స్వదేశీ – ఆత్మనిర్భర్ లాంటి భావాలు దుర్వినియోగం కాకుండా ప్రజలు చేయాల్సిందేమిటి?

గత వ్యాసంలో(http://paluku.in/?p=1648) స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రభుత్వం పిలుపివ్వటం ఎంత దివాళాకోరు ఆలోచనో, సామాన్య ప్రజలుగా మనకి స్వదేశీ ఎందుకు ఉపయోగకరం కాదో మాటాడుకున్నాం (నాణ్యత, ధర విషయంలో రాజీ పడాల్సివస్తుంది కాబట్టి). నాణ్యత విషయంలో ప్రధాన దోషి మన ప్రభుత్వాలే. వస్తునాణ్యతా ప్రమాణాలని సరిగ్గా నిర్దేశించటంలో, తయారీదారుల ఫాక్టరీల్లో తరచుగా తనిఖీలు నిర్వహించి నిస్పాక్షికంగా, నిర్దాక్షిణ్యంగా జరిమానాలు విధించటంలో, లైసెన్సులు రద్దు చేయటంలో ప్రభుత్వ అధికారుల అలసత్వం, అవినీతి గురించి మనకి తెలియంది కాదు. రెస్టారెంట్లలో ఆహార పదార్థాలే కావొచ్చు, మార్కెట్లో అమ్మబడుతున్న పన్నీరు, నూనెలు, డీజిల్, ఆఖరికి ప్రాణాలు నిలబెట్టాల్సిన మందుల్లో కూడా కల్తీనే (లేదా నాసిరకం ప్రమాణాలే). ఇలా చేసే వ్యాపారసంస్థల్లో ఎక్కువ ఉండేది స్వదేశీనా, విదేశీనా అనే విషయం మీ ఊహకే వదిలేస్తున్నాను.

ఇక ఆత్మనిర్భర్ విషయానికొస్తే నేను చెప్పేది గుండె నిబ్బరం చేసుకుని వినండి. ఏ కారణాలచేతైనా ప్రపంచ రవాణా వ్యవస్ధ అస్తవ్యస్తమైనప్పుడు గానీ, ఏ దేశంతోనైనా వైరం ఏర్పడినప్పుడు గానీ మన దేశ ఆర్థిక వ్యవస్థ, అలాగే రక్షణ వ్యవస్థ స్తంభించిపోకుండా డిఫెన్స్, లాజిస్టిక్స్, ఎనర్జీ, రేర్ మినరల్స్ లాంటివి తయారు చేసే సంస్థలు మన దేశంలోనే ఉండటం, మన దేశస్తుల ఆధీనంలో ఉండటం ఆవశ్యకమే. కాబట్టి పైన ఉదహరించిన రంగాల్లో ప్రభుత్వరంగ సంస్థలు లేదా పేరు మోసిన ప్రైవేటు సంస్థలు ఉండటం మంచిదే. కానీ రఫాలే యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో చూశాం కదా. ప్రభుత్వ సంస్థ HAL ని కాదని, ఆ రంగంలో ఎంతో కొంత అనుభవమున్న TATA గ్రూప్ ని కాదని ఏమాత్రం అనుభవం లేని అనిల్ అంబానీకి కట్టబెట్టారు. గత పదకొండేళ్ళగా భారీ పోర్టులు, విమానాశ్రయాలు, ఎనర్జీ, మైనింగ్ లాంటి రంగాల్లో అదానీ గ్రూప్ దే పైచేయి ఎందుకవుతుందో, కొన్నిసార్లు ప్రభుత్వరంగ సంస్థలకి కూడా అవకాశం ఎందుకు దొరకట్లేదో ఆలోచించండి. నిన్నగాక మొన్న బీహార్లో వెయ్యి ఎకరాలకి పైగా భూమి రైతుల దగ్గర సేకరించి అదాని పవర్ కి ఎకరానికి రూపాయి లెక్కన లీజుకిచ్చారు.

ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో స్వదేశీ, స్వావలంబన పేరుతో వేరే రంగాల్లో కూడా అతికొద్ది స్వదేశీ మిత్రులకే పెద్ద పీట వేసే ప్రమాదముంది. కాబట్టి చివరాఖరిగా నేను చెప్పొచ్చేదేంటంటే స్వదేశీ పేరుతో నాణ్యత, ధరల విషయంలో రాజీ పడొద్దు. ప్రభుత్వ యంత్రాంగం వస్తు నాణ్యత విషయంలో జవాబుదారీతనం చూపించేలా నిలదీస్తూనే ఉండండి. ఆత్మ నిర్భరత కొన్ని రంగాల్లోనే అవసరం, అక్కడ కూడా ప్రభుత్వ కాంట్రాక్టులు, లైసెన్సులు పారదర్శకమైన పద్దతిలో నిర్ధారించబడేలా ప్రభుత్వాన్ని కోరండి.

Nag Vasireddy

I would rather talk about where I want to go than where I came from. I study - and create content about - history, literature, politics, economics and movies. And, I love taking regular, short vacations with family or friends.

1 Comment Leave a Reply

  1. మీరు చెప్పింది అక్షరాలా నిజం. కానీ బ్రష్టు పట్టిన ప్రస్తుత రాజకీయ వ్యవస్థ వల్ల ఆ పని కాదు. కాబోదు.

Leave a Reply to Ghouse Hyd Cancel reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

మీ జీవితంపై బాగా ప్రభావం చూపిన మూడు పుస్తకాల పేర్లేమిటి?

కాస్త వైవిధ్యముగా వివరించే ప్రయత్నం చేసానేమో అన్న భావనతో రాసిన పోస్ట్ అలా

అనాహత

స్నిగ్ధ కు ఎదురైన ఈ అనుభవం తనని ఒక మహోన్నత కార్యం చేసేలా