బ్యాంక్ ఉద్యోగంలో కఠిన మైనది,అందరూ కోరుకునేది foreign Exchange(Forex) dept. అంతా రూల్స్ మయం. అందులోకి వెళ్ళాలంటే అప్పట్లో తెల్లజుట్టు అధమం. అటువంటి dept కు నన్ను పోస్ట్ చేశారు. అందులోనూ probation లో.నాకప్పుడు 25 ఏళ్ళు నిండలేదు.అందులో న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్. వామ్మో ! అసలు ఎవరూ ఊహించలేని పరిణామం..ఇంపోర్ట్స్ హెడ్ గా వెళ్ళా.
నా పక్కన తల నెరిసిన ఓ అరవతను ఎక్సపోర్ట్స్ హెడ్. పొద్దున వెళ్తే సాయంత్రం 7 వరకు పని అంతా ఔపోసన పట్టటం. ఓ రెండు నెలలు గడిచాయి. 16 బ్రాంచీలు నాకు reporting (jk నుండి mp వరకు.) .పని మీద పట్టు బాగా సంపాదించా.
ఆ సమయంలో ఒక సమస్య వచ్చింది. ఘజియాబాద్ HCL అకౌంట్ నా పరిధి లోనిది. అప్పుడు వాళ్ళు ఏనుగంత కంప్యూటర్లు చేసేవారు. వాళ్ళ పర్చేస్ హెడ్ వచ్చి మేనేజర్ కేబిన్ లో వెళ్ళి imports అని అన్నాడట. మానేజర్ కుముదం మ్యాగజిన్ చదువుతూ గో టు ghouse అన్నాడట.వాడికి కోపం నెత్తి కెక్కి నాట్యమాడింది. कौन से गधा को बिठाया అని చిందులు.నేను “77” కూల్ డ్రింక్ తెప్పించి విషయం అడిగా. నువ్వు కొత్తవాడివి.నీకు తెలియదు పో అన్నాడు.
సంగతి : సీకో జపాన్ నుండి పార్టులు import చేయటానికి HCL తరపున మా బ్యాంక్ ఒక LC ఇష్యూ చేసింది. అది yen currency లో ఉన్నా కూడా సీకొ కు నష్టం వస్తుందని(విదేశీ మారక ద్రవ్యం వల్ల) imports ఆపేస్తామని టెలెక్స్. వాళ్ళకి yen లో నే డబ్బు కావాలంట. మాకా జపాన్ బ్యాంకులలో yen acct లేదు. మాకున్న పౌండ్ అకౌంట్ నుండి మారకం వల్ల వాళ్లకు నష్టం వస్తుందని సప్లై ఆపేశారు. నేను విని నాకు 4 రోజులు టైం ఇప్పించండి అని బామాలి పంపించేశాను.
నాకు ఏమి పాలుపోలేదు. పక్కన ఎక్సపోర్ట్స్ వాడికి చీమ కుట్టినట్టు కూడా లేదు.ఆ రోజంతా ఆలోచించా.
మా బ్యాంక్ పౌండ్ అకౌంట్ NatWest bank లో ఉంది.మా సుత్తి బ్యాంక్ అకౌంట్ NatWest లో ఉండగా లేంది, NatWest లాంటి పెద్ద బ్యాంక్ వాళ్ల yen acct అతి పెద్దదైన బ్యాంక్ ఆఫ్ టోక్యో లో ఉండదా అని ఆలోచించా.
feeble logic.
నాకు ఎవరూ ఊహించని ఆలోచన వచ్చింది. నేను NatWest bank వాళ్ళ yen acct ను ఆపరేట్ చేస్తే ఎలాగుంటుంది?
ఎలా..అని సంశయం. సరే మూడు పేజీల ఉత్తరం NatWest కు రెడీ చేశా.telex ద్వారా పంపాలి. నాకా telex టైపింగు రాదు. మేనేజర్ కు చూపిస్తే ఇది కుదరదు అని అంటారు. ఎలా?
