భాషాకుమారుడి స్వగతం

చేతులతో తన ముఖాన్ని మూసిన వెంటనే ఉన్నట్టుండి మాయమైపోయిందనీ, “బుయ్” అంటూ చేతులు తీసిన వెంటనే ఎలానో తిరిగి ఎదుటన ప్రత్యక్షమైందనీ అమ్మకేసి ఇంతింత చేసుకున్న లేతకళ్లతో చూస్తుండిపోయే ఆశ్చర్యానందాల పాలపాపాయిగా ఉన్నప్పుడే తెలుగు భాష మనల్ని పలుకరించింది. అప్పుడు చెవులతో కాదు, గుండెతో తెలుగును విన్నాం, అమ్మ నోటితో ఏదో చప్పుడు చేస్తోందని అనుకుంటూ. సహజశక్తులు మనలో పేరుకోవడం మొదలై, మనోబుద్ధ్యహంకారాలు విచ్చి, ఒక జీవగ్రంథి ఏర్పడి, తయారైన ముఖయంత్రంతో తెలుగును లలితలలితంగా పలికాం. ఒక్కో మాటనూ నేర్చుకుంటూ గర్వం పొంగులువారిన శుభ్రానందంలో ఓలలాడాం. ఎదుగుతూ ఎదుగుతూ “ఈ బొమ్మ నాది”, “నేను రాను”, “ఇక్కడేదో దెబ్బ తగిలింది”, “కడుపు నెప్పిగా ఉంది”, “పరవాన్నం కావాలి” అని అంటూ లోపలే సుళ్లు తిరుగుతూ ఉండే ప్రాణచైతన్యాన్ని వెలిపెట్టుకోగలిగాం. బంధువుల్ని గుర్తుపట్టాం, కేకవేసాం. మొత్తంగా చెప్పాలంటే బ్రతికాం. మన ఇంటిలో మనకు పరిచయమైన తొలిచెలిమి తెలుగు. మనిషిగా జన్మనెత్తిన తరువాత మనకు లభించిన మొట్టమొదటి గొప్ప సిద్ధి భాషాసాక్షాత్కారం అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది నాకు.

పిక్కలను వణికించే భయం కలిగినపుడూ, నూరేళ్ల కలలన్నీ ప్రియుడిగానో ప్రియురాలిగానో ఎదురుగా రూపుకట్టినపుడూ, సప్తవర్ణాల శక్రచాపం ఆకాశంలో విప్పారినపుడూ, మన పాదముద్రలను సముద్రుడనే పెద్దమనిషి తన అలల కండువాతో లోపలికి లాక్కున్నపుడూ, ఆత్మబంధువు హఠాత్తుగా కాలం చేసినపుడూ, ఉషఃకాలపు సువర్ణకాంతికణాలు లోని అచేతనత్వాన్ని ముక్కలు చేస్తున్నపుడూ, అనేకరకాల కష్టాలు పడీ పడీ అనుకున్న లక్ష్యానికి చేరుకున్నపుడూ, నమ్మినవారే మోసం చేసినపుడూ, లాభనష్టాలు సంభవించినపుడూ ఇలా జీవితంలో ఏ అనుభూతి ఎదురైనా నోరు పెగలని సందర్భం ఉన్నదేమో కానీ, మనసులో తెలుగు పెగలని సందర్భం లేదు. ఎదుటివారితో మాటలాడనప్పుడు కూడా మనతో మనం మాటలాడుకుంటూనే ఉన్నాం. సన్నివేశాల్ని, ప్రశ్నల్ని, పురాస్మృతులనీ బయటో లోపలో – తెలుగులో అల్లుకుంటూనే ఉన్నాం. దేవతలనూ, దెయ్యాలనూ తెలుగులోనే పోల్చుకున్నాం.  చివరికి అవసరం కొద్దీ వేరే భాషను నేర్చుకునేందుకు కూడా తెలుగుభాషామతల్లినే ఉపయోగించుకున్నాం. తెలివితో ఆమె శరీరాన్ని కోసినా, ఆమెపై రకరకాల ముద్రలు వేసినా, పిడిగుద్దులతో ఆమె అంగాల ఆకారాలను మార్చినా, ఆమెను పూర్తిగా విడిచిపెట్టినా ఆమె మనలను పొదువుకోవడం మానింది లేదు. కించిత్తు విలువనీయకుండా దిగజార్చినపుడు కూడా కినుక వహించి, “ఇకపై నేను నీకు అర్థం కాను” అని తెలుగు మనతో ఒక్కసారీ అన్నది లేదు, మనలను నిరాశపరిచిందీ లేదు. ఆమె సన్నిధిలో ఎప్పుడూ అదే ఊర్జ, అదే ఆర్జవం. కేవలం ఈ నేలమీద, ఈ సంస్కృతిలో పుట్టామన్న ఒకే ఒక కారణంతో లవలేశం ప్రతిఫలం ఆశించకుండా మన జీవంతో పెనవేసుకున్న ఆప్తురాలు తెలుగు. ఆమె గుండెలోతులను కనుక్కోవడానికి ఏ శక్తి సరిపోతుంది?

మనలను నడిపించే ఊపిరి ఆడడం అలవాటై, సాధారణమైపోయినట్లుగా మన లోపలితనానికి ఒక పరిపూర్ణశబ్దాకృతినిచ్చే తెలుగు ఎంతో జటిలమైన అంతఃప్రవాహమైనా కూడా మామూలైపోయింది. తేలికైపోయింది. ఊపిరి తాలూకు ఉనికినీ, విలువనూ గుర్తు చేయడానికా అన్నట్లు ప్రకృతి ముక్కుదిబ్బడను పెట్టింది మానవుడికి. తెలుగు అలా కూడా మనలను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. నన్ను గమనించకపోయినా నా పిల్లలే కదా అని అనుకునే మాతృహృదయం ఆమెది.

తెలుగులో పుట్టకపోయినా, దూరంనుండి ఈ భాషను చూసి అబ్బురపడినవాళ్లు ఎంతమంది ఉన్నారో, తెలుగులో పుట్టి, ఆ శక్తితో మొలిచిన బుద్ధిరెక్కలతో ఎగిరిపోయి పెడమొహం పెట్టినవారు అంతకన్నా ఎక్కువమందే ఉన్నారనుకుంటాను. సమాజం వ్యక్తులకు వారి వారి అవసరాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని నేర్పడంలో ఇబ్బంది లేదు కానీ, ఆ దృష్టి నుంచి బెసగనీయకుండా బంధించడం అవాంఛనీయం అని నా ఊహ. తెలుగుభాష అంతస్సౌందర్యాన్ని గమనించి అది ఎన్నెన్ని విధాలుగా, ఎన్నెన్ని ప్రాంతాలలో, ఎన్నెన్ని జాతులలో, ఎందరెందరు జీవితాలలో వ్యాపించి ఉందో అన్నదాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన చూపు లభించడం నేటి కాలలో గగనమైపోయింది.

గ్రాంథికంగా, వ్యావహారికంగా, మాండలికాలుగా, యాసలుగా అనేకరకాలుగా వ్యాపించి ప్రతీ తెలుగుజీవితాన్నీ వెలిగించే తెలుగును ప్రేమించడానికి ఉద్యమాల పెనుగులాటలు తప్ప మరొక దారికేసి చూడలేని చిత్రమైన పరిస్థితి నేటికీ కొనసాగుతూనే ఉంది. మనకన్నా పెద్దవస్తువును ప్రేమించడం మనకెప్పుడూ చిక్కే. అయినా దానిని ఒప్పుకోని అహంకారం మనది. ప్రేమలోకి ప్రశ్నలను చొప్పించి దానిని సమూలంగా నాశనం చేసుకోవడం మనిషికి వెన్నతో పెట్టిన విద్య. “మనిద్దరి భాషాభేదాలలో ఏది పాతది? దేనికి గుర్తింపు ఉంది? నాది కాని నీ మాండలికంలో ఏ లోపాలు ఉన్నాయి? గొప్పతనం నిర్వచనం తెలుసా?” లాంటివే భాషాభిమానానికి తూనికరాళ్లుగా మారాయి. తెలుగు చుట్టూ చేరి తమ జీవితాలను పరిమళింపచేసుకున్న పూర్వీకులకు ఇటువంటి ప్రశ్నలు వేయడం చేతకాక కాదు, అవి నిస్సారమైనవని గ్రహించి మిన్నకున్నారేమో. నేటి పరిస్థితుల దృష్ట్యా “నా భాష ఎటువంటిదైనా నాకు గొప్ప” అనే మొండితనమే తెలుగువారికి ప్రాథమికంగా కావలసింది అనుకుంటాను. కారణాల పునాదులపై కన్నా కూడా అకారణంగా వెలసిన ప్రేమసౌధమే పటిష్ఠమైనది.

