దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటేo మనుషులోయ్!! ఇవాళ మన దేశం పుట్టినరోజు. దేశమంటే మనమే కాబట్టి ఇవాళ మనందరి పుట్టినరోజు!
మరంచేత పొద్దున్నే పరకడుపునే ఇక్కడ కాలక్షేపం చెయ్యకుండా అర్జెంటుగా వెళ్లి తలంటు పోసుకోండి! ఆనక శుభాకాంక్షలు గట్రా తీరిగ్గా చెప్పుకుందాం. వీలయితే ఒక స్వీట్ తినండి ఆనందంగా. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా ఓ చిన్ని చాక్లెట్ తినచ్చు!
ఇహ సీనియర్ సిటిజెన్కి ఉండేవి జ్ఞాపకాలే కాబట్టి ఓపాలి రింగులు రింగులు ఫ్లాష్ బ్యాక్!
నా స్కూలాభ్యాసం (ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పెరుగుతుంది. అంచేత ఈ తూరికి ఈ మాట నా కోటాలో వేయండి!) అంతా 60’s లోనే! అప్పట్లో మాకు ఇప్పటి పిల్ల పిడుగులంత తెలివితేటలూ, అపార లోక జ్ఞానం లేవు. బోల్డు అమాయకులం. ఆ వయస్సులో మనకి దేశం స్వాతంత్రము లాంటి పెద్ద పెద్ద మాటలకి అర్ధాలు తెలీకపోయినా పంద్రాగస్టు అంటే సెలవని, ఇస్కూల్ కెళ్తే జెండా ఎగరేసి, జనగణమన పాడించేసి చాక్లేట్లు ఇస్తారని మాత్రమే తెలుసు!
అప్పట్లో ఫుడ్ ఫర్ వర్క్ అని పెద్ద పేరు పెట్టలేదు కానీ ఆ బుజ్జి చాక్లేట్లకి ముందు రోజంతా చిన్ని చిన్ని పిల్లలమనైనా చూడకుండా బోల్డు చాకిరీ చేయించేవాళ్ళు పంతుళ్లు!
ఆ మధ్య ఇలాగే ఏదో రాస్తూ పంతుళ్లు అని రాసినందుకు ఒకాయన తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ఎందుకో నాకిప్పటికీ తెలీదు.
హింతకీ మ్యాటర్ లోకొస్తే ముందు రోజు రంగురంగుల త్రికోణాకారం కాగితాలకి చివర మైదాతో రాసి పెద్ద పురికొసకి అంటించేవాళ్ళం. తదుపరి ఆ తాళ్లని స్కూల్ కాంపౌండ్ అంతా జిగ్ జాగ్ గా, తరగతి గదుల గుమ్మలకి తోరణాల్లా కట్టేవాళ్ళం. తర్వాత జెండా కొయ్యకి కూడా ఆ రంగు కాగితాలు కొయ్య కనిపించకుండా ఈ చివరి నించి ఆ చివరిదాకా అంటించి పైన జెండా కట్టేవాళ్ళం. అప్పటికి ఆ వయసులోనే నడుం పడిపోయినంత పనయ్యేది. కానీ ఏదో భారీగా సాధించిన తృప్తి.
ఈ కార్యక్రమం అంత అయ్యేటప్పటికి సాయంత్రం ఏ నాలుగో అయ్యేది. అప్పుడు ఓసారి స్కూల్ కాంపౌండ్ నాలుగు మూలలకి వెళ్ళి మేము కట్టిన రంగురంగుల తోరణాలని చూసి మాకు మేమే శభాష్ అని సర్టిఫికెట్ ఇచ్చుకొనేవాళ్ళం. ఇప్పటి యూత్ కి అర్ధం అయ్యేలా చెప్పాలంటే బాహుబలి కోట భారీ సెట్ మొత్తం వేసాక రాజమౌళిగారు వచ్చి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని పైనించి కిందకీ, కిందనించి పైకీ, కుడినించి ఎడమకీ, ఎడమనించి కుడికీ చూసి యూనిట్ వాళ్ళ వేపు చూసి వెల్ డన్ బాయ్స్ అనో లేదంటే మోహంలో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టో, మేము కూడా మా పనికి మేమే మురిసిపోయేవాళ్ళం. హై ఫైవ్లు అప్పట్లో తెలీవు లేకపోతే అవిచ్చుకునేవాళ్ళం.
హంత రోజు మొత్తం భారీ చాకిరీకీ చివరికి దక్కేది ఓ చాక్లేట్! కానీ కామ్రేడ్స్ దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికి ఏం ఇచ్చాం అన్నది, అదెవరన్నారో తెలీకపోయినా, అసలు ఎవరో అన్నట్టు కూడా తెలీకపోయినా, మనసా వాచా నమ్మిన మన దేశ భక్తులం అలనాడు!
కాలేజీకి వచ్చాక ఇలా చాకిరీ చేసిన గుర్తు లేదు. గుర్తు లేదంటే చేసామేమో అని మీరు భ్రమ పడాలని. గట్టిగా అడిగితే చేయలేదని బాగా గుర్తుంది. ఎందుకంటే నిక్కర్ల నించి ప్యాంట్లకి ఎదగగానే ఏదో పెద్దమనుషులం అయిపోయిన ఫీలింగ్ మరి. పెద్ద మనుషులు పని చేయరు కదా? అందుకని మేము కూడా పంద్రాగస్టుకి ఎన్నడూ కాలేజీలో ఎలాంటి సేవ చేయలేదని సభా ముఖంగా డిక్లేర్ చేస్తున్నా. చేయని మంచి పనులు చేసినట్టు, చేసిన వెధవ పనులు చేయనట్టు చెప్పుకోవడం మా వంశంలోనే లేదు.
రింగులు రింగుల ఫ్లాష్ బ్యాక్ నించి ఇప్పటి రోజులకొస్తే స్కూల్లో పంద్రాగస్టు చేస్తున్నారు కానీ పిల్లల చేత మేం చేసినట్టు డెకొరేషన్స్ చేయిస్తున్నారా?
ఇహపోతే అందరికీ మన దేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మన దేశంలో ఉన్నంత స్వతంత్రం చాలా దేశాల్లో లేదని మనవి. అంచేత మనం భారతదేశంలో పుట్టినందుకు ఫీల్ గుడ్. అండ్ ఎంజాయ్.

మీ పంద్రాగస్టు ముచ్చట్లు నా బాల్యాన్ని గుర్తు చేశాయి. ధన్యవాదాలు.
పూర్వం గుర్తుకు వచ్చింది. మేము మా school లో రస్‌న్న కలిపాం
చాలా బావుంది ఎప్పటిలాగానే!
హాస్యం రెసిపీలు వండటంలో మీకు మీరే సాటి!
రింగు రింగు మంటు నా చిన్నప్పటి రంగుల లోకానికి వెళ్ళిపోయాను. ఒక్క ఫోటో చాలు ఆ జ్ఞాపకాలు అన్ని పదిలమే, ఇప్పుడు ఎన్ని ఫోటోలు తీసినా ఇంకోటి ఇంకోటి అంటున్నారు
మరీ పొద్దున్నే కాకపోయినా పంద్రాగస్టు నాడే మీ రింగు రింగుల ఫ్లాష్ బ్యాక్ ని అందుకోవడం జరిగింది
స్కూల్లో పంద్రాగస్టు నాడు ముఖ్యంగా గుర్తుకు వచ్చేది నాటికి చాలా ముందుగా కొన్ని రోజుల నించి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ
ఆ నాడు చేసే ‘డ్రిల్ల్’ కార్యక్రమం ..
అంటే అది జనవరి 26 కి కూడా ఉండేది .. మొత్తానికి ఏడాదిలో రెండు మార్లు దాని కోసం ఒక రెండు మూడు వారాలుగా
ప్రాక్టీస్ ఆ తర్వాత నాడు పెద్ద ఫంక్షన్ లో చేసే విషయం గుర్తుకు వచ్చింది