మా బ్రాంచ్ బ్యూటీ(నాకు బులుగు స్వేట్టర్ అల్లి గిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి- ఆముచ్చట మరో సారి ) దగ్గరకు వెళ్ళి Cavendish లో ఐస్ క్రీం ఇప్పిస్తా..నాకు మెసేజ్ టైప్ చేసి పెట్టు అన్నా. మేనేజర్ సంతకం పట్రా అంది.లేదన్నా.
నాకు టైపు చేసి perforated paper ribbon పంచ్ చేసి ఇవ్వు. నేనే ట్రాన్స్మిట్ చేసుకొంటా.. అని అడిగా..సరే అని ఒక మెలిక పెట్టింది. తనను సినిమా కు తీసుకొని వెళ్ళాలి అంది నవ్వుతూ. నేను కుదరదు.ఐస్క్రీమ్ మాత్రమే అన్నా.ముందు ఒప్పుకోలేదు. సినిమా అంది. I was firm. చివరకు నేను బండోడు అని నిర్ధారించుకొని సరే అని పేపర్ రిబ్బన్ కట్ చేసి పద ఐస్ క్రీం ఇప్పించు అంది.
నేను ఐస్ క్రీం తనతో బాటు గబగబ తింటుంటే అలా తినకూడదు అని నాకు క్లాసు పీకింది. అమ్మాయి తో వచ్చినప్పుడు కొంప లంటుకు పోతున్నాయని ఐస్ క్రీమ్ తిన కూడదు. కబుర్లు చెపుతూ ఒక గంట స్పెండ్ చేట్టాలి అని ఎలిమెంటరి క్లాసు పీకింది. వింటం తప్పదుగా..
గంట తర్వాత Cavendish నుండి బయట పడి , బ్రాంచ్ కు వచ్చి నా దగ్గర ఉన్న code book నుంచి కోడ్ కంప్యూట్ చేసి telex రూం కు వెళ్ళి మెసేజ్ ట్రాన్స్మిట్ చేసేసా.. దాని కాపీ బ్యాంక్ ఆఫ్ టోక్యో కు కూడా పంపేశా.
మూడురోజులు గడిచాయి.నాకు నిద్ర పట్ట లేదు. నాలుగో రోజు రెండు telex మెసేజ్ లు వచ్చాయి. ఒకటి NatWest నుండి. వాళ్లు “ మీ problem అర్థం అయింది. As a special case మీరు ఈ క్రింద తెలిపిన 16 కరెన్సీల బ్యాంక్ అకౌంట్లు మా తరపున ఆపరేట్ చేయవచ్చు కాని ఒక రోజు ముందు తెలియపరచండి.” నేను ఎగిరి గంతు వేశా.
రెండో టెలెక్స్ బ్యాంక్ అఫ్ టోక్యో నుండి. “మాకు NatWest నుండి అనుమతి వచ్చింది.వాళ్ళ అకౌంట్ మీ తరపున డెబిట్ చేశాము.శీకో కు నిన్ననే అమౌంట్ క్రెడిట్ చేసాము”. నేను గాల్లో తేలుతున్న ఫీలింగ్.
ఇంతలో ఘజియాబాద్ నుండి ఫోన్. HCL purchase హెడ్ సంతోషం గా నా parts airlift అయ్యాయి అంటూ రేపు అశోక లో లంచ్ అన్నారు. సున్నితంగా రాలేను అని చెప్పా.
ఇక నేను జరిగిన కథ అంతా సెంట్రల్ ఆఫీస్ కు 4 పేజీల foolscape టైప్ చేయించి,telex కాపీలు జత చేసి మేనేజర్ దగ్గరకు వెళ్ళాను.ఆయన ఒక పేజీ చదివి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.నువ్వు ఫ్రాడ్ చేశావు.నేను సంతకం చెయ్యను. అన్నారు.నేను లేని ఓపిక తెచ్చుకుని మొత్తం వివరంగా చెప్పాను..వింటేగా? NatWest ను ఒప్పించగలిగా.. నా మే నేజర్ ను ఒప్పించలేక పోతున్నా.కోపం వచ్చేస్తుంది.
