్ధతులే బాంకింగ్, ఇన్సూరెన్స్, ఆటోమొబైల్ రంగాల్లో ఉన్నాయి, మరి విదేశీ కంపెనీలు ఆ రంగాల్లోంచి పారిపోలేదేం? నిజం చెప్పాలంటే IT, KPO రంగాల్లో ఎక్కువ శాతం కంపెనీలు – ముఖ్యంగా విదేశీ కంపెనీలు – ఉద్యోగుల పట్ల చాలా మానవీయంగానే వ్యవహరిస్తాయి, ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులని తొలగించినప్పుడు పరిహారం కూడా బాగానే ముట్టజెపుతాయి. కానీ ఈ నిర్ణయాలు అన్ని కంపెనీల్లోనూ మానవీయంగా ఉండవు. పారదర్శకంగా ఐతే అస్సలుండవు. అందుకే ఈ విషయాల గురించి మనం పత్రికల్లో ఊహాగానాలు, సోషల్ మీడియాలో బాధిత ఉద్యోగుల ఆర్తనాదాలు మాత్రమే చూస్తుంటాం. కంపెనీ యాజమాన్యాలు పొడిపొడిగా ఏదొకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకే చట్టాల అవసరముంది. చాలా సార్లు ఈ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు స్టాక్ మార్కెట్లని సంతృప్తి పరచటానికి చేస్తుంటారు. ఏ సంవత్సరమైనా కంపెనీ అభివృద్ది రేటు కుంటుపడిందనుకోండి, స్టాక్ మార్కెట్లని సంతృప్తి పరచాలంటే సులభమైన ఉపాయం ఖర్చులు తగ్గిస్తున్నట్టూ, కొత్త టెక్నాలజీలు కొత్త మార్కెట్లమీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టూ చూపించటమే. ఖర్చులు తగ్గించటానికి దాదాపు ప్రతిసారి కంపెనీలు ఎంచుకునే మార్గం ఉద్యోగాల్లో కోత విధించటం. ఒక వ్యాపార సంస్ధ విధానాల్ని ప్రణాళికల్నీ ప్రభుత్వం కట్టడి చేయాలని ఎవరూ కోరుకోరు కానీ, ఉద్యోగులు ప్రభావితం అయ్యే నిర్ణయాలు మానవీయంగా, పారదర్శకంగా ఉండేలా చట్టాలుండటం మంచిదే .
చట్టాలు చేయటమే కాదు, ఈ రంగంలోని ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఇంకా చాలా చేయాలి. ఒక స్థాయి దాటి ఆదాయపు పన్ను కడుతున్న వ్యక్తెవరైనా ఉద్యోగం కోల్పోతే గరిష్టంగా ఆరు నెలల పాటు ప్రభుత్వం నిరుద్యోగభృతి కల్పించాలి. ఆ నిరుద్యోగభృతి ఆ వ్యక్తి గత సంవత్సర కాలంలో కట్టిన ఆదాయపు పన్ను నెలసరి సగటుతో సమానంగా ఉండాలి. ఆ డబ్బు కనీసం ఈఎమ్మైలు కట్టుకోటానికైనా పనికొస్తుంది. ఆ వ్యక్తి ఉద్యోగం ఎప్పుడు కోల్పోయాడు, ఎప్పుడు కొత్త ఉద్యోగం లభించిందీ అనే విషయం అతని పీఎఫ్ ఎకౌంట్లో డిపాజిట్లని బట్టి ప్రభుత్వం తెలుసుకోవచ్చు.
ఉద్యోగ భద్రత తో సమానంగా IT/KPO రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులని ప్రతిరోజూ కలవరపెట్టేవి: కాలుష్యపూరితమైన నీరూ గాలీ, అధ్వాన్నమైన రోడ్లు, కుంటుతూ నడిచే ప్రజా రవాణా వ్యవస్థ, రోజురోజుకీ ఖరీదౌతున్న విద్య-వైద్యం. ఈ బాధ్యతల్లో ఎక్కువ శాతం స్థానిక ప్రభుత్వాలకి బదిలీ చేసి, వారికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో సరిపోయినంత శాతం బదలాయిస్తే జవాబుదారీ తనం పెరుగుతుంది. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? బాధితులే. ఎప్పుడూ కులం, మతం లాంటి అంశాల ఆధారంగా రాజకీయ పార్టీలకి మీ వోట్లు, డబ్బు, సమయం సమర్పించుకోటం తగ్గించుకుని అన్ని పార్టీలని, ముఖ్యంగా మీరు అభిమానించే పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించండి లేదా అభ్యర్థించండి ఈ క్రింది అంశాల మీద
- knowledge based industries లో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం పార్టీకి ఒక అనుబంధ సంస్థ ఏర్పాటు చేసి ఈ రంగంలో ఉద్యోగ భద్రత, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో పాలుపంచుకునే అవకాశమివ్వటం
- స్థానిక సంస్థలకి ఎక్కువ బాధ్యతలని, పన్నుల ఆదాయాన్నిబదిలీ చేయటం
మనం కోరుకున్నవన్నీ లభించకపోవచ్చు, కానీ తరచూ అడగటం గట్టిగా అడగటం చెయ్యాలికదా. ఇవి మీరే అడగాలి. వేరే రంగాల్లోని కార్మిక సంఘాలో, రైతు సంఘాలో, కుల సంఘాలో అడగవు.

