న ఓంఢ్ర గార్ధభ!
“ఓంఢ్ర పెట్టడం మానేస్తున్నాను!” పత్రికా ముఖంగా ప్రకటన చేసింది “న ఓంఢ్ర గార్ధభ”! ఇలా ఒక గార్ధభం ప్రకటన చెయ్యడం మొదటిసారి అవడంతో జనావళిలో కలకలం రేగింది. సహగార్ధభాలన్నీ ఈ నిర్ణయానికి విస్తుబోయాయి. కొన్ని యుగాలుగా ఇటువంటి వైపరీత్యం ఎరుగని జంతుజాలం అంతా కలిసి అసలు ఈ విషయం అంతు చూడాలని బయలుదేరాయి.
ఒక పెద్ద మైదానంలో సభ కొలువు తీరారు. సభావేదిక మీద, “నఓంఢ్ర ప్రతిజ్ఞా పాలన చేస్తున్న గార్ధభం గారు ” మాత్రమే ఉన్నారు. ఎదురుగా ఎడమ ప్రక్క స్వజాతి గుంపు, కుడి ప్రక్కగా నానాజాతుల సంఘటిత గుంపులు కూడి ఉన్నారు. స్వజాతి గుంపు ఆతృత గా ఎదురు చూస్తుంటే, మిగిలిన జాతులన్నీ ఇప్పుడు జరగబోయే సభలో తమ ధృక్పధం ఎలా తెలియచెయ్యాలో మంతనాలు చేస్తున్నాయి.స్వజాతి గార్ధభాలు కొన్ని, ఈ నఓంఢ్ర గార్ధభకి బేషరతుగా మద్దతు పలకాలా? లేక అంశాలావారీగా మద్దతు తెలియచెయ్యాలా అని తర్జన భర్జన పడుతున్నాయి.
కొన్ని పెద్దరికం గార్ధభాలు గుంపు, గంభీరంగా తోకలు ఊపుతూ, మెజారిటీ ఎటు ఉంటే అటు దూకే ఆలోచన బయటపడనివ్వకుండా 30 డెసిబల్స్ మించకుండా ఓంఢ్రిస్తున్నాయి. పరువంలో ఉన్న పిల్ల గార్ధభాలు, “ఓంఢ్ర పెట్టడం తమ జన్మహక్కు, దానికి త్యజించడం అంటే జాతి అస్థిత్వం కోల్పోవడమే” పెద్ద ప్లకార్డులు తోకలకు కట్టుకుని అటుఇటు ఊపుతున్నాయి. “సభా మర్యాద, సభా మర్యాద?”, అంటూ వాటిని హెచ్చరించబోయిన గంభీర గార్ధభాలని వారించాయి కొన్ని సమయస్పూర్తి గార్ధభాలు, “ఈ సభ అయిపోయేవరకు వాటిని అలా ఊపుతూ ఉండనివ్వండి, ఈ గుంపులో కొద్దిగా గాలాడుతుంది” అంటూ.
వారు ఇవ్వబోయే సందేశం కోసం ఎదురు చూసి చూసి, శోషవచ్చ్చి సోలిపోయిన కొన్ని అర్భక గార్ధభాలు, పక్కనే ఉన్న సోడా కొట్టుని ఆశ్రయించాయి.
నానాజాతి గుంపులలో కొన్ని జంతువులు అక్కడికి వినోదం కోసం వస్తే, కొన్ని వేట కోసం వచ్చాయై. బాగా ట్రెయిండ్ అయినవి కొన్ని వేగుల్లా పనిచేయడానికి, కొన్నేమో ఊరికే ఆరుబయట తిరగే బదులు, ఇక్కడకొస్తే ఏమైనా చిరుతిండి దొరకచ్చేమో అన్న ఆశతో, కొన్నేమో మావాటితో మేము, మాకు అజెండా ఏమీ లేదు మా జాతి జెండానే ముఖ్యం అనుకుంటూ ఈ సభలో దూరిపోయాయి.
గలగలలు, గొణగొణలు, గుసగుసలు, కీచుగొంతులు, మౌనముద్రలు, హుంకరింపులు, అదిలింపులు, బెదిరింపులు, లాలింపులు, కేరింతలు, గావుకేకలు, పెడబొబ్బలు, ఘర్జనలు, వెక్కిరింతలు, పలకరింపులు, చీత్కరింపులు, అలా అలా అన్ని రకాల ఇంపులులో స్టేజీ మీద ఉన్న “న ఓంఢ్ర గార్ధభ” ని పట్టించుకునేవాళ్ళే లేకపోయారు.
ప్రేక్షకులందరి దృష్టి తనవైపు మరల్చుకోవాలనుకున్న తపనతో “సైలెన్స్” అని మైకులో అరవాలనుకున్నా కానీ, ఆ ఓంఢ్రింపు కూడా వ్రతభంగమే అవుతుందని, ఏమీ చెయ్యాలో తెలియని దిక్కుతోచక దిక్కులు చూస్తూ ఉండిపోయారు “న ఓంఢ్ర గార్ధభ” గారు.
నీతి: ప్రతిజ్ఞ కంటే ప్రచారం ముఖ్యం!
#అంతర్వాహిని_కథలు

వాహ్! మజా ఆ గయా !
అన్నట్టు స్వజాతి గార్దభాలు ఒక భాష లోనే సభా కార్యక్రమాలు చేయాలని షరతులు గాని పెట్టారా?
అసలు సమస్య అంతా భాషే!
ఇంత సంక్షిప్తమైన ‘ఎంగేజ్మెంట్ ఫార్మింగ్’ అన్న విషయాన్ని ఎండగడుతూ బహుశా george orwell గారి animal ఫార్మ్ inspired పోస్ట్ చూడలేదంటే మీరు నమ్మాల్సిందే ..
మాస్టారూ! బొత్తిగా అర్ధం కాలేదు. మీరు అసలు తిడుతున్నారో, పొగడుతున్నారో తెలియక మీమాంసలో ఉన్నా! కొంచెం విడమర్చి చెప్పరూ
అలాంటి కామెంట్ పెట్టడం వల్లనే కదా ఆ తర్వాత మనం ఎంతో కొంత సంభాషించుకున్నది 😉
మీకు చాలా చిన్న నిడివిలోనే లోతైన విషయాలను కెలికేస్తున్నారు ..
మీకు ఈ పంధా బాగా అబ్బేసినట్లు వున్నది
ఏమిటో మాస్టారు. నాకు ఇంకా అయోమయంగానే ఉంది. ఈ దరిమిలా మీతో పరిచయం అవ్వడం, అయోమయంలో బహు ఆహ్లాదానంద క్షణం!