ఇక లాభం లేదని.. సర్ fraud అని సెంట్రల్ ఆఫీస్ తేలిస్తే నన్ను ఉద్యోగం నుండి పీకేస్తారు.మీకెంటి అన్నా. ఊహు! సంతకం పెట్టనన్నారు. నేను ఆయన పెన్ను టేబుల్ పై నుండి తీసుకొని “yours truly ..Manager “ దగ్గర Slash పెట్టి నేను నా ఫుల్ సంతకం చేసి పేరు రాసి పక్కన Probationary officer అని రాశా. (PO అదేదో పెద్ద designation అయినట్టు). ఆయన నన్ను ఎంత ధైర్యం? వెంటనే Forex deptనుండి వెళ్ళిపో అన్నారు. నేను సెంట్రల్ ఆఫీస్ నుండి జవాబు వచ్చిన తర్వాత వెళ్తాను అని బయటకు వచ్చి ఆ లెటర్ despatch లో ఇచ్చేసా.
ఒక వారం తర్వాత సెంట్రల్ ఆఫీస్ నుండి ఒక పెద్ద లెటర్. Ghouse గారికి .”మీరు ఇలా మాకు ముందు చెప్పకుండా చెయ్యటం పద్ధతి గాదు. ఇక ముందు మా పెర్మిషన్ తీసుకోండి. మీరు సజెస్ట్ చేసినట్టు మేము yen acct Japan లో Dai-ichi Kogyan బ్యాంక్ లో ఓపెన్ చేశాము.దాని నంబర్ క్రింద ఇస్తున్నాం”
Manager లెటర్ చదివి చూసావా..నే చెప్పాగా. నా మాట వింటేగా? అన్నారు. నేను వెంటనే నేను చేసింది ఫ్రాడ్ కాదు గా అన్నాను.ఆయన గుర్రుగా చూశారు.
రెండో లెటరు నా పేరు మీద సీల్డ్. MD ఆఫీస్ నుండి.ఓపెన్ చేశా. నేను చేసిన పని ఔట్ Of box అని మెచ్చుకొన్నారు. చివరన అన్నివేళలా అప్రమత్తం గా ఉండాలి ఇటువంటి undocumented protocols attempt చేస్తున్నపుడు అని ముగించారు. ఆ లెటరు మేనేజర్ చూసి అరే MD letter నాకు ఇంతవరకు రాలేదు. నీకు వచ్చింది అని అంటూనే చూసావా నువ్వు చేసింది రూల్ ప్రకారం కాదు అన్నారు .
నువ్వు రూల్ ప్రకారం ముందస్తుగా నా అనుమతి తీసుకో లేదు. కాబట్టి Forex నుండి నిన్ను FD dept కు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పారు. నేను కూడా నిశ్చయించుకొన్నా ఇంక అక్కడ కుదరదు అని. Ok sir అన్నా.
కానీ మేము నలుగురు PO లం చంద్రశేఖర్ అని ఓ Forex guru ఉండేవారు. ఆయనను ఒప్పించి రోజూ Office hours తర్వాత 6–8pm Forex ఓ 5 నెలలు నేర్చుకున్నాం.
కొసమెరుపు: కట్ చేస్తే. ఆ మే నేజర్ గారు 1987 లో Hyd కు జోనల్ మేనేజర్ గా వచ్చారు.అప్పుడు నేను నల్లకుంట బ్రాంచ్ మేనేజర్ .అందరూ airport కు వెళ్ళాం. ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ నా దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడున్నావా ? అని కొంచెం సేపు నా చేతిని వదల్లేదు. తర్వాత భుజం మీద చెయ్యి వేసి కారు వరకు నాతో నడిచారు.
( వీడు ఇక్కడ కూడా దాపురించాడా అని మనసులో అనుకోని ఉంటారేమో ఆయన ) .