EVV సినిమాలా మీ శీర్షికలు కూడా ప్రత్యకంగా ఉంటాయి 🙂
సందర్భోచితంగా మంచి అంశం స్పృశించారు. అసలే ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడుతున్న నేటి ఐటీ జనాలకి కావాల్సినవి, అడగాల్సినవి బా చెప్పారు. ఇప్పటికీ ఐటీలో అసోసియేషన్స్ పెట్టుకోవచ్చు ఎవరూ నిషేధించలేదు లేదా అవకాశం లేకపోలేదు. కాకపోతే మాములుగా కార్మిక వర్గాల్లో ఉన్నట్టు ఇక్కడ ఎవరూ ఏళ్లకెళ్లు ఉండిపోరు.. ఉన్నవారు లేకపోలేదుకాని, అవకాశం వస్తే కంపెనీలు ఎక్కువగా మారతారు కదా.. అలా ఒక అసోసియేషన్ రిజిస్టర్ చేసి ఒక కార్యవర్గం ఏర్పాటు చేయడం కొంచం క్లిష్టం అవ్వొచ్చేమో. ఓకే స్థాయి వాళ్లందరికీ ఒకే రకమైన జీతాలు ఉంటాయనికూడా లేదు. అందరూ ఒక సంఘంలో సభ్యులన్న భావన రావడానికి.. కంపెనీల బయట ఐటీ అసోసియేషన్లు లేకపోలేదు అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాయి. కానీ ఒక ఉద్యోగి సమస్య నెట్టికెత్తుకునేవి కాదు. మోడరన్ ఎకానమీలో ఇదొక సమస్య. సంఘటితం అవడానికి ఉన్న అడ్డంకులు. పోనీ బలవంతంగా ఎవరూ ఏర్పాటు చేయలేరు. కంపెనీలు విచ్చలవిగా ఉద్యోగాలిచ్చి అంతే విచ్చలవిడిగా తీసేయడం వాటిలో పారదర్శకత లోపించడం సాధారణం అయిపోయింది. ఈమధ్య అమెరికా కేంద్రంగా పనిచేసే ఒక పెద్ద సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులని 20% వరకు తొలగించింది అని ఒక అంచనా. ఎందుకు, ఏమిటి, ఎవరినీ, ఎలా, అన్న సూత్రంలేదు. ఎక్కువజీతమైతే లేదా స్టాక్ ఆప్షన్స్ ఎక్కువుండి అవి మెచ్యూరిటీకి వస్తుంటే ఇలా ఎలాపడితే అలా పీకేశారు. కొన్నిరోజుల్లో వాళ్లు తర్వాత చేసుకున్న AI ఒప్పందాలకి స్టాక్ మార్కెట్లో వాటి షేర్లు అడ్డేలేనట్టు పైకి పాకాయి. దాని యజమాని ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మీరు చెప్పినదానికి కళ్ళకు కట్టినట్టు కనిపించే ఉదాహరణ. లిస్టెడ్ కంపెనీలే ఇలా ఉంటే అన్లిస్టెడ్ ఐతే ఇక చెప్పక్కర్లేదు.. ఉద్యోగభద్రత ఒక మాయ.. కంపెనీలు ఇలా చేయకూడదని ఎవరు పూనుకున్నా అదొక వ్యాపార వ్యతిరేక నిర్ణయం అని, ఉన్న స్క్వీజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మరొక అస్త్రం ఇచ్చినట్టవుద్ది. ఇవన్నీ బాగా చర్చ జరగాల్సిన అంశాలు. ఉద్యోగాలివ్వడానికి ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తున్నారో పీకనప్పుడుకుడా రివర్స్ ఇన్సెంటివ్ ఉండాలి. అప్పుడుకానీ ఒక దారిలోకి రారేమో.
ఒక్క మాట మాత్రం పోరాడాల్సిందే.. లక్షలు లక్షలు ట్యాక్సులు కట్టినవాళ్లకి ఉద్యోగం పోతే అసలు మాకు సంబంధం లేదు అన్నవిధంగా గవర్నమెంట్లు ఉండడం సరికాదు. ఉద్యోగం పోయి సీవరెన్స్ పాకేజ్ వస్తే ఆ సివిరెన్స్ ప్యాకేజీలో అయినా టాక్స్ కట్ చేయకుండా ఉండడం. ఒక వేళ వెంటనే ఉద్యోగమొస్తే అప్పుడు టాక్స్ కట్టడం. లేదా ఉద్యోగం వచ్చే వరకు కట్టిన టాక్స్లో కొంత శాతం ఆ వ్యక్తి ఉద్యోగ భద్రతకు పనికొచ్చేలా ఏదైనా చేయడం జరగాలి. కట్టిన టాక్సులకు తగ్గట్టు సదుపాయాల కల్పన సంతృంప్తికరంగా లేకపోయినా ఇలాంటివి కొంత ఊరటనిస్తాయి. సంఘటితం అయ్యి గట్టిగా అడగాలి. ఇప్పట్నుంచి అడిగితే ఒక దశాబ్ధానికోకాని ఒక నిర్ణయం రాకపోదు..
మీ కామెంట్ చాలా వివరంగా అర్ధవంతంగా ఉంది. ఆ సెక్టార్ లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఇలాంటి చర్చ లేవదీయలన్నదే నా ఉద్దేశం. ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ఈ వర్గంవారి సమస్యలని ప్రస్తావించే రోజు రావాలని కోరుకుందాం.