మీరేంటో.. మీ విధానాలేంటో..
“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రావు రమేష్ అంటాడు గుర్తొచ్చుంటది మీకు. ఒక పద్ధతి, ఒక విజన్ అంటూ తన పక్కన కూర్చున్న వాళ్ళ వైపు చూపిస్తూ మహేష్ బాబుని ఎద్దేవా చేసి మాట్లాడతాడు. తను మాట్లాడుతుంది core values గురించి కావొచ్చు (అనగా మౌలిక విలువలు అనొచ్చోమో తెలుగులో). మీరెప్పుడైనా ఆలోచించారా, మీ core values ఏమిటి అని? మీకు “నచ్చే” values కాదు. ఉదాహరణకి మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల ఆదరణ చూపించే గుణం వేరేవారిలో చూసినప్పుడు మీకు ముచ్చటేయొచ్చు, కానీ మీరు స్వతహాగా అలా ప్రవర్తించకపోవచ్చు. అది మీ మూల స్వభావం కాకపోవచ్చు.
మీరు గమనించినా, గమనించక పోయినా మీ నడవడికని, మీ నిర్ణయాలని నిర్దేశించేవి మీ core values. మీ కుటుంబ నేపధ్యం, పెరిగిన పరిస్థితులు, ఎవరితో ఎక్కువ కలిసి తిరిగారో ఆ వ్యక్తుల ప్రభావం వీటన్నిటి మీద ఆధారపడి బలపడతాయి core values, కాలక్రమేణా అవి మార్పు చెందే అవకాశం కూడా ఉంది. మన నైజంలో మనకున్న మిగతా గుణాలకంటే dominating గా ఉండేవే Core values. మనిషి మనిషికీ మారుతూ ఉంటాయి. ఒక పార్టీ పట్ల లేదా తన కుటుంబం పట్ల loyalty అనేది Core value గా ఉన్న వాడు తన నేత లేదా కుటుంబ పెద్ద ఎన్ని తప్పులు చేసినా సమర్థించుకుంటూనే ఉంటాడు. అలా కాకుండా Fairness అనేది core value గా ఉన్నవాడు అలా సమర్ధించే ప్రయత్నం చేయడు. అలాగే Fidelity, అంటే జీవిత భాగస్వామి పట్ల faithful ఉండటం కొంతమందికి core value కాదు. దాన్ని dominate చేసే value ఇంకేదో వాళ్ళలో ఉండొచ్చు (Hedonism?).
మనకి అస్సలు నచ్చని రాజకీయ నాయకుడినో, సెలబ్రిటీనో అమితంగా ఆరాధించేవాళ్ళు మనకి సోషల్ మీడియాలో తారసపడినప్పుడు మనకి అనిపిస్తుంది..నాకు కనిపిస్తున్న, అర్థమౌతున్న విషయాలు వీరికి కనిపించటం లేదా, అర్ధం చేసుకోలేకపోతున్నారా అని. It’s just that their core values or what they value in a leader or a celeb are probably different from yours.
సరే, మీరెప్పుడైనా మీ core values ఏమిటి అని ప్రశ్నించుకున్నారా? అవేంటో కనుగొనే ప్రయత్నం చేశారా? మీరు ఇంటర్నెట్ లో వెతికితే చాలా పద్ధతులు దొరుకుతాయి ఈ ప్రయత్నానికి. నేనొక సులభమైన పద్ధతి చెప్తాను. మూడే మూడు ప్రశ్నలు వేసుకోండి.
- సాధారణంగా మీకు ఇతరులలో నచ్చని గుణాలేంటి? ఆ గుణాలకి పూర్తివ్యతిరేకమైన గుణాలే మీ మౌలిక విలువల్లో ఉండొచ్చు. ఉదాహరణకి, పంక్చువాలిటీ అంటే సమయ పాలన.
- మీకూ మీ మిత్రులకీ మధ్య ఎక్కువగా కలిసే గుణాలేంటి? ఉదాహరణకి కుటుంబానికి ఎక్కువ విలువివ్వటం
- ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు – కారు గానీ ఇల్లు గానీ కొన్నప్పుడు, లేదా చదువులో, కెరీర్లో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఏ లక్షణాలకి పెద్దపీటవేస్తారు – మీ హోదా పెంచేవిధంగా ఉండే వాటికా, సాధ్యమైనంత తక్కువలో ఐపోయే వాటికా, మీ కుటుంబసభ్యులకి ఎక్కువ నచ్చిన వాటికా?
ఈ ప్రశ్నలగురించి తీక్షణంగా ఆలోచిస్తున్నపుడు మీకు అనిపించిన 3 నుంచి 5 దాకా గుణాలని లేదా విలువలని ఒక చోట వ్రాసిపెట్టుకుని, కొద్ది రోజుల పాటు మీ నడవడికతో మీరు తీసుకుంటున్న నిర్ణయాలతో బేరీజు వేసుకోండి.
అసలిదంతా ఎందుకు? ఎందుకంటే మీ గురించి మీకు సరిగ్గా తెలిస్తే, మీరు ఇకనుంచి తీసుకునే నిర్ణయాలు మరీ ఎక్కువసేపు ఆలోచించకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ నిర్ణయాలు మీ మౌలిక విలువలకు లోబడే ఉన్నాయని, ఆ తర్వాత చింతించరని మీకు నమ్మకమొచ్చింది కాబట్టి. అలాగే ఇతరుల ప్రవర్తన, వారి నిర్ణయాలు ఒకవేళ నచ్చకపోయినా వారి దృక్కోణం నుంచి చూసే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వారి మౌలిక విలువలు ఆ నిర్ణయాలకి దోహదం చేసుండొచ్చని మీకు అర్ధమయింది కాబట్టి.