సహజత్వాన్ని వీడి, కృత్రిమతకు దగ్గరగా జరుగుతున్న మనం భాష కూడా కృత్రిమతలోకి పరావర్తించినపుడు మాత్రమే దానికి భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతున్నాం. కృత్రిమ ప్రపంచంలోనూ, నిర్జీవప్రపంచంలోనూ ఒక అవసరం, ఒక స్థానం తెలుగుకు ఏర్పడకుంటే దాని ఉనికికి ప్రమాదమని అనుకుంటున్నాం. ఈ హర్షణీయ ప్రయత్నాల వలన తెలుగు తప్పకుండా ఒక కొత్తపుంత తొక్కుతుంది. తెలుగు ఆయా చోటులలో మిగిలి ఉంటుంది కూడా.

అనేకరకాల ప్రవృత్తుల మిశ్రణమైన ప్రపంచంలోకి అర్థవంతమైన శబ్దాలున్న ఒక భాషగా తెలుగు వెలికి వస్తూ అగుపిస్తూ ఉంటుంది. ఇది దాని చరమావరణం. దాని అసలు శక్తి మన చేయి పట్టుకొని జాతి ఉనికికి దగ్గరగా, జీవానికి దగ్గరగా తీసుకొని వెళ్లడంలో ఉంది. ఈ అంతరావరణాలను కనుక్కోవాలంటే తెలుగు దగ్గర త్రికరణశుద్ధితో శ్రద్ధగా కూర్చోవడం ఒకటే మార్గం. ఈ “ఉపవాసం” వల్లనే తెలుగుది హృదయసామ్రాజ్యం అని తెలిసివస్తుంది.

ప్రతీదానినీ ఒక సమస్యగా చేసి, అడ్డం-నిలువు కోతలతో సాధించి ఒక సమాధానాన్ని చూపించడమనే చోట తెలుగు ఒక పరికరం. ఒక జడం.  కానీ, వాక్యాలు- పదాలు – అక్షరాలు – వాచ్యార్థం- వ్యంగ్యార్థం- సాంస్కృతికార్థం- తాత్త్వికార్థం- పారమార్థికార్థం – భావనాశక్తి ఇత్యాది ఆవరణలను దాటుకుంటూ పయనింపగలిగితే అక్కడ మన గుండెచప్పుడు అనాహతనాదంగా మనకు వినిపిస్తుంది. ఆ చోట తెలుగు ఒక వెలుగు. ఒక ప్రాకృతికశక్తి. ఆ శక్తిగానే తెలుగు చిన్నతనంలో మనలోకి ప్రవేశించింది. ఇప్పటికీ అలానే ప్రసరిస్తూ ఉంది. అది ఏ మాత్రం గుర్తుకు వచ్చినా దానిని అభిమానించడం, ప్రేమించడం ఒక ప్రత్యేకకర్మగా తోచదు. సహజంగా లోపలనుండి పెల్లుబుకుతుంది. అటువంటి భాషాప్రేమి జీవితానికి ఎల్లలు లేని ఆనందం దొరికి తీరుతుంది.  ఆ ఆనందంలో మన నోటి నుండి నాలుగు తెలుగు మాటలు వెలికి వస్తే, ఆ ఆనందంలో లోకాన్ని చూడగలిగితే, ఆ ఆనందంలో జనించే ఐకమత్యంతో సమాజం ఏర్పడితే, అప్పుడు కన్నతల్లిని చూసిన కళ్లకు ఎదుటివాడి తల్లిని చూడడంలో గజిబిజికి తావుండదు కనుక “ఏది తెలుగు?”, “తెలుగు భాష ఎవరిది?” వంటి హక్కుభుక్తాల ప్రశ్నలు పుట్టవు.

ఆచంద్రతారార్కం తెలుగు భాష వర్థిల్లాలి. ఆమె సెలవినవ్వుల కాంతులలో మనిషికి దారిచీకట్లు తొలగాలి.

1

తొలితొలి తెల్విలోఁ జవిని దూసి బయల్వడఁ జేయలేని యా
మొలకతనాన, మజ్జనని మోమున మాటగ గోచరించి, లేఁ
జలువను హార్దకుడ్యములఁ జక్కన హత్తి ఫలించినట్టి నా
జిలిబిలి తెల్గుభాష బిగిచేవ నరమ్ములఁ బ్రాకిపోయెడున్.

2

ఏ నియమమ్ము లేని, తపమింతయుఁ జేయగ లేని, నోటితో
నైనను ‘రాగదమ్మ’ యని ప్రార్థనగా బ్రతిమాలలేని నా
ప్రాణపుఁ దీరుఁ జూచి, కృప పాఱెడు గుండియతోఁ జలించి, నన్
బూనిన తెల్గుశక్తి యెదమూలలదాఁక వెలింగిపోయెడున్.

3

ధమనీసంహతిలోఁ దెలుంగు జవముత్థానమ్ములం దేర, కం
ఠము పొంకించి, తెగించి, లేచి, ఘనఘంటామార్గకేంద్రాల ప
ద్యములన్ బాడి మరొక్కమారున నవాంధ్రాంతఃప్రజాకోటి క
ర్ణములండాగిన త్రుప్పు చిట్లి జలజల్లన్ రాలఁగాఁ జేయనే!

4

గొప్ప మరచి తిరుగు తెనుఁగుసింగమ్ము తనను కనుఁగొను దర్పణము నేను
ఆంధ్రీఘనాఽఽచరితానర్ఘమణిని లోదాచిన మంచి మందసము నేను
నవనవీన కవితా నవనీతదోహనీశ్రితియగు పద్యాలశిక్య నేను
భాషాలతాతన్వి ఫాలనామము దిద్ద వెట్టిన పాటీరపేటి నేను

తెలుఁగు మెదడులలో దూరి తెలుఁగు పదము
లను పదేపదే పంపిణీ పొనరుచు నిర
తంపు సత్త్వశక్తిని నేను; తారకాంత
సితపరాగముఁ జేగొన్న ధృతిని నేను.

5

నేను పదముల యల్లికను! నవ భావ
తతుల పొందిక నేనే! కవితను వ్రాయు
నపుడు కవి కావ్యధార, వ్రాయనపుడతని
లలితహృదిలోని వహ్నికుధ్రమును నేను.

6

వెలుపలి వైపుగా బ్రతుకువెల్లువ మాటున డాఁగివచ్చి, బు
ద్ధుల నరికట్టుకొన్న పరధోరణిమేచక మెంతదాఁక? నా
కలమును తీసి, యాంధ్రమసికారసపూరణఁ జేసి పద్యముం
జిలికెడునంత దాఁక, యది చేరిన గుండె వెలుంగుదాఁకనే!

7

కృష్ణరాయల దీవ్యదుష్ణీషముపయిని కుచ్చునూపిన నాటి కోడెగాడ్పు
కాకతీకులకాంత కరకాంత విక్రాంత వైభవోపేతాసి వాఁడి వెలుఁగు
ఖడ్గతిక్కన తల్లి కబళమ్ములోఁ గ్రుక్కి యతనికి వెట్టిన యగ్నిధార
పదునారు ప్రాయంపు బాలచంద్రు ప్రతినలోఁ ద్రుళ్లినట్టి వీరోగ్రకళిక

శాతకర్ణి విన్న విజయగీతికలు, క
వుల యెదలలో నెగసిన తడుల తరఁగలు,
పరవళుల గౌతమీ, తుంగభద్ర, కృష్ణ –
నాదు పద్యాన పునరనునాదమవుత.

8

నాటి యాంధ్రుల హృదయాల మేటి గతులు
వారి యుద్ధ, విలాస , శృంగార, యోగ
సాధనా పటిమలు, మనసైన కళలు
నాదు పద్యాన పునరనునాదమవుత.

9

నాఁడు కలదు తెలుగు నేఁడు కలదు; నిర్ధ
న ధనిక జనపాళి నాల్కలందు
నాటివాఁడు తెలుగు నాటించుకొనినాఁడు
నేటివాఁడు తెలుగుమాటవాఁడు.

10

పాడిన పాటలే యనెదవా పెడమోమున? నేటి కాలపున్
బోఁడిమి కీ విధమ్ము సరిపోదని తల్చెదవా సహోదరా!
చేడియ మోము దిద్దుకొను చెన్నులు నేటివి మార్చువేళ, తా
నాఁడది యన్న గుర్తునకు నక్కఁ దీరునె? ప్రాతవోవునే?

11

నాతో రార తెలుంగువాడ! యదిగో, నానామహత్వమ్ములన్
బోతల్వోసిన భవ్యసంస్కృతులతోఁ బొల్పొందె నీజాతి, ఆ
యా తావుల్ నినుఁ జుట్టుముట్టికొననీ! ఆ స్ఫూర్తి నీదై పున
ర్వాతోచ్ఛ్వాసన నంది మేలుకొననీ భాషామహాదేవినిన్.

12

పెక్కు వేల్పుల సేవనప్రీతి కన్న
పదవి, సొమ్ముల వెంట ధావనముకన్న
నీవెవఁడ వన్న సద్యష్టినిర్వహణము,
మాతృభాషార్చనము మేలు, మహితమతిని.

13

తెలుగుఁ దనము నిండిన గుండె కలిగి, తెలుగు
పదముల నొసగిన వెలది వైపు తిరిగి
ఆ పదమ్ములనామెకే అర్చనమిడి
వచ్చెదము, మిత్రుఁడా! నేడు, వడిని రమ్ము.

14

పూర్వప్రజాకోటి పులకించి దిద్దిన ఘనచరిత్రలు తిలకంపు బొట్టు
సర్వంసహాదేవి సర్వోపదీప్తుల పాఁడిపంటలు మేని పట్టుచీర
సంగీతసాహిత్యసౌజన్యశైలులు చేలాంచలాగతచిత్రసృష్టి
తనవారు గుండెతోఁ దనను నోరాడుట లామె మోమున విచ్చు ప్రేమనగవు

భావిజాతి నడతలు నవమణిబద్ధ
ఖచిత సింఘాసనమ్ము, యే కల్మషంబు
లేని హృదయములు తొడవులైనయట్టి
తెలుగు యలివేణి! మా రాణి! లలితపాణి!

15

నీ కొనగోరు మానికపు నీడన నాదు శిరమ్ము వాల్చి,నీ
సోకుకు తళ్కుటద్దముగ సొక్కిలు నా మన మందజేసి, పూ
రేకనొ, కోకిలమ్మనొ వరించి త్వదీయపదమ్ములం మధూ
ద్రేకత పాడు కోరికను తీర్చిన చాలు, తెలుంగు భారతీ!

*

3

3 Comments Leave a Reply

  1. మహత్తరం!
    ఇంతకంటే ఏం చెప్పాలో తెలియట్లేదు.
    బహు చక్కగా విశదీకరించారు.
    మెల్లగా చదివి జీర్ణించుకోవాల్సిన వాక్యాలు.
    మరొక్క సారి వేల వేల ధన్యవాదాలు.

    తెలుగుఁ దనము నిండిన గుండె కలిగి, తెలుగు
    పదములనొసగిన వెలది వైపు తిరిగి
    ఆ పదమ్ములనామెకే అర్చనమిడి
    వచ్చెదము, మిత్రుఁడా! నేడు, వడిని రమ్ము.— వాహ్!

  2. కొన్నాళ్ళక్రితం, భారతదేశం వెలుపల ఉండిపోయిన కొందరు తెలుగువారు ఓచోట కూడి, వారిదే అసలుతెలుగుని, భారతదేశంలో తెలుగు అన్యభాషా పదాల కలయికతో మారిందని అన్నారని వార్త చదివాను. ఈ “నా తెలుగే అసలు తెలుగ”ను వాదనలు, ఇద్దరు తెలుగువారు ఎదురైతే ఆంగ్లంలో పలరించుకుని మాట్లాడుకోడమంత సహజం 🤓🤓.

    ఏ తెలుగైనా నా తెలుగే అని నమ్మిక. ఎన్నిటిని కలుపుకున్నా, ప్రాంతానికో వంపు తిరిగినా, నా తెలుగు గంగ.

Leave a Reply to ఆదిత్య Cancel reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

ఫస్ట్ ఢిల్లీ ట్రిప్

1974 లో నాకు పెళ్ళి అయింది.మా నాన్న గారికి మేడపాడు స్టేషన్ కు

ఆర్ట్స్ కాలేజి కబుర్లు -2

రెండో సంవత్సరం లో అడుగిడిన ఆ రోజుల్లో మా ప్రిన్సిపాల్ మేజర్ నదిముల్